ఈగల్ రివ్యూ: రవితేజ కొత్త మాస్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా?

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

‘‘తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్టు ఆగేదెప్పుడో తెలుసా! అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు...” - ఈగల్ సినిమాలో వినిపించే డైలాగ్ ఇది.

ఈ డైలాగ్ వెనుక లోతైన భావం ఉంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్య ఉంది.

ఆ సమస్య చుట్టూ కమర్షియల్ హంగులు జోడించి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన `ఈగల్' ప్రేక్షకులను మెప్పించిందా? రవితేజ కొత్త మాస్ అవతారం ఆకట్టుకుందా?

సినిమాటోగ్రఫీ నేపథ్యంతో వచ్చిన కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.

ఎవరీ సహదేవ్ వర్మ?

నళిని(అనుపమా పరమేశ్వరన్) ఓ జర్నలిస్ట్. తలకోన అడ‌విలో పండే పత్తితో అక్కడ తయారు చేసే వస్త్రం గురించి ఆమె రాసిన ఓ ఆర్టికల్ దేశ రక్షణ వ్యవస్థను వణికిస్తుంది.

ఆ పత్తి పండించిన రైతు సహదేవ్ వర్మ( రవితేజ). ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగాలు సహదేవ్ వర్మ కోసం గాలిస్తుంటాయి.

పదేళ్ళుగా అతని ఆచూకీ వుండదు.

ఇంతకూ ఎవరీ సహదేవ్ వర్మ? పత్తి పడించే రైతు కోసం ఈ గాలింపులు ఎందుకు? అతని గురించి నళిని ఎలాంటి వాస్తవాలు తెలుసుకున్నారనేది మిగతా కథ.

ఎత్తుగడ బావుంది

అనగనగా ఒక కొండ. ఆ కొండ మీద ఫామ్ హౌస్ కట్టుకొని పత్తి కర్మాగారం నడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోతాడు.

అతని కోసం గాలిస్తూ వెళితే అక్కడ కేవలం బూడిద మాత్రమే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లు అతని గురించి ఒక్కొక్కరూ ఒక్కో కథ చెప్తారు. కథని ఇలా ప్రారంభించడం చాలా ఆసక్తికరమైన ఎత్తుగడ.

కానీ, దాదాపు విరామ ఘట్టం వరకు ఇందులో కథ ఏమిటనేది ప్రేక్షకుడికి అర్థం కాదు. దీంతో పాత్రలతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడదు.

ద్వితీయార్ధం మెప్పించిందా?

సినిమా తొలి భాగమంతా పరిచయాలు, డైలాగులు, ఎలివేషన్స్‌తోనే కాలయాపన చేసిన దర్శకుడు, రెండో భాగంలో కథని మొదలుపెట్టిన తీరు పెద్ద ఆసక్తికరంగా ఉండదు.

రచన(కావ్య థాపర్), సహదేవ్ వర్మ మధ్య ప్రేమకథ రొటీన్‌గా ఉంది. ఆ ప్రేమకథతో వచ్చిన సంఘర్షణ ఈ కథకు మూలం.

అప్పటివరకు ఒక దిశగా ప్రయాణిస్తున్న కథానాయకుడు తన మార్గాన్ని మార్చుకుంటాడు. కథలోని కోర్ ఎమోషన్‌ని కనెక్ట్ చేయడంలో దర్శకుడు మరింత పనితనం చూపించాల్సింది.

ఈగల్ కథలో ఒక బలమైన సందేశం వుంది. ఆ సందేశాన్ని తెరపైకి సమర్థవంతంగా తీసుకురాలేకపోయారనే చెప్పాలి.

ఇందులో దళం పోరాటం, అలాగే ఆయుధాల కోసం టెర్రరిస్టులు రాక నాన్ సింక్ వ్యవహారాలుగా మారాయి. నిజానికి కథలో కీలకమైన ట్రాక్స్ ఇవి. క్లైమాక్స్ ఫైట్ మాత్రం యాక్షన్‌ని ఇష్టపడే వారికి నచ్చుతుంది.

నటన ఎలా ఉంది?

రవితేజ కొత్తగా కనిపించారు. చాలా సెటిల్డ్‌గా నటించారు. ఆయనలోని మాస్‌ని దర్శకుడు కాస్త కొత్తగా వాడుకున్నారు. రవితేజ యాక్షన్ సీన్స్‌లో మరింతగా ఆకట్టుకున్నారు.

కథని ముందుకు నడిపే పాత్రలో అనుపమ న్యాయం చేశారు.

కావ్య థాపర్ పాత్రని రొటీన్‌గా మార్చడంతో ఆ పాత్రలో కొత్తదనం ఏమీ వుండదు.

మ‌ధుబాల‌ పాత్రకు స్కోప్ ఉంది. కానీ, సరిగ్గా ప్రజెంట్ చేయలేదనిపిస్తుంది.

అజ‌య్ ఘోష్‌ కామెడీ విలనిజం పంచారు.

శ్రీ‌నివాస‌రెడ్డి కామెడీ టైమింగ్ కాస్త నవ్వించింది. విన‌య్ రాయ్ పాత్రలో కూడా బలం లేదు.

న‌వదీప్ పాత్రను హీరో పాత్రకు ఎలివేషన్ ఇవ్వడానికి వాడుకున్నారు. మిగతా అందరూ పరిధి మేరకు చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

ఈగల్‌ మేకింగ్ స్టయిలిష్‌గా ఉంది. యాక్షన్ సీన్స్‌ని కొత్తగా తీశారు. క్లైమాక్స్‌లో గన్స్‌ని వాడుకున్న తీరు బావుంది.

ఇల్లంతా మిష‌న్ గ‌న్‌లా మారిపోవ‌డం, అమ్మవారు బుల్లెట్ల వ‌ర్షం కురిపించ‌డం మాస్‌కి తెగ న‌చ్చుతాయి.

ఫోటోగ్రఫీ, నేప‌థ్య సంగీతం, ప్రొడ‌క్షన్ వాల్యూస్‌ బాగా కుదిరాయి. టెక్నికల్‌గా దర్శకుడు కార్తీక్ ఘ‌ట్టమ‌నేనికి మంచి మార్కులు పడతాయి.

ఆయుధం కూడా అవ‌స‌రం మేర‌కే వాడాలి, మంచి వాళ్ల చేతుల్లోనే ఉండాలి అనే సందేశాన్ని ఓ మాస్, క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చెప్పే ప్ర‌య‌త్నం బాగుంది.

అయితే కథని ప్రేక్షకులకు మరింత హత్తుకునే విధంగా చూపించి ఉంటే ‘ఈగల్’ ఇంకాస్త ఎత్తులో ఎగిరేది.

(గమనిక: ఈ సమీక్ష రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.)

ద ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)