You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వయసును తగ్గించుకునేందుకు ఈ బిజినెస్ మేన్ ఏం చేస్తున్నారంటే...
- రచయిత, లారా లెవింగ్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మనం మరణాన్ని తప్పించుకోలేం. కానీ, వయసురీత్యా మనలో వచ్చే మార్పులను మాత్రం తప్పించుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
గత 150 ఏళ్లలో మనుషుల జీవన కాలం రెండింతలు పెరిగి ఉండొచ్చు. కానీ, చాలా మంది మాత్రం వయసు పెరుగుతున్నా కొద్ది తమలో వచ్చే మార్పుల విషయంలో చాలా నిరాశగా ఉంటారు.
ఈ నిరుత్సాహాన్ని తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. దీని ద్వారా ఆరోగ్యకరంగా, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అనేక ఆధునిక చికిత్సల ద్వారా శరీరంలో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని, బాధలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
న్యూట్రిషినల్ పిల్స్‌ను ఇవ్వడం ద్వారా మన శరీరంలో కణాల క్షీణతను తగ్గించేందుకు చికిత్స ఇస్తున్నారు.
ఈ చికిత్సల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.
ఈ అధ్యయనాలు, చికిత్సలు కేవలం మనీ మేకింగ్ వెంచర్లా లేదా వైద్య రంగంలో పురోగతికి సహకరిస్తుందా అనేది తెలుసుకోవడం కోసం తాను కాలిఫోర్నియా వెళ్లానని వ్యాసకర్త, బీబీసీ ప్రతినిధి లారా లెవింగ్టన్ చెప్పారు.
45 ఏళ్ల వ్యాపారవేత్త బ్రెయిన్ జాన్సన్ జన్యుపరమైన చికిత్సతో తన వయసు తక్కువ కనిపించేలా వందల వేలకొద్ది డాలర్లను ఖర్చు చేస్తున్నారు.
వయసు పెరుగుతున్నా కొద్ది, మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. శరీరం చాలా పాడవుతుంది. క్యాన్సర్, డయబెటీస్, గుండె జబ్బులు వంటి వాటికి కారణం వయసు పెరగడమే.
వయసు పెరగడాన్ని ఆపడం ద్వారా ఈ వ్యాధులు రావడాన్ని కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు నమ్ముతున్నారు.
లగ్జరీ వెనీస్ బీచ్‌లోని తన ఇంటిని జాన్సన్ క్లినిక్‌గా మార్చేసుకున్నారు. ప్రతి రోజూ ఎన్నో గంటలను ఆ క్లినిక్‌లోనే వెచ్చిస్తూ ఉంటారు.
ఉదయం 5 గంటలకు లేస్తారు. ఆరు కల్లా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత 11 గంటల కల్లా మధ్యాహ్న భోజనం చేస్తారు. దీంతో పాటు, 54 న్యూట్రిషినల్ పిల్స్‌ను తీసుకుంటారు.
రెగ్యులర్ చెకప్‌ల ద్వారా జాన్సన్ శరీరాన్ని పరీక్షించి ఈ మెడిసిన్ల డోస్‌ను, తీసుకునే సమయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు.
చాలా వరకు వ్యాయామాలు, చికిత్సలతోనే ఆయన రోజంతా గడిచిపోతుంది.
స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్‌తో చర్మం వయసు కూడా 22 ఏళ్లకి తగ్గిపోయింది. శరీరంలోని ఇతర బాడీ పార్ట్‌లతో పోలిస్తే తన స్కిన్ చాలా యంగ్‌గా ఉంటుందని జాన్సన్ చెబుతున్నారు.
‘‘నా అందాన్ని పెంచుకునేందుకు, ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉండేందుకు నా స్కిన్ చాలా ముఖ్యమైన భాగం.’’ అని జాన్సన్ తెలిపారు.
ఆరోగ్యానికి జాన్సన్ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ 5 కి.మీలు నడుస్తారు. చక్కెరను శరీరంలోకి చేరకుండా వీలయినంతగా ప్రయత్నిస్తారు. దీంతో పాటు తన శరీర కార్యకలాపాలను మానిటర్ చేసుకునేందుకు ఇంటెన్సివ్ మానిటరింగ్ డివైజ్‌లను వాడుతున్నారు.
దీర్ఘాయువును పొందడమెలా?
‘‘మీ జీవనకాలాన్ని పెంచుకోవడంలో 7 శాతం మాత్రమే జెనిటిక్స్ సాయపడతాయి. మిగతా 93 శాతం మీ జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది’’ అని బక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఎరిక్ వెర్డిన్ చెప్పారు.
ఎవరైతే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తారో వారు 95 ఏళ్ల పాటు నివసిస్తారని ఆయన అన్నారు. మానవుని సగటు జీవన కాలం కంటే 15 నుంచి 17 ఏళ్లు ఎక్కువగా వీరి జీవన కాలం ఉంటుందని ఎరిక్ చెప్పారు.
అయితే ఆరోగ్యకరమైన జీవన విధానాల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకునేందుకు చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, షుగర్‌ను వాడకపోవడం, తగినంత నిద్ర వంటివి ఆరోగ్యకరమైన జీవన విధానాల్లో ముఖ్యమైనవి.
‘‘ఎక్కువగా వ్యాయామాలు, కొన్ని గంటల పాటు ఉపవాసం, మంచి నిద్ర, సామాజిక సంబంధాలు, ఆల్కహాల్ తక్కువగా తీసుకోవడాన్ని నేను ప్రతిరోజూ అనుసరిస్తుంటాను’’ అని ఎరిక్ తెలిపారు.
మరి ఆయన అందరికీ ఇచ్చే సందేశమేంటి?
‘‘24 గంటల సమయంలో కనీసం 14 గంటలు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది మనుషుల మెటాబోలిజంపై మంచి ప్రభావం చూపుతుంది’’ అంటారాయన.
‘ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి’
మనం వయసు పెరుగుతున్నా కొద్ది మన శరీరంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే, వెంటనే దానికి అవసరమైన వైద్యాన్ని సరైన సమయంలో తీసుకోవాలి.
ఈ విధానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలనీ, ఇది జీవితాల్లో పెను మార్పును తీసుకురాగలదనీ అంటారు ఎరిక్.
రీసెర్చ్‌లో పాల్గొన్న చాలామంది తమ ఆయుర్ధాయాన్ని పెంచుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ ట్రాకర్లను వాడుతున్నారు.
బాడీలో జరిగే ప్రక్రియలను గుర్తించేందుకు స్మార్ట్ వాచ్‌ను, నిద్ర సమయాలను మానిటర్ చేసేందుకు స్మార్ట్ రింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిద్రపోయేటప్పుడు వాచ్ కంటే మరింత సౌకర్యవంతంగా రింగ్ ఉంటుందని చాలా మంది రీసెర్చర్లు చెబుతున్నారు.
దీర్ఘాయువు కూడా ఒక సమస్యేనా?
ప్రజల ఆయుర్ధాయం క్రమంగా పెరుగుతోంది. వైద్య రంగంలో ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయుష్షు పెరిగింది.
అయితే, ప్రజల జీవన కాలం పెరుగుతున్న సమయంలో, వృద్ధాప్యాన్ని మనం ఒక నిర్దిష్ట వయసు తర్వాత వ్యాధిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వృద్ధాప్యాన్ని చెప్పేందుకు ఒక వయసును నిర్ణయిస్తే, వారికి చేసే చికిత్సా ఖర్చులు కూడా పదింతలు పెరగనున్నాయి.
ఒక వయసు వచ్చిన తర్వాత వారిని ‘సిక్’లుగా(అనారోగ్యులుగా) ముద్ర వేసే ప్రమాదం ఉంది.
ఆరోగ్యకరమైన జీవితమంటే మరింత కాలం పాటు ప్రజలు పని చేయగలగడమని అర్థం. అంటే ప్రజలు పని గంటలు కూడా పెరగనున్నాయి.
‘‘కాలిఫోర్నియా వెళ్లి వచ్చిన తర్వాత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాను. నేను నా రోజువారీ జీవన విధానాన్ని మార్చుకున్నాను. బాగా నిద్ర పోతున్నాను, రోజూ వ్యాయామం చేస్తున్నాను. మంచి ఆహారం తీసుకుంటున్నాను’’ అని వ్యాసకర్త లారా లెవింగ్టన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)