చిన్నారుల్లో క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

ఫొటో సోర్స్, Family handout
- రచయిత, కామిల్లా హారోక్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
యూకేలో పదిహేనేళ్లలోపు పిల్లలలో వ్యాధుల వల్ల కలిగే మరణాలకు క్యాన్సరే ప్రధాన కారణం, ఇది అరుదైనప్పటికీ మూడో వంతు మంది తల్లిదండ్రులు మాత్రమే వాటి లక్షణాలను గుర్తించగలమని చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం పద్నాలుగేళ్ల వయసు పిల్లల్లో సుమారు 1900 మందికి క్యాన్సర్ నిర్ధరణ అవుతోందని క్యాన్సర్ రీసెర్చ్ యూకే తెలిపింది.
ప్రస్తుతం కోలుకున్న పదమూడేళ్ల అమేలియా కారోల్‌కు గత ఏడాది అక్యూట్ మైలోయిడ్ లుకేమియా నిర్ధరణ అయింది. ప్రారంభ లక్షణాలు పెద్ద సందేహాస్పదంగా లేవని ఆమె తల్లి జెమ్మా అన్నారు.
అమేలియాకు అలసట ఉండేదని, స్వల్పంగా వ్యాయామం చేసినా ఆయాసం వచ్చేదని ఆమె చెప్పారు. అయితే, శారీరక దారుఢ్యం లేకపోవడం, పాఠశాల నుంచి వచ్చాక కలిగే అలసట వల్లే ఇలా జరుగుతోందని ఆమె భావించారు.
అమేలియా శరీరాలపై గాయాలు కనిపించడంతో ఏదో తేడాగా ఉందని జెమ్మా గ్రహించారు. పది రోజుల్లోనే అమేలియాకు లుకేమియా నిర్ధరణ అయింది.


ఫొటో సోర్స్, Family handout
గమనించవలసిన లక్షణాలు ఏమిటి?
పిల్లల క్యాన్సర్ నిపుణులు ప్రొఫెసర్ బాబ్ ఫిలిప్స్ ప్రకారం, పిల్లల్లో నిరంతరం కొనసాగుతున్న, తీవ్రతరమవుతున్న లేక పెద్దవవుతున్న లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం ముఖ్యం.
ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడాన్ని పరిశీలించాలి:
- అత్యంత అలసట
- చర్మం బాగా పాలిపోయినట్లు కనిపించడం
- కారణం తెలియకుండా శరీరంపై గాయాల మచ్చలు ఏర్పడటం
- గడ్డలు, వాపులు తగ్గకుండా ఉండటం లేదా కాలక్రమేణా పెద్దవవడం
పిల్లలలో క్యాన్సర్ పెద్దల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, వారు ఎదుగుతుండటం దీనికి ప్రధాన కారణం. నిర్ధరణ తర్వాత 80 శాతం మంది పిల్లలు ఐదు నుంచి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు జీవిస్తున్నారు.
అమేలియా క్యాన్సర్ ప్రయాణం అకస్మాత్తుగా కనిపించిన ఒక ఎర్రటి గాయపు మచ్చతో మొదలైందని జెమ్మా చెప్పారు. మూడు రోజుల తర్వాత రెండు కాళ్ల కింది భాగాల్లోనూ గాయాల మచ్చలు కనిపించాయని ఆమె తెలిపారు. అవి నొప్పిగా ఉండటంతో పాటు చర్మంపై ఉబ్బినట్లుగా కనిపించాయని చెప్పారు.
"మేం సాధారణ కంటి పరీక్షల కోసం కంటి వైద్యుడి దగ్గరకు వెళ్లాం. అక్కడ అమేలియా కంటిలో కొన్ని రక్తనాళాలు పగిలినట్లు గుర్తించారు. అయితే, అందుకు కారణమేంటో అప్పటికి వారికి తెలియలేదు" అని జెమ్మా చెప్పారు.
పది రోజుల్లోనే అమేలియాకు ఏ రకమైన లుకేమియా వచ్చిందో వైద్యులు నిర్ధరించారు. చికిత్స ప్రారంభించేందుకు పాపను ఆసుపత్రిలో చేర్చారు.
"ఆమెకు ఏ వ్యాధి సోకిందో నిర్ధరించిన రోజు, నేను ఆమెను కూర్చోబెట్టి మాట్లాడాను. ఆమె నన్ను 'నాకు క్యాన్సర్ వచ్చిందా' అని అడిగింది, నేను అవునని చెప్పాను. చనిపోతానా అని అడిగింది, లేదని చెప్పాను, వైద్యులు చేయగలిగినదంతా చేస్తున్నారు, వారి వద్ద ఒక ప్రణాళిక ఉంది" అని జెమ్మా అన్నారు.
అమేలియా ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా బోన్ మ్యారో, రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు, పాఠశాలకు తిరిగి వెళ్తున్నారు. వ్యాధిని మరింత త్వరగా గుర్తిస్తే, తక్కువ తీవ్రతతో కూడిన చికిత్సలు అందించే అవకాశం ఉంటుందని ఫిలిప్స్ ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Family handout
'అతడి వారసత్వం'
క్యాన్సర్ రీసెర్చ్ యూకే గణాంకాల ప్రకారం, బ్రిటన్‌లో ఏటా 4 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం, 15–24 ఏళ్ల వయసున్న టీనేజర్లు, యువతలో ఏటా మరో 2,300 మందికి క్యాన్సర్ నిర్ధరణ అవుతోంది.
లిన్సే స్విన్స్కో కుమారుడు జేక్ 13 ఏళ్ల వయసులో సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్‌తో మరణించారు. 2023 జులైలో జేక్‌కు మూడో దశలో ఉన్న ఫ్యూజన్ పాజిటివ్ అల్వియోలార్ రాబ్డోమయోసార్కోమా అనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది.
వ్యాధి నిర్ధరణకు ముందు జేక్‌కు ముక్కు దిబ్బడ, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే, అలర్జీ లక్షణాలనుకున్నారు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నిద్రపోవడాన్ని కూడా విద్యా సంవత్సరం చివర్లో కలిగే అలసటగా భావించారు.
"అతడి ముక్కు భాగంలో వాపు కనిపించడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. అప్పటివరకు మేం అలసట, జ్వరం లక్షణాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని అనుకోలేదు" అని లిన్సే చెప్పారు.
జేక్ ముక్కులో, నాసికా కుహరంలో ఒక కణితిని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత సాఫ్ట్ టిష్యూ సార్కోమా ఉన్నట్లు నిర్ధరించారు. బాబుకి తొమ్మిది విడతల కీమోథెరపీతో పాటు ప్రోటాన్ బీమ్ రేడియేషన్ చికిత్సను పూర్తి చేశారు.
అయితే, మూర్ఛలు రావడం, కీమోథెరపీ వల్ల తీవ్ర అస్వస్థతకు గురవడంతో జేక్ తదుపరి చికిత్సను తీసుకోలేదు.
2024 ఏప్రిల్ 26న, తన 14వ పుట్టినరోజుకు కేవలం రెండు వారాల ముందు జేక్ ఇంట్లోనే కన్నుమూశాడు.
"జేక్ మరణానికి భయపడలేదు. మరణం, చనిపోతే ఎలా అనిపిస్తుందనే విషయాల గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే, అతడిని ఒక విషయం మాత్రం భయపెట్టేది. 'అందరూ నన్ను గుర్తుంచుకుంటారా? నేను ఎవరో అందరూ మర్చిపోతారా?' అని అడిగేవాడని లిన్సే చెప్పారు.
"అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. జేక్ ఎవరో ప్రజలకు తెలియాలి. అతడు ఎంత గొప్పవాడో అందరికీ తెలియాలి. అందుకే, క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. అదే అతడు మాకు వదిలివెళ్లిన వారసత్వం" అన్నారామె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























