You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా మిత్రపక్షాలు ఉపయోగించిన సైనిక స్థావరాలను తాలిబాన్లు ఏం చేయబోతున్నారు?
- రచయిత, అన్నాబెల్లె లియాంగ్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం గతంలో ఏర్పాటైన విదేశీ సైన్య స్థావరాలను వ్యాపారాల కోసం ప్రత్యేక ఆర్థిక జోన్లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది.
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏ దేశం కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు.
కాగా, అఫ్గానిస్తాన్ 20 ఏళ్లకు పైగా విదేశీ సైన్యం చేతిలో ఉంది.
అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవహారాలకు డిప్యూటీ ప్రధాన మంత్రిగా ఉన్న ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
‘‘పరిశ్రమల, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక జోన్లగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే విదేశీ సైన్య స్థావరాలను పరిశ్రమల, వాణిజ్య మంత్రిత్వ శాఖ దాని ఆధీనంలోకి తీసుకుంటోంది’’ అని ముల్లా బరాదర్ ఆదివారం తన ప్రకటనలో తెలిపారు.
రాజధాని కాబూల్, ఉత్తర బాల్క్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలు ఆయన చెప్పలేదు.
తమ పాలనను మెరుగ్గా నిర్వహించేందుకు, దేశీయంగా కొన్ని విషయాల్లో చట్టబద్ధతను పొందేందుకు తాలిబాన్లు తమ ఖజానాను కాస్త పెంచుకోవాల్సిన అవసరం ఉందని సింగపూర్‌లోని ఎస్. రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ముహమ్మద్ ఫైజల్ బిన్ అబ్దుల్ రెహమాన్ బీబీసీతో అన్నారు.
ముఖ్యంగా, తాలిబాన్లు ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉందన్నారు.
దీని కోసం రాజధానికి దగ్గర్లో, సరిహద్దుల్లో చైనా వంటి విదేశీ పెట్టుబడిదారుల కోసం సురక్షితమైన ఆర్థిక జోన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.
సరిహద్దు దేశాలతో ప్రాంతీయ వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పారు.
లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన నేచురల్ గ్యాస్, కాపర్ వంటి సహజ వనరులు తమ దేశంలో ఉన్నాయని అఫ్గానిస్తాన్ అంచనావేస్తోంది.
దేశంలో ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న అస్థిరతతో ఈ వనరులను అసలు వెలికితీయలేదు.
20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్ భూభాగంలో ఉన్న అమెరికా సైన్యం ఆగస్టు 2021లో కాబూల్ విమానాశ్రయం విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అమెరికా సుదీర్ఘ యుద్ధం ముగిసి, ఆ దేశం తాలిబాన్ల చేతికి వచ్చింది.
ఈ యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
విదేశీ సైన్యం అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవహారాలను విడిచిపెట్టినప్పటి నుంచి పలు సమస్యలతో ఆ దేశం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
చాలా ప్రభుత్వాలు ఆ దేశంపై ఆంక్షలు విధించగా, ఆ దేశ సెంట్రల్ బ్యాంకు విదేశీ ఆస్తులు స్తంభించిపోయాయి.
ఇంతకు ముందు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు లభించిన విదేశీ సాయం కూడా ప్రస్తుతం దొరకడం లేదు.
ఉత్తర అఫ్గానిస్తాన్‌లో ఆయిల్‌ను వెలికితీసేందుకు చైనీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్ చేసినట్టు ఈ ఏడాది ప్రారంభంలో తాలిబాన్లు చెప్పారు.
25 ఏళ్ల ఈ డీల్ ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక భాగస్వామ్యాన్ని తెలియజేసింది.
అయితే, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పరిపాలనకు బీజింగ్ అధికారికంగా మద్దతు ఇవ్వడం లేదు.
కానీ, ఆ దేశంపై మాత్రం చైనా ఆసక్తి చూపుతోంది. చైనా బెల్ట్, రోడ్డు కార్యక్రమానికి ఈ ప్రాంతాన్ని ముఖ్యమైన కేంద్రంగా భావిస్తోంది.
2013లో ఈ కార్యక్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. దీని ద్వారా పోర్టులు, రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునేందుకు వర్ధమాన దేశాలకు ఆర్థిక సహకారాన్ని కల్పిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
- ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)