You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనీష్ సిసోడియా: దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో ఆయనను ఇవాళ విచారించిన సీబీఐ, విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
సిసోడియా అరెస్టును 'నియంతృత్వం'గా అభివర్ణించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం 'ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే' అని పేర్కొంది.
ఈ కేసులో మనీష్ ప్రమేయం లేదని, ఆయన నీచ రాజకీయాలకు బలైపోయారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
సిసోడియా అరెస్టు అనంతరం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తన భార్యతో కలిసి మనీష్ సిసోడియా నివాసానికి చేరుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు సిసోడియా కుటుంబానికి ధైర్యం చెప్పారు.
మరోవైపు, సిసోడియా అరెస్టయ్యారని, తర్వాతి వంతు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌దేనని భారతీయ జనతా పార్టీ అన్నది.
కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు జైలుకు వెళ్తారని మొదటి నుంచి చెబుతున్నానని, వారిలో ఇద్దరు జైలుకు వెళ్లారని, తర్వాతి వంతు కేజ్రీవాల్‌దేనని బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేశారు.
మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ఉద్రిక్తతలు చెలరేగకుండా సీబీఐ కార్యాలయం ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి దిల్లీలో వరస పరిణామాలు
సీబీఐ కార్యాలయానికి చేరుకోకముందే సిసోడియా తనను ఈరోజు అరెస్ట్ చేయవచ్చని వ్యాఖ్యానించారు.
ఆయనను ఆదివారం నాడు ప్రశ్నించడానికి పిలిపించడంతో దిల్లీలో ఉదయం నుంచి వరస పరిణామాలు జరిగాయి.
మనీష్ సిసోడియా సీబీఐకు పూర్తిగా సహకరిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది.
ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఇంటి ముందు ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు బయలుదేరుతుండగా, ఇంటి ముందు అభిమానులు ప్లకార్డులతో గుమికూడారు.
ఉదయం మనీష్ సిసోడియా ట్వీట్ చేస్తూ, "ఈరోజు మళ్లీ సీబీఐ విచారణకు వెళుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. లక్షలాది పిల్లల ప్రేమ, కోట్లాది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్నాళ్లు జైల్లో ఉండాల్సి వచ్చినా ఫరవాలేదు. భగత్ సింగ్ అనుచరులం. దేశం కోసం భగత్ సింగ్ ఉరికంబానికి ఎక్కారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం చాలా చిన్న విషయం" అన్నారు.
ఆయన ట్వీట్‌పై కేజ్రీవాల్ స్పందిస్తూ, "దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మనీష్. లక్షలాది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం శాపం కాదు. అది ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దిల్లీలోని పిల్లలు, తల్లిదండ్రులు, మేమంతా మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం" అన్నారు.
అసలేంటి కేసు?
దిల్లీ ఎక్సైజ్ పాలసీ: 2021-22లో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దిల్లీలో అంతకు ముందు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేది. ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా విధానాలను తీసుకొచ్చారనేది ఆరోపణ.
2021 నవంబరులో ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో మద్యం అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.
2022 జులైలో కొత్తగా నియమితులైన దిల్లీ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్, కొత్త మద్యం విధానంలో అవకతవకలు ఉన్నట్లు ఆరోపించారు. ఆయన సలహా మేరకు నాటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.
ఆ తరువాత 2021-22 మద్యం విధానాన్ని రద్దు చేసి అంతకు ముందు ఉన్నట్లుగా ప్రభుత్వమే దుకాణాలు నడపడటం మొదలు పెట్టింది.
2022 ఆగస్టులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరును సీబీఐ రిపోర్టులో చేర్చింది.
ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణల మీద ఈడీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది.
తెలుగు రాష్ట్రాలకు లింకు
దిల్లీ మద్యం విధానంలో కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించారంటూ ఆప్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. అలా ప్రయోజనాలు అందుకున్నట్లు ఆరోపణలున్న కంపెనీల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీ కూడా ఉంది.
అయితే దిల్లీ మద్యం విధానంలో తమకు లబ్ధి జరిగిందనే ప్రచారం వాస్తవం కాదని మాగుంట కుటుంబం చెబుతోంది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వివిధ కంపెనీలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం దాదాపు 35కిపైగా కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయి. ఆయన సొంతంగా స్థాపించిన కంపెనీలూ ఉన్నాయి.
గతం నుంచి కుటుంబ సభ్యులు నడుపుతున్న కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న అనుభవం ఉంది. వాటిలో మద్యం కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల మద్యం తయారీలో మాగుంట కుటుంబానికి పేరుంది. చెన్నై కేంద్రంగా ఆయన వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి.
శ్రీనివాసుల రెడ్డి వారసుడిగా ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి కూడా ఈ వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామిగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆరు కంపెనీల్లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
ఆ క్రమంలోనే దిల్లీ మద్యం టెండర్లలో ఇతరులతో కలిసి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేయడం, అవి ఖరారు కావడంతో దిల్లీ మద్యం విక్రయాల్లో ఒంగోలు ఎంపీ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి.
ఆప్ ప్రభుత్వం సుమారుగా రూ.144 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు, అందులో వైఎస్సార్సీపీ ఎంపీ పేరుని కూడా ప్రస్తావించారు.
దిల్లీ లిక్కర్ ‘కుంభకోణం’ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ ప్రస్తావించింది.
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను దిల్లీలోని రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ఉంది.
అమిత్ అరోరాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది.
ఈడీ రిపోర్ట్ ప్రకారం...
దిల్లీలో మద్యం అమ్మకాల లైసెన్స్ తీసుకున్న వాటిలో మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దానిని మాగుంట రాఘవ్ నడుపుతున్నారు.
శరత్ రెడ్డికి చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమాఫర్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్ కంపెనీలు లైసెన్స్ తీసుకున్నాయి.
ఈ కేసులో ఈడీ అనుమానిస్తున్న వాళ్లు తరచూ ఫోన్లు మార్చినట్లుగా కూడా రిపోర్టులో పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత 10, అభిషేక్ బోయినపల్లి 5, గోరంట్ల బుచ్చిబాబు 6, శరత్ రెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.
ఆధారాలు నాశనం చేసేందుకు అమిత్ అరోరా 11 సార్లు ఫోన్ మార్చడం/ధ్వంసం చేయడం చేశారని.. అలాగే ఈ కేసులో ఆరోపణలున్న మరికొందరు గత ఏడాది కాలంలో వినియోగించిన లేదా ధ్వంసం చేసిన డిజిటల్ డివైస్‌ల(సీడీఆర్ ఐఎంఈఐ విశ్లేషణ ఆధారంగా) నంబర్లు, వారి పేర్లు అంటూ ఒక జాబితా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే కవితను, మాగుంట రాఘవను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాగుంట రాఘవను ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- వారణాసి: నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?