You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రత్యేక హోదా డైరీ: ‘మోదీజీ.. ప్లీజ్ మీ హామీ నెరవేర్చండి’
మోదీజీ.. ప్లీజ్ మీ హామీ నెరవేర్చండి: జగన్
రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు.
'మా ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఆస్పత్రిలో చేరారు. నరేంద్ర మోదీగారు.. ఎంపీల ప్రాణాలు, ఏపీ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నాయి. హోదాపై మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నా" అంటూ ట్వీట్ చేశారు.
దిల్లీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డిలకు సంఘీభావం తెలుపుతూ వైఎస్. విజయమ్మ, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు.
రాజ్‌ఘాట్ వద్ద తెదేపా ఎంపీల నిరసన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ దిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ ఎంపీలు శాంతియుత నిరసన చేపట్టారు.
విభజనతో ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రధాని నరేంద్ర మోదీ గుండె కరిగేలా లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: శరద్‌యాదవ్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మాజీ కేంద్ర మంత్రి శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు.
దిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా చట్టం ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు.
ఆ ఎంపీలకు మద్దతిస్తున్నాం: జనసేన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం దిల్లీలో నిరసనలు, దీక్షలు చేస్తున్న ఎంపీలకు మద్దతు ఇస్తున్నట్టు జనసేన తెలిపింది.
ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లందరికీ జనసేన అండగా ఉంటుందని ప్రకటించింది.
టీడీపీ ఎంపీల అరెస్ట్ తీరు ఏమాత్రం గౌరవప్రదంగా లేదని.. వైసీపీ ఎంపీల రాజీనామాల తీరు సరిగా లేదనీ.. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డాక రాజీనామా చేస్తే ఎప్పటికి ఆమోదం పొందాలి? అని జనసేన ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)