ఈమె బుల్లెట్ భవానీ
బళ్ల సతీశ్, బీబీసీ తెలుగు
ఆమె పేరు ఆకెళ్ల భవానీ. హైదరాబాద్‌లోని గాంధీ నగర్‌లో.. భవానీ అని చెబితే ఎవరూ పెద్దగా గుర్తుపట్టరు. కానీ బుల్లెట్ భవానీ అంటే అందరూ ఠక్కున చెప్పేస్తారు.
స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోన్న భవానీ.. ఈ మధ్యే బుల్లెట్ కొనుక్కున్నారు. అదేంటీ.. యాక్టివానో, స్కూటీనో కాకుండా ఏకంగా బుల్లెట్ ఎందుకు అనుకుంటున్నారా?
షోరూమ్ వాళ్లు కూడా సరిగ్గా ఈ మాటే అన్నారట.
"మీ అబ్బాయికా మేడమ్" అని అడిగాడట షోరూమ్ ఉద్యోగి.
''కాదు, నాకే'' అని చెప్పారట భవానీ.
భవానీ బుల్లెట్ నడపడం పెద్ద విషయమా? నిజం చెప్పాలంటే ఇది వింతేమీ కాదు.
కానీ 50కి చేరువైన ఓ మధ్య తరగతి భారతీయ మహిళ ఇలాంటి సాహసానికి పూనుకోవడం కచ్చితంగా విశేషమే.

భవానీ అందరిలాంటి మహిళే. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నంతలో బాగానే చదివించారు.
శ్రీవేంకటేశ్వర యూనిర్సిటీలో మాథ్స్‌లో ఆమె గోల్డ్ మెడలిస్ట్. పెళ్ళి చేశారు. ఇద్దరు పిల్లల తల్లి.
ఉద్యోగం చేస్తూనే పిల్లలను పెంచి పెద్ద చేశారు. కుటుంబ బాధ్యతలు మోస్తూ వెనక్కు తిరిగి చూసుకుంటే 47 ఏళ్లు వచ్చేశాయి. మరో పదేళ్లలో రిటైర్మెంట్.

అంతేనా జీవితం! ఇంకేం లేదా?
భవానీ ఒకసారి వెనక్కు తిరిగి చూసుకున్నారు.
ఇంటర్‌లో ఉండగా నాన్నగారు దగ్గరుండి గేర్‌లెస్ స్కూటర్ నడపడం నేర్పించారు. ఎక్కడ పడిపోతుందో అని ఆమె వెనకే పరుగు పెట్టేవారు.
ఆ సన్నివేశం ఇప్పటికీ భవానీ కళ్లల్లో తిరుగుతూనే ఉంది. ఎందుకంటే, భవానీకి బండి నడపడం చాలా ఇష్టం. యూనివర్సిటీలో చేరాక ఆ ఇష్టం మరింత పెరిగింది.

ముందు నుంచీ భవానీ చదువుల్లో చురుగ్గా ఉండేవారు కోచింగ్ లేకుండానే బ్యాంకు ఉద్యోగం సంపాదించారు. సివిల్స్ రాసి ఐపీఎస్ అవ్వాలన్న కోరిక వేర్వేరు కారణాల వల్ల తీరలేదు.
అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవేవీ నెరవేరలేదు. అలాగని ఆ కోరికలు చావలేదు. ఎప్పటికైనా వాటిని నిజం చేయాలనేది భవాని పట్టుదల.
చాలా కలలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఆడవాళ్లకైతే డబ్బుతో పాటు కుటుంబంతోనూ ముడిపడి ఉంటాయి. భవానీకీ అదే సమస్య వచ్చింది.
ఆ సమస్యలతోనే తన కలల్ని ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చారు.

చిన్నప్పుడు భవానీ చాలా భయస్తురాలు. బయటకెళ్లాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా అన్నిటికీ భయమే. కానీ జీవితంలో వచ్చిన ఇబ్బందులే ఆమెలో కొత్త ధైర్యాన్ని నింపాయి.
కేవలం బైక్ నడపడమే కాదండోయ్.. ఆమె ట్రెక్కింగ్ చేస్తారు కూడా. వయోలిన్ నేర్చుకోవాలన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నారు. యోగాలో డిప్లొమా చేశారు. ఇవన్నీ చేస్తున్నా, ఇంకా ఏదో లోటు ఉండిపోయింది. అదే బుల్లెట్!

చాలా మందికి డ్రీమ్ బైక్ ఉంటుంది. కొత్త మోడల్ వచ్చినప్పుడు అది మారిపోతూ ఉంటుంది. కానీ భవానీకి ఇది 30 ఏళ్ల నాటి డ్రీమ్ బైక్. అందుకే బుల్లెట్ కొనేయాలని డిసైడ్ అయ్యారు.
బుల్లెట్ అనగానే ఇంట్లో భయపడ్డారు. సన్నగా ఉంటావు కదా. బుల్లెట్ బరువు ఆపలేవేమో అన్నారు.
ఏమైనా జరిగితే? ఇవే భయాలు పెద్ద వాళ్లకు.
పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆమె మాత్రం ధైర్యంగానే ఉన్నారు.
ఎవరి సాయమూ లేకుండా తానే లోన్ తీసుకున్నారు. తానొక్కరే షోరూమ్‌కి వెళ్లి బుల్లెట్ కొనుక్కున్నారు. నచ్చిన పని సొంతంగా చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించారు.

ఫొటో సోర్స్, BHAVANI
ఇంట్లో వాళ్లకొచ్చిన అనుమానమే రిజిస్ట్రేషన్ చేయించిన ఏజెంట్‌కి కూడా వచ్చింది.
"బుల్లెట్ ఎందుకు మేడమ్ మీకు? ఎక్కడైనా కిందపడితే కనీసం లేపలేరు!" అన్నాడు.
"అంతగా కిందపడితే మీలాంటి వారెవరో వచ్చి సాయం చేస్తార్లెండి!" అంటూ ముందుకెళ్లిపోయింది భవాని.
నిజానికి ఆ అనుమానం భవానిని కూడా వేధించింది. అయితే ఆ భయం తన గురించి కాదు. ఆడవాళ్లందరి గురించి.
ఎందుకంటే, బండిని హ్యాండిల్ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా "ఆడవాళ్లకు ఇంత పెద్ద బండ్లు ఎందుకు? ఇంట్లో కూర్చోక రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు" అంటారని ఆమె భయం!
ఆడవాళ్లకు చెడ్డపేరు రాకుడదనే తాను అన్నిజాగ్రత్తలు తీసుకున్నా అంటారు భవాని.

ఫొటో సోర్స్, Bhavani
అమ్మాయిలు బుల్లెట్ నడపడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ వయసు మహిళ బుల్లెట్‌పై వెళ్లడం మాత్రం చూసే వాళ్లకు వింతే.
తాను రోడ్‌పై వెళ్తున్నప్పుడు కనీసం సగం మందైనా తిరిగి చూస్తారంటారామె.
వారంతా చేతులూపి ఆమెను అభినందిస్తుంటారట. చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా భవానీని చూసి తామే బుల్లెట్ నడుపుతున్నంత సంబరపడుతుంటారు.

ఫొటో సోర్స్, Bhavani
బుల్లెట్ కొని ఇంట్లో పెట్టుకోవడమో, ఆఫీసుకు వెళ్లిరావడమో కాదు. ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీద లాంగ్ రైడ్‌కి వెళ్లి పోయారు.
అప్పటి వరకూ గేర్‌లెస్ బైక్ మాత్రమే నడిపిన అనుభవం ఉన్న భవాని, ఈ లాంగ్ ట్రిప్ విషయంలో కూడా రిస్క్ చేశారు.
ఈ బుల్లెట్ మీద కన్యాకుమారి నుంచి లడాఖ్ వరకూ.. వీలైతే భూటాన్... ఇంకా వీలైతే భూమి మీద ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళాలని భవాని కోరిక.
మరో రెండేళ్లలో కచ్చితంగా కన్యాకుమారి నుంచి లడాఖ్ టూర్ వెళ్తానంటున్నారు భవాని.

ఫొటో సోర్స్, Bhavani
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)