You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
అందమైన, బలమైన సైనికులను మహారాజే స్వయంగా ఎంచుకుంటాడు. ఒట్టి చేతులతో మనిషిని చంపగిలిగే స్థాయిలో వాళ్లకు శిక్షణ ఇప్పిస్తాడు. వాళ్లనే తనకూ, తన రాజ్యానికీ రక్షణ కవచంలా మార్చుకుంటాడు. ఇదీ ఆఫ్రికాలోని డాహొమి రాజ్యంలో ఒకనాటి పరిస్థితి.
డాహొమి మహిళలు - ఆఫ్రికాలో ఓ కొత్త చరిత్రకు ప్రాణం పోసిన వీరవనితలు వీళ్లు. ప్రస్తుత బెనిమ్ దేశంలో డాహొమి ఉండేది. డాహొమి రాజ్యంలో మహిళా సైనికులే ప్రధాన పాత్ర పోషించారు.
అక్కడ మహిళలు శక్తిమంతమైన యోధులుగా శిక్షణ తీసుకున్నారు. మహారాజుకు భద్రత కల్పించడమే వాళ్ల ప్రధాన విధి. యురోపియన్ వలస పాలకుల వెన్నులో వాళ్లు వణుకు పుట్టించారు.
టీనేజీలో అందం, సామర్థ్యం ఆధారంగా మహారాజే ఈ మహిళా సైనికులను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించేవాడు. ప్రతి విషయంలో మగవాళ్ల కంటే మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ల శిక్షణ సాగేది. వీళ్లు నడిచొస్తుంటే రాజ్యంలోని మగవాళ్లంతా పక్కకు తొలగాల్సిందే. 1800 నాటికి ఇలాంటి 4 వేల మంది మహిళలు డాహొమి రాజ్యం తరఫున పోరాడారు.
యురోపియన్ వలస పాలన తీవ్రంగా ఉన్న రోజుల్లో వాళ్లు డాహొమికి రక్షణ కవచంలా నిలబడ్డారు. ఫ్రెంచ్ పాలకులు క్రమంగా డాహొమిలో తమ బలాన్ని పెంచుకునే సమయంలో వీరు ఎదురు నిలిచి పోరాడారు. కానీ ఆ ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగలేదు. 1892లో డాహొమి రాజ్యం ఫ్రెంచ్ అధీనంలోకి వెళ్లిపోయింది. దాంతో డాహొమి రాజ్యానికి, మహిళా సైన్యం ప్రస్థానానికి తెరపడింది.
కానీ ఇప్పటికీ వాళ్ల ఘనతను కీర్తిస్తూ బెనిన్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ మహిళల గాథ నేపథ్యంలో తీస్తున్న సినిమాలో వియోలా డేవిస్, లుపిటా యోంగో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)