ఓం భీమ్ బుష్ రివ్యూ: శ్రీ విష్ణు, రాహుల్, ప్రియదర్శిల 'హారర్ కామెడీ' అలరించిందా?

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

‘జాతిరత్నాలు’ తర్వాత స్నేహితుల హాస్య కథల్లో మార్పులు వచ్చాయి. అమాయకత్వం, తుంటరితనంతో కూడిన స్నేహితుల అల్ల‌రి చేష్టలే ఇతివృత్తంగా వస్తున్నాయి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ కూడా అలాంటి కథే.

కాకపోతే ఈ సినిమాకు హారర్, ఫాంటసీ, ట్రెజర్ హంట్ జోనర్స్ ని మిళితం చేశారు, లాజిక్ లేని మ్యాజిక్ చూపించాలనే ప్రయత్నం చేశారు దర్శకుడు.

మరి ఆ ప్రయత్నం ఫలించిందా? స్నేహితుల త్రయం వినోదాన్ని పంచిందా?.

బ్యాంగ్ బ్రదర్స్..

క్రిష్ (శ్రీవిష్ణు), విన‌య్ గుమ్మడి (ప్రియ‌ద‌ర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ).. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. తమని తాము బ్యాంగ్ బ్రదర్స్ అని పిలుచుకుంటారు.

పీహెచ్‌డీ వంకతో యూనివ‌ర్సిటీలో చేరి చాలా తుంటరి పనులు చేస్తుంటారు. వీళ్ల అల్లరి భ‌రించ‌లేక ముగ్గురికీ డాక్టరేట్లు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ప్రొఫెస‌ర్‌. తర్వాత భైర‌వ‌పురం అనే ఊరికి వెళతారు.

నిధికి ఆ ఊరికి సంబంధమేంటి? అక్కడి మహల్‌లో అడుపెట్టిన ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనేది మిగతా కథ.

లాజిక్ లేదు, మ్యాజిక్ ఉందా ?

ఈ సినిమా టైటిల్‌లోనే ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవలం నవ్వులు పంచడంపైనే దృష్టిపెట్టాడు దర్శకుడు. ఈ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా.

సంపంగి మహల్‌లో అఘోరాలు చేసే తాంత్రిక పూజలతో కథ మొదలవుతుంది. తర్వాత ఇంటర్వెల్ వరకూ కథ జోలికే వెళ్ళలేదు. అయితే ఇందులో మ్యాజిక్ ఏమిటంటే.. అసలు కథ ఉందా లేదా అనే ఆలోచన ప్రేక్షకుడికి కలగదు. అంతలా వినోదాన్ని రాసుకున్నాడు రచయిత. పేప‌ర్ పై రాసుకున్న వినోదం తెరపై చక్కగా పండింది.

ముగ్గురు స్నేహితులు రిసెర్చ్ విద్యార్ధులుగా పరిచయం కావడం, యూనివర్శిటీలో వాళ్ల అల్లరి, అక్కడి నుంచి భైరవపురం వచ్చిన తర్వాత సైంటిస్టుల అవ‌తారమెత్తి ‘బాంగ్ బ్రోస్’ ఎ టు జెడ్ స‌ర్వీసెస్ పేరుతో చేసిన హంగామా.. ఇవన్నీ సరదాగా సాగిపోతుంటాయి.

ఆత్మల్ని బంధించ‌డానికి, గుప్త నిధుల్ని అన్వేషించ‌డానికి, దాంప‌త్య జీవితం వ‌ర్థిల్లడానికి... ఈ ముగ్గురూ సైన్స్‌ని అడ్డుపెట్టుకొని చేసే ‘తింగ‌రి చేష్టలు’ న‌వ్విస్తాయి.

సెకండ్ హాఫ్ అంతా సంపంగి మహల్‌లోనే జరుగుతుంది. అప్పటివరకూ విలేజ్‌లోని పాత్రలు చుట్టూ సరదా సన్నివేశాలు జరుగుతాయి.

మహల్‌కి వచ్చిన తర్వాత కేవలం ఈ ముగ్గురే మిగులుతారు. ఇక్కడ నుంచి కామెడీ జోనర్ కాస్తా హారర్ కామెడీకి మారిపోతుంది. ఇందులో చూపించిన హారర్ ఎలిమెంట్స్, దెయ్యం గాల్లో ఎగరడం, ఆత్మతో భయపెట్టే తీరు కాన్జోరింగ్, ఇన్సీడియస్ సినిమాలని గుర్తు తెస్తాయి కానీ దీని ట్రీట్మెంట్ మాత్రం పూర్తిగా ఫన్నీగా వుంటుంది.

అయితే గుప్తనిధుల వేట మాత్రం సైడ్ ట్రాక్ పట్టేస్తుంది. ఆ అంశాన్ని సరదాకే వాడుకొని అసలు కథ చెప్పడానికి మిగతా సమయాన్ని కేటాయించాడు దర్శకుడు.

కథలో బలం ఉందా?

ఎన్ని నవ్వులు పంచినా చివర్లో కథ చెప్పాల్సిందే. అసలు పాయింట్‌లోని ఎమోషన్ ప్రేక్షకులకు హత్తుకుంటేనే సంతృప్తిగా బయటికివస్తాడు.

ఈ సినిమా అసలు కథ కోసం ఎల్జీబీటీ అంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ అంశాన్ని రాజుల కాలంతో ముడిపెట్టడంలో దర్శకుడి ఆలోచన బావున్నా.. అసలు అంశం మాత్రం తెరపై ప్రభావంతంగా రాలేదు. క్రిష్ పాత్రలో మార్పుని సహజంగా చూపించలేపోయాడు దర్శకుడు. దీంతో సంపంగి కోరికలో అర్ధం వున్నా.. అది తెరపై కృత్రిమంగా అనిపించింది.

అలాగే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా బలహీనంగానే ఉన్నాయి. దెయ్యంతో డేటింగ్ అనే ట్రాక్ మొద‌ట్లో కాస్త బాగానే అనిపించినా, ఆ త‌ర‌వాత అదే రిపీట్ అవ్వడంతో ఆస‌క్తి త‌గ్గి, విసుగు మొద‌ల‌వుతుంది. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా పని చేసుంటే బాగుండేది.

హైబ్రిడ్ జోనర్‌ వర్కవుట్ అయిందా?

దర్శకుడు హర్ష ఈ కథని చెప్పడానికి ఒక జోనర్‌కి కట్టుబడి ఉండలేదు. బహుశా అదే ఈ క‌థ‌కు ఓ కొత్తదనం తీసుకొచ్చింది. బడ్డీ కామెడీ, హారర్, ఫాంటసీ, ట్రెజర్ హంట్ చివర్లో సోషల్ ఇష్యూ.. ఇలా జోనర్స్ మార్చుకునే ఈ కథనం ప్రేక్షకుడికి కూడా ఓ కొత్త అనుభవం పంచుతుంది.

అయితే జోనర్స్ ఎలా మారుతున్నా.. ప్రతి సీన్‌లో హాస్యంపైనే ఫోకస్ పెట్టడం బావుంది. నిజానికి ఇందులో చూపించిన అసలు పాయింట్ సీరియస్ సోషల్ ఇష్యూ. అది ఉన్నది వున్నట్లుగా చూపిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ఛాన్స్ వుంది. ఆ ఇష్యూకి కామెడీ, హారర్‌తో షుగర్ కోట్ వేసి చెప్పడంలో దర్శకుడు మంచి పనితీరునే కనబరిచాడు.

ఆరోగ్యకరమైన హస్యమేనా?

దాదాపుగా బడ్డీ కామెడీ మూవీ ఇది. ముగ్గురు స్నేహితుల‌ అల్లరి ప్రధానంగా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్లు అందరూ ఆస్వాదించేలా సాగుతాయి. ఇంకొన్ని మాత్రం స్నేహితులతో కలిసి చూస్తున్నపుడు సరదా వుంటాయి. మరికొన్ని సన్నివేశాలు మాత్రం ఫ్యామిలీ కూర్చుని చూడటానికి కాస్త ఇబ్బందిగానే ఉంటాయి.

అలాగే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పంటికింద రాయిలా తగులుతుంటాయి. కొన్ని అప్పటిక‌ప్పుడు అర్థం కావు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన మీమ్స్ డైలాగుల్లో క‌లిసిపోయాయి. వాటి గురించి ప‌రిచ‌యం ఉన్నవాళ్లు మాత్రమే సంపూర్ణంగా ఆస్వాదించ‌గ‌ల‌రు.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ఈ ముగ్గురే సినిమాని నిలబెట్టారు. దర్శకుడు కూడా వాళ్ళ టైమింగ్ నే నమ్ముకున్నాడు. శ్రీవిష్ణు మంచి నటుడు. ఇలాంటి హుషారైన పాత్రని ఇంకా హుషారుగా చేశాడు. తను డైలాగ్ చెప్పే విధానం నవ్విస్తుంది. మామూలు డైలాగ్ ని కూడా తన డిక్షన్‌తో నిలబెట్టాడు.

ప్రియదర్శి, రాహుల్ పాత్రలు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ ముగ్గురు కలసి పేల్చిన సింగిల్ లైనర్స్ వినోదాన్ని అందించాయి. ప్రియముకుందన్, అయేషా ఖాన్ పాత్రలకు కథలో పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రియవడ్లమాని ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. రచ్చ రవి కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు పరిధిమేరకు ఉంటాయి.

సన్నీ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి ఓ ఆకర్షణ. అతనిచ్చిన నేపథ్య సంగీతం కొన్ని చోట్ల భయపెడుతుంది. రాజ్ తోట కెమెరాపనితనం డీసెంట్‌గా వుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి.

మహల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు, ఫాంటసీ ఎలిమెంట్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ ప్రామిసింగ్‌గా వున్నాయి. దర్శకుడు కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా, లాజిక్కులు పట్టించుకోకుండా, సరదాగా నవ్వుకోవడమే లక్ష్యంగా వెళితే మాత్రం... ఓం భీమ్ బుష్‌లోని మ్యాజిక్‌ని ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)