You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కల్వకుంట్ల కవిత అరెస్ట్... మనీ ల్యాండరింగ్ కేసులో తదుపరి విచారణకు దిల్లీకి తీసుకువెళ్ళిన ఈడీ, రోజంతా అసలేం జరిగింది?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.
“కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కోసం దిల్లీకి తీసుకువెళ్తున్నారు. దిల్లీ లిక్కర్ పాలసీ-మనీల్యాండరింగ్ కేసులో సంబంధాలపై ఆమెను ప్రశ్నించనున్నారు” అని వార్తాసంస్థ ఏఎన్ఐ ఎక్స్ వేదికగా తెలిపింది.
దిల్లీలో రాజకీయంగా దుమారం రేపిన దిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో 2022లో తొలిసారి కవిత పేరు వినిపించింది.
గత ఏడాదిలో రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కవిత.
ఇంటికి వెళ్లి ఈడీ సోదాలు..
ఈడీ అధికారుల బృందం శుక్రవారం కవిత ఇంటికి వెళ్లి సోదాలు చేపట్టింది. ఆ సమయంలో కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు.
“లోపల సెర్చ్ జరుగుతున్నందన, సోదాలు పూర్తయ్యేంత వరకూ లోపలికి అనుమతించలేమని అధికారులు చెప్పారు” అని కవిత తరఫు న్యాయవాదులు మీడియాతో చెప్పారు.
ఈడీ విచారణపై సుప్రీం కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, ఈడీ ఎందుకు వచ్చారో వారినే అడగాలని న్యాయవాదులు మీడియాతో అన్నారు.
అరెస్ట్ ఆర్డర్‌లో ఏముంది?
ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ 2023 కింద కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా అరెస్ట్ ఆర్డర్‌లో పేర్కొన్నారు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్.
అందులో “శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని నేను నమ్ముతున్నాను. నాకు గల అధికారంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 19, సబ్ సెక్షన్(1) కింద, శ్రీమతి కల్వకుంట్ల కవితను 15.03.24 సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేయడానికి గల కారణాలతో కూడిన 14 పేజీల కాపీని ఆమెకు అందజేశాను” అని జోగేందర్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
'ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?'-కేటీఆర్
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టు సమక్షంలో మాట ఇచ్చి, ఇప్పుడెలా అరెస్టు చేస్తారు? ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు.
ఆ సమయంలో ఈడీ అధికారులతో వాగ్వాదం జరిగింది.
రెండుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవిత
దిల్లీ మద్యం కేసులో తొలిసారిగా 2023 మార్చి 11న ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత.
అంతకుముందు డిసెంబర్ 2022లో సీబీఐ కూడా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.
మార్చి 20, 21 తేదీల్లోనూ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో తాను వాడిన ఫోన్లను ఈడీకి అప్పగించారు.
ఆ ఫోన్లను ధ్వంసం చేశారంటూ గతంలో ఈడీ చేసిన ఆరోపణలపై కవిత స్పందిస్తూ లేఖ విడుదల చేశారు.
‘‘నేను ఫోన్లు ధ్వంసం చేశాను అంటూ నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. మీరు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను మీకు సమర్పిస్తున్నాను.
ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా?
అసలు నన్ను విచారించకుండానే నేను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపణలు ఎలా చేసింది?
నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ, గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా" అని స్పందించారు.
దిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో తొలిసారి కవితపై ఆరోపణలు
2022 ఆగస్టులో దిల్లీకి చెందిన బీజేపీ నాయకులు కొందరు తొలిసారిగా మద్యం పాలసీలో అక్రమాలకు సంబంధించి కవితపై ఆరోపణలు చేశారు.
దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్, "లిక్కర్ డీల్ గురించి దిల్లీ ఒబెరాయ్ హోటెల్‌లో సూట్ రూమ్ ఆరు నెలలు బుక్ అయింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కొందరు లిక్కర్ మాఫియా వ్యక్తులు, కొన్ని రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు’’ అని చెప్పినప్పటికీ, ఎక్కడా కవిత పేరును నేరుగా ప్రస్తావించలేదు.
దిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా మాత్రం నేరుగా కవిత పేరు ప్రస్తావించారు.
"కె. కవిత చాలా మందిని దక్షిణాది నుంచి తీసుకుని వచ్చారు. ఆప్ నాయకులు పంజాబ్, గోవా ఎన్నికల ఖర్చు కోసం 150 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారు. మేం హోటెల్ రూమ్ నంబర్ కూడా చెప్పగలం.
డబ్బు ఎవరు, ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ పెట్టారు? అనేది కూడా చెప్పగలం. అన్ని వివరాలూ మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పేది తప్పయితే, మీరు సమాధానం చెప్పండి’’ అన్నారు మంజీందర్ సిర్సా.
అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ నేతలు కూడా కవితపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్- మాజీ మంత్రి హరీశ్ రావు
కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. అరెస్ట్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, "కవిత అరెస్ట్ అప్రజాస్వామికం, అనైతికం, అక్రమం. అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. పథకం ప్రకారమే శుక్రవారం అరెస్ట్ చేశారు." అన్నారు.
అరెస్టుపై తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీశ్‌రావు అన్నారు.
దిల్లీ లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి తమకు అందిన రెండు ఫిర్యాదుల ఆధారంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
ఈ సమన్లపై స్టే కోరుతూ సెషన్స్ కోర్ట్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. శుక్రవారం వాదనలు విన్న న్యాయస్థానం సమన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈడీ విచారణకు హాజరుకావడంలో మినహాయింపు కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ తరఫు లాయర్లకు సూచించింది.
ఇవి కూడా చదవండి:
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)