You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
30 రూపాయల విషయంలో గొడవ ఇద్దరి ప్రాణం తీసింది...
- రచయిత, ఎహ్‌తేషామ్ షమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(ఈ కథనంలోని వివరాలు కొంతమంది పాఠకులకు ఇబ్బంది కలిగించవచ్చు)
అక్కడ మామిడి పండ్లు, అరటిపండ్లు అమ్మే కొన్ని షాపులున్నాయి. సమీపంలో డజన్ల కొద్దీ జనం నిలబడి ఉన్నారు. వారి సమీపంలో ఎర్ర కుర్తా ధరించి, రక్తంతో తడిచిన ఒక వ్యక్తి, గాయపడిన తన సోదరుడి తలని తన ఒడిలో వాల్చుకొని నిస్సహాయంగా కూర్చుని ఉన్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు కనిపిస్తోంది. కానీ, క్యాప్ ధరించిన మరో వ్యక్తి వచ్చి ఎర్ర కుర్తా ధరించిన వ్యక్తి తలపై క్రికెట్ బ్యాట్‌తో గట్టిగా కొట్టినట్లు వీడియోలో ఉంది.
ఈ ఘటనలో అన్నదమ్ములైన రషీద్, వాజిద్‌లు చనిపోయారు. పాకిస్తాన్‌లోని రాయ్‌విండ్‌లో జరిగిన ఈ హత్యలు ఏ కుటుంబ కలహాల కారణంగానో లేదా చాలాకాలంగా ఉన్న వివాదం వల్లనో జరగలేదు.
ఇద్దరు అన్నదమ్ముల హత్యకు కారణం 'కొన్ని నిమిషాల వాదన, 30 రూపాయలు' అని పోలీసులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రషీద్, వాజిద్‌ల తండ్రి సయీద్ ఇక్బాల్ ఫిర్యాదు ఆధారంగా, పాకిస్తాన్‌లోని రాయ్‌విండ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఒవైస్, తైమూర్ అనే ఇద్దరు సోదరులపై కేసు నమోదైంది.
ఎఫ్ఐఆర్ ప్రకారం, ఆగస్టు 21న పాల వ్యాపారులైన రషీద్, వాజిద్ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని సయీద్ ఇక్బాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దారిలో సోదరులిద్దరూ పండ్లు కొనడానికి ఆగారు. అక్కడ పండ్ల వ్యాపారి ఒవైస్, ఆయన సోదరుడు తైమూర్‌తో ఇరువురికి గొడవ జరిగింది.
'కొడుతుంటే వీడియోలు తీస్తున్నారు'
ఒవైస్, తైమూర్‌తో పాటు వారి సహచరులు తన కుమారులపై కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారని, దీంతో వారిద్దరూ మరణించారని సయీద్ ఇక్బాల్ ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు, తదుపరి దర్యాప్తును క్రైమ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ)కి అప్పగించినట్లు ఎస్పీ మొజామ్ అలీ తెలిపారు.
సయీద్ ఇక్బాల్ పాకిస్తాన్‌లోని కోట్ రాధాకిషన్ ప్రాంతంలోని రాటిపిండి గ్రామంలో నివసిస్తుంటారు. ఇద్దరు కొడుకులు తమ షాపుకు పాలు డెలివరీ చేసి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.
"నా ఒక్కో కొడుకు 15 రూపాయలకు ప్రాణాలు కోల్పోయారు. సింహం పిల్లల్లాంటి నా ఇద్దరు కొడుకులను 30 రూపాయల కోసం చంపేశారు. నా కొడుకులను చంపినట్లు జంతువులను కూడా ఎవరు చంపరు" అని సయీద్ ఇక్బాల్ అన్నారు.
"ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్‌తో పదేపదే అతన్ని కొడుతున్నాడు. సమీపంలో నిలబడి ఉన్నవారు మొబైల్ ఫోన్‌లతో వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఇది ఎలాంటి సమాజం? ఎవరూ దీన్ని ఆపడానికి ప్రయత్నించలేదు" అంటూ సయీద్ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
"శత్రువు పిల్లలకు కూడా ఇలా జరగకుండా దేవుడు చూడాలి" అని ఆయన అన్నారు.
అసలేం జరిగింది?
చిన్న విషయం వివాదంగా మారిందని ఘటన స్థలంలో ఉన్నవారు, పోలీసులు చెప్పారని మృతుల సోదరుడు సాజిద్ తెలిపారు.
"వాజిద్, రషీద్ అరటిపండ్లు కొనడానికి ఆపిన బండి ఒవైస్ అనే వ్యక్తిది. ఆయన సోదరుడు తైమూర్ బండి కూడా సమీపంలోనే ఉంది" అని సాజిద్ బీబీసీతో తెలిపారు.
"ఒవైస్ డజను అరటిపండ్లకు 130 రూపాయలు చెప్పారు. తన దగ్గర చిల్లర 100 రూపాయలే ఉన్నాయని, మిగతా ఐదు వేల రూపాయల పెద్ద నోట్లు మాత్రమే ఉన్నాయని రషీద్ ఆయనకు చెప్పారు. దీంతో, ఆ 100 రూపాయలకు అరటిపండ్లు ఇస్తానని ఒవైస్ చెప్పారు" అని సాజిద్ చెప్పారు.
సాజిద్ ప్రకారం, ఒవైస్ తక్కువ ధరకు అరటిపండ్లు అమ్మడం తైమూర్‌కు నచ్చలేదు. ఆయన అభ్యంతరకర భాషను ఉపయోగించారు. దీంతో, ఇద్దరు సోదరులు గట్టిగా బదులిచ్చారు. అనంతరం, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తీవ్ర వాదన తర్వాత, ఒవైస్, తైమూర్ క్రికెట్ బ్యాట్‌లు, కర్రలతో వాజిద్, రషీద్‌లపై దాడి చేశారు.
"ఆ సమయంలో అక్కడ దాదాపు 250 మంది ఉన్నారు కానీ, ఈ గొడవను ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు" అని సాజిద్ అన్నారు.
పోలీసులు ఏం చెప్పారు?
డబ్బు విషయమై గొడవ మొదలైందని సదర్ సర్కిల్ ఎస్పీ మొజామ్ అలీ బీబీసీ ప్రతినిధి ఉమర్ దరాజ్ నంగియానాతో అన్నారు.
మొజామ్ అలీ చెప్పిన వివరాల ప్రకారం, మరణించిన ఇద్దరు సోదరులు పండ్లు కొన్నప్పుడు, వారి వద్ద ఒక రూ. 5,000 నోటు, మరొక రూ. 100 నోటు ఉన్నాయి.
"పండ్ల విక్రేత తనకు 30 రూపాయల చిల్లర ఇవ్వమని అడిగాడు. తన దగ్గర చిల్లర లేదని ఆయన బదులిచ్చారు. చిల్లర లేకపోతే, 30 రూపాయల అరటిపండ్లు తిరిగి ఇవ్వమని ఒవైస్ అడిగారు. అనంతరం, సోదరులిద్దరూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు, గొడవ తీవ్రమైంది" అని అన్నారు మొజామ్ అలీ .
"మొదట బాధిత సోదరులిద్దరూ పండ్లు అమ్మే వ్యక్తిని కొట్టారు. పరిస్థితి తీవ్రం కావడంతో, సమీపంలోని విక్రేతలు పండ్లు అమ్మే వ్యక్తి సోదరులకు ఫోన్ చేశారు. వారు కూడా వచ్చారు. సమీపంలోని విక్రేతలు కూడా చేరారు. అందరు కలిసి వాజిద్, రషీద్‌లను కొట్టారు" అని అన్నారు.
వాజిద్, రషీద్ తలలకు తీవ్ర గాయాలయ్యాయి, అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఇద్దరూ మరణించారని ఎస్పీ తెలిపారు.
చికిత్స ఆలస్యమైందా?
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను సయీద్ ఇక్బాల్ ఉటంకిస్తూ "వాజిద్ తన సోదరుడు రషీద్‌ను ఒడిలో పట్టుకుని నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి అతని చెవి దగ్గర మొబైల్ ఫోన్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు.
ఆ వ్యక్తి తన కొడుకు నుంచి ఇంటి నంబర్ తీసుకొని, తన మరో కొడుకు ఆసిఫ్‌కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి చెప్పారని తండ్రి సయీద్ ఇక్బాల్ అన్నారు.
"ఈ సంఘటన గురించి నాకు తెలియగానే, దుకాణం అలాగే వదిలేసి నా మోటార్‌సైకిల్‌పై అక్కడికి చేరుకున్నా. కొద్దిసేపటికే మా బంధువులు అక్కడికి వచ్చారు" అని అన్నారు.
ఇద్దరినీ అంబులెన్స్‌లో మొదట రాయ్‌విండ్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సయీద్ ఇక్బాల్ చెప్పారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయని, వారిని లాహోర్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు.
"నా కొడుకులలో ఒకరైన రషీద్ అక్కడికక్కడే చనిపోయారని జనం అంటున్నారు. కానీ, నా మరో కొడుకు వాజిద్ బతికేవాడు. సకాలంలో చికిత్స అందకపోవడం, ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తరలించడం వల్ల వాడు మరణించాడు" అని సయీద్ ఇక్బాల్ అన్నారు.
ఇద్దరు సోదరులకు ప్రథమ చికిత్స అందడంలో కూడా ఆలస్యం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
'లిటిల్ మ్యాక్స్‌వెల్'
వాజిద్ చిన్నవాడని, అందరికీ ఇష్టమైనవాడని సాజిద్ అంటున్నారు.
"వాజిద్ ఒక క్రికెటర్. అనేక క్రికెట్ క్లబ్‌లకు ఆడాడు. ఆయన్ను చాలామంది టోర్నమెంట్లకు తీసుకెళ్లేవారు. ఆడినందుకు రూ. పది వేల నుంచి పదిహేను వేల వరకు ఇచ్చేవారు" అని అన్నారు.
తన సోదరుడి ఆట తీరు ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను పోలి ఉంటుందని, అందరూ ఆయనను 'లిటిల్ మ్యాక్స్‌వెల్' అని పిలిచేవారని సాజిద్ గుర్తుచేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)