అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి, ఆలోచించడానికి కూడా మాకు అనుమతి ఉండదు’

    • రచయిత, లీస్ డౌసెట్, జర్ఘున కర్గర్
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘నా కలం ఒక పక్షి రెక్క; కొన్ని కలలు కనడానికి, ఆలోచనలు చేయడానికి మాకు అనుమతి ఉండదు. అలాంటి కలలు, ఆలోచన గురించి ఈ కలం మీకు చెబుతుంది.’’

కాబుల్ వీధుల్లో, ఇతర నగరాల్లోని నిరసనల్లో అఫ్గాన్ మహిళల గొంతులు కొన్నిసార్లు చిన్నగా, మరికొన్నిసార్లు బిగ్గరగా వినిపిస్తాయి.

కానీ, ఎక్కువగా సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే వారు తమ ఆలోచనలను నిశ్శబ్ధంగా వ్యక్తపరుస్తారు.

తాలిబాన్ ప్రభుత్వ పాలనలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరించే దుస్తులు, పని చేసే ప్రదేశాలు ఇలా అన్నింటిపై వారిపై ఆంక్షలు విధించారు.

తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడానికి కొన్ని నెలల ముందు, అంటే 2018 ఆగస్టులో 18 మంది అఫ్గాన్ మహిళా రచయితలు నిజ జీవితాలే ప్రేరణగా కల్పిత కథలను రాశారు.

వాటిని ఈ ఏడాది ప్రారంభంలో ‘మై పెన్ ఈజ్ ద వింగ్ ఆఫ్ ఎ బర్డ్’ ఒక పుస్తకంలో ప్రచురించారు.

అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరులం అయ్యామని చాలామంది మహిళలు భావించారు.

అయితే, ఈ మహిళా రచయితలు లక్షలాది మంది మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అంశాలను ప్రతిబింబించడానికి తమ కలాలను ఉపయోగించారు.

కాబుల్‌కు చెందిన ఇద్దరు రచయితలు పరంద, సదాఫ్ అనే కలం పేర్లతో రహస్యంగా తమ ఆలోచనలను పంచుకున్నారు.

‘పింక్ స్కార్ఫ్ పాపమా?’

‘‘ఈరోజు నేను ఒక దృఢ నిశ్చయంతో నిద్ర లేచాను. వేసుకునే దుస్తుల్లో రోజూ ధరించే నలుపు స్కార్ఫ్‌కు బదులుగా గులాబీ స్కార్ఫ్‌ను ధరించాలని నిర్ణయించుకున్నా. గులాబీ స్కార్ఫ్ వేసుకోవడం పాపమా?’’

ఆడతనానికి ప్రతీకగా ‘గులాబీ’ రంగును ధరించడానికి పరంద ఇష్టపడతారు. కానీ, ఇప్పుడదే యుద్ధానికి కారణమైంది. మహిళలు నిరాడంబరంగా ఉండాలంటూ తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. బలవంతంగా వాటిని అమలు చేస్తున్నారు. ఈ సంప్రదాయక సమాజంలో అఫ్గాన్ మహిళలు కేవలం హిజాబ్ (హెడ్‌స్కార్ఫ్)‌కు వ్యతిరేకంగా పోరాడటం లేదు. ఎంపిక చేసే హక్కు కోసం పోరాడుతున్నారు. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో మీరు దీన్ని చూడొచ్చు.

‘మేం వెనక్కి వెళ్లలేం’

‘‘తిరోగమనంలోకి వెళ్లడం అంత సులభం కాదు. ఇక్కడ పురోగమించడం కూడా పెద్ద ప్రహసనం. ఇప్పుడు నేను ఆశావహంగా ఉండాలా? వద్దా? మేం మళ్లీ వెనక్కి వెళ్లలేం’’ అని రచయిత్రి హపీజుల్లా హమీమ్ రాశారు.

అరుదైన ప్రజా నిరసనలను అఫ్గాన్ మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ‘‘ఆహారం, పని, స్వేచ్ఛ’’ అంటూ బ్యానర్లు పట్టుకొని కాబుల్, ఇతర నగరాల్లో వీధుల్లోకి వచ్చారు.

వారిని బలవంతంగా చెదరగొట్టి, నిర్బంధించారు. నిర్బంధంలోని కొంతమంది అదృశ్యమయ్యారు.

ఇరాన్‌లో కూడా హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళళు నిరసనలు చేస్తున్నారు. కానీ, ఆఫ్గాన్ మహిళలు మాత్రం పనిచేసే హక్కు, బాలికలకు విద్యా హక్కు కోసం పోరాడుతున్నారు.

‘‘కోపంగా మారుతోన్న భయం’’

‘‘మా ఆఫీసు కారును తాలిబాన్ గార్డు ఆపాడు. అతను నా వైపు చూశాడు. నా గుండె వేగంగా కొట్టుకుంది. శరీరం వణికిపోయింది. అక్కడి నుంచి కారు కదలగానే కాస్త కుదుటపడ్డా. నా భయం, కోపంగా మారిపోయింది.’’

ఆ అనిశ్చితిని భరించడం చాలా కష్టం. కొంతమంది తాలిబాన్ గార్డులు దూకుడుగా వ్యవహరిస్తారు. కొంతమంది కాస్త అనుకూలంగా ఉంటారు. మహిళల ప్రయాణాలు నరక ప్రాయం. 72 కి.మీ కంటే ఎక్కువ దూరం వెళ్లాలంటే ఒక మగ సంరక్షుడు తోడు ఉండటం తప్పనిసరి. కొంతమంది తాలిబాన్ గార్డులు నిబంధన ప్రకారం మగ తోడు లేకుంటే మహిళలను తిరిగి ఇంటికి పంపిస్తారు.

‘‘13వ ఏట నిశ్చితార్థం’’

‘‘ప్రజల కోసం స్నానవాటికలు నిర్వహించే యజమాని కూతురికి నిశ్చితార్థం జరిగింది. ఇది చాలా అద్భుతం. ఆమెకు కేవలం 13 ఏళ్లు. ‘తాలిబాన్లు ఎలాగూ పాఠశాలలను తెరవనివ్వరు, కనీసం ఆమెను తన అదృష్టపు ఇంటికి వెళ్లనివ్వండి’ అని ఆ బాలిక తల్లి అన్నారు. ఆ బాలికను చూస్తే నన్ను నేనే చూసుకున్నట్లు ఉంది. తొలిసారి తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు నేను చాలా నిరాశ చెందాను. బలవంతపు పెళ్లికి నేను అంగీకరించాను. ఆ గాయాలు ఇంకా మానలేదు. కానీ, నేను దాన్ని తట్టుకొని నిలిచాను.’’

ఇది పునరావృత అణచివేత. 1990లలో తాలిబాన్ పాలనలో అనుభవించిన బాధలను అఫ్గాన్ మహిళలు గుర్తు చేసుకున్నారు. వారి పాలన, తమ విద్యకు అంతం పలికిందని చెప్పారు.

2001లో వారి ప్రభుత్వం కూలిపోయినప్పుడు పాఠశాలకు వెళ్లడం, విడాకులు తీసుకోవడం వంటి అవకాశాలను పరందతో పాటు ఆమె లాంటి చాలా మంది మహిళలు ఉపయోగించుకున్నారు.

కొత్త తరం బాలికలు మరింత పెద్ద కలలతో పెరిగారు. తమ పాఠశాలలు మూతపడటంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.

‘‘స్త్రీలపై పురుషుల వాడే పదాలు’’

‘నేను సోషల్ మీడియాను ఉపయోగించాను. కానీ, ఇప్పుడు నా నోరు మూసుకొని కూర్చుంటున్నా. మహిళల పట్ల పురుషులు వాడుతున్న భాషతో ఈ సమాజంపై విరక్తి కలిగింది. అఫ్గాన్ మహిళల సమస్యలకు మూలం పాలిస్తున్న ప్రభుత్వాల్లో లేదు, మహిళల పట్ల పురుషులకు ఉన్న చెడు ఆలోచనల్లోనే ఉందని నేను నమ్ముతున్నా.’’

అఫ్గాన్‌లో ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ పితృస్వామ్య వ్యవస్థ మాత్రం అలాగే ఉంటుంది. పురుషులు విధించిన పరిమితుల్లోనే చాలాకాలం మహిళలు జీవించారు.

కానీ, ఇటీవలి కాలంలో పురోగతి వెనక్కి వెళ్తోంది. దీన్ని ‘‘అస్థిరమైన అణిచివేత’’ అని ఐక్యరాజ్య సమితి వర్ణించింది. మహిళలు, బాలికలను అణిచిపెట్టి ఉండే సంప్రదాయక కుటుంబ నిబంధనలు బలోపేతం అవుతున్నాయని వ్యాఖ్యానించింది.

‘‘మంచి రోజులు వస్తాయి’’

‘‘ఇప్పుడేం జరుగుతుందో నేను తప్పకుండా రాయాలి. ఇక్కడ మీడియా తక్కువగా ఉంది. ఏదో ఒకరోజు మహిళలకు, బాలికలకు అఫ్గాన్ ఒక మంచి దేశంగా మారుతుందని నేను నమ్ముతున్నా. దీనికి సమయం పడుతుంది. కానీ, ఇది జరుగుతుంది.’’

‘పరంద’ అనేది కలం పేరు. అంటే పక్షి అని అర్థం. నగరాల్లో ఉండే విద్యావంతులైన ఆమెలాంటి మహిళలు పంజరంలో బందీగా ఉండటానికి నిరాకరిస్తున్నారు. చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకా చాలామంది వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. కొన్ని చిన్న సమూహాలు ధైర్యంగా నిరసనలు చేస్తున్నాయి.

దేశంలోని మారుమూల ప్రాంతంలోని నిరక్షరాస్యులైన మహిళలు కూడా బందీల్లాంటి తమ జీవితాన్ని తలుచుకుంటూ కన్నీరు పెడుతున్నారు.

‘‘రాయడం కొనసాగించండి’’

‘‘రాయండి, ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? మీ రచనలు ఇతరుల గాయాలకు మందుగా మారుతాయేమో? ఇతరుల విరిగిన చేతులకు మీ కలాలు అండగా నిలుస్తాయేమో? నిరాశపూరితమైన జీవితాల్లో ఆశ తెస్తాయి’’ అని రచయిత సదాఫ్ రాశారు.

ఎక్కడైనా ఒక రచయిత జీవితంలో కొంత భయం, సందేహం ఉంటుంది. కానీ, అఫ్గాన్ మహిళల విషయంలో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. రాయడానికి సురక్షితమైన నిశ్శబ్ద ప్రదేశాలను కనుగొనడం, వారి భావాలను బయటపెట్టడం వారికి చాలా కష్టమైన పని. “మై పెన్ ఈజ్ ది వింగ్ ఆఫ్ ఎ బర్డ్” అనే పుస్తకం వారి రచనలకు కొత్త జీవం పోసింది.

"ఈ పుస్తకం ఒక విద్యార్థిని అందమైన పదాలతో వర్ణించింది. ఆమె నా పేరును ప్రస్తావించింది. అప్పుడు విద్యార్థులంతా చప్పట్లతో నన్ను ఉత్సాహపరిచారు. నా జీవితంలో అత్యంత ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా ఇది ఉంటుంది.’’

‘‘కేవలం నా ఆదాయం పైనే’’

"దేవుడు నా కోసం ఇంకేదో మంచి చేస్తాడు కాబట్టి డబ్బు గురించి చింతించకూడదని నేను నమ్ముతుంటా. కానీ, నేను ఎందుకు చింతిస్తున్నానో ఆ దేవునికి తెలుసు. మాది పెద్ద కుటుంబం. మొత్తం 10 మంది సభ్యులం. కానీ, వారంతా నాపైనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే నేను మాత్రమే సంపాదిస్తున్నా. గత ఇస్లామిక్ రిపబ్లిక్ సమయంలో నాకు పెద్దగా ఆదాయం లేదు. ఇస్లామిక్ ఎమిరేట్‌లో కూడా ఇది గొప్పగా ఏం లేదు.’’

స్త్రీలు పని చేయడం మొత్తంగా తుడిచి పెట్టుకుపోలేదు. కొంతమంది మహిళా వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఇప్పటికీ తమ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికల అనుబంధ రంగాల్లోని ఉద్యోగాల్లో స్త్రీలు ఇప్పటికి పనిచేస్తున్నారు. కొంతమంది మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. కానీ, చాలా ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని ఉద్యోగాలకు మహిళలను దూరం చేశారు. బాలికల పాఠశాలలు మూతపడటంతో ఆయా ఉద్యోగాలను కూడా స్త్రీలు కోల్పోయారు.

‘‘నువ్వు చాలా ధైర్యవంతురాలివి’’

‘‘ఆత్మహత్య చేసుకోకూడదు! నీకు బతకాలని లేకపోవచ్చు, కానీ నువ్వు చచ్చిపోతే దాని ప్రభావం చాలా మందిపై పడుతుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అంతా మంచే జరుగుతుంది. ఈ సమయం గడిచిపోతుంది’’ అని నాకు నేనే చెప్పుకున్నా.

ఇది ప్రతీచోటా వినిపించేదే. ప్రధానంగా యువతుల ఆత్మహత్య ప్రయత్నాల్లో పెరుగుదల నమోదైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కానీ, దీన్ని ధ్రువీకరించడం చాలా కష్టం.

కుటుంబాలు దీన్ని రహస్యంగానే ఉంచుతాయి. సాక్ష్యాలను దాచేయాలని ప్రభుత్వ ఆసుపత్రులకు చెబుతుంటారు. బలవంతపు వివాహాలు, పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకోవడం లాంటివి యువతులను ఆత్మహత్య వైపు పురిగొల్పుతున్నాయి.

‘‘ఇది ఎప్పుడు ముగుస్తుంది?’’

‘‘మనం ఎంతకాలం ఈ బాధను భరించగలం? అమానవీయ, క్రూరమైన ఘటనలు జరిగాయి. ఇవి ఎప్పుడు ముగుస్తాయి?’’

ఒకటి కంటే ఎక్కువ తరాలకు ఇప్పుడు యుద్ధం గురించి తెలుసు. నాలుగు దశాబ్దాలుగా ఇది జరుగుతోంది. దేశం ఒక వివాదం నుంచి మరో సంఘర్షణను ఎదుర్కొంటూనే ఉంది. గత అధ్యాయాల కంటే రాబోయే అధ్యాయం మెరుగ్గా ఉంటుందని అఫ్గాన్లు అనుకుంటున్నారు. ఇది ఒక అంతులేని కథలా అనిపిస్తోంది.

ఫొటోలు: మ్యూస్ స్టెఫెన్సెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)