You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవర్ బ్యాంక్ వల్లే ఆ విమానంలో మంటలు చెలరేగాయా?
- రచయిత, గావిన్ బట్లర్
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ కొరియాలో జనవరిలో ఒక ప్రయాణికుల విమానంలో మంటలు చెలరేగాయి. ఆ విమానం కాలిపోవడానికి కారణం పోర్టబుల్ పవర్ బ్యాంకు కావొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
కొరియాలోని గిమ్హే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ బుసాన్ విమానం జనవరి 28న మంటల్లో చిక్కుకుంది.
వెంటనే ఆ విమానం నుంచి ప్రయాణికులను కిందకి దించేశారు. ముగ్గురికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి.
టేకాఫ్ అయ్యేందుకు కాస్త ముందు.. ఈ మంటలు చెలరేగినట్లు ఆ సమయంలో అధికారులు వెల్లడించారు.
పవర్ బ్యాంకు బ్యాటరీ లోపల ఉండే ఇన్సులేషన్ పేలిపోవడంతో విమానంలో ఈ మంటలు చెలరేగినట్లు ఇన్వెస్టిగేటర్ల దర్యాప్తులో వెల్లడైనట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రి శుక్రవారం చెప్పారు.
తొలుత మంటలు చెలరేగిన ప్రాంతంలో ఉన్న ఓవర్‌హెడ్ లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో పవర్ బ్యాంకు ఉందని, చెల్లాచెదురుగా పడిపోయిన దానికి కాలిన గుర్తులు కనిపించాయని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, బ్యాటరీ పేలడానికి కారణమేమై ఉంటుందో ఇన్వెస్టిగేటర్లు చెప్పలేకపోయారని తెలిపారు.
ఇది కేవలం దర్యాప్తుకు చెందిన మధ్యంతర పరిశీలనలు మాత్రమేనని, ఎయిర్‌బస్ ఏ321 సియో ప్రమాదానికి చెందిన తుది రిపోర్టు కాదని చెప్పారు.
భద్రతాపరమైన భయాలతో ఎన్నో ఏళ్లుగా విమానయాన సంస్థలు చెక్డ్ లగేజీలో పవర్ బ్యాంకులను అనుమతించడం లేదు. ఈ డివైజ్‌ల లోపలున్న లిథియం అయాన్ బ్యాటరీలే దీనికి కారణం.
ఈ బ్యాటరీ తీవ్రమైన హీట్‌ను ఉత్పత్తి చేస్తాయి. తయారీలో ఏదైనా లోపాలున్నా లేదా డ్యామేజీ అయినా.. షార్ట్ సర్క్యూట్ చేసి, మంటలు చెలరేగుతాయి.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆదేశాల ప్రకారం... 2016 నుంచి ప్రయాణికుల విమానాల్లోని సరకుల్లో ఏ రకమైన లిథియం అయాన్ బ్యాటరీలను కూడా అనుమతించడం లేదు.
ఎయిర్ బుసాన్‌లో మంటలు చెలరేగిన తర్వాత, ఈ నిబంధలను మరింత కఠినతరం చేసింది ఆ విమానయాన సంస్థ. ప్రయాణికులు తమ ఆన్‌బోర్డు లగేజీలో కూడా పవర్ బ్యాంకులు తీసుకురాకుండా చూస్తోంది.
పవర్ బ్యాంకులు ఓవర్‌హీట్ అవుతుండటం పెరుగుతుండటంతో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
చైనా ఎయిర్‌లైన్స్, థాయి ఎయిర్‌వేస్ వంటి పలు విమానయాన సంస్థలు కూడా ఇదే రకమైన నిబంధలను తీసుకొచ్చాయి.
సింగపూర్ ఎయిర్‌లైన్స్, తన లో-కాస్ట్ యూనిట్ స్కూట్ ఏప్రిల్ 1 నుంచి ఆన్‌బోర్డులో పవర్ బ్యాంకుల వాడకాన్ని, చార్జింగ్‌ను నిషేధించనున్నట్టు ప్రకటించాయి.
పోర్టబుల్ బ్యాటరీలను, చార్జర్లను ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్లలో కాకుండా ప్రయాణికులు వ్యక్తిగతంగా తీసుకెళ్లేలా అని ప్రయాణిక విమానాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఆదేశాలు జారీ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)