You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'హెల్త్ యాంగ్జైటీ' లక్షణాలు ఏమిటి? దీనికి చికిత్స ఎలా?
- రచయిత, ఓంకార్ కర్మ్‌బేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొంత మంది తమ ఆరోగ్యం గురించి నిత్యం ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను సంప్రదించడం, తమకున్న లక్షణాల గురించి ఇంటర్నెట్‌లో వెతకడం.. ఇదే పనిగా ఉంటారు.
ఇలాంటివారు మన బంధువుల్లో, ఇరుగుపొరుగులో, లేదా ఆఫీసులో తారసపడుతుంటారు.
వారు నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా లేక ఊరికే ఆందోళన చెందుతున్నారా అన్నది నిర్ధరించుకోవడం ముఖ్యం.
వారి మనసులో ఉన్న భయాలేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఒక అనారోగ్యకరమైన మానసిక స్థితే.
అనారోగ్యం పాలవుతామేమోనని నిరంతరం ఆందోళన చెందడం, తమకు లేని లక్షణాలను ఊహించుకుంటూ భ్రమపడుతుండడం లాంటి లక్షణాలతో కూడిన ఈ మానసిక సమస్యకు చికిత్స అవసరం.
వాస్తవానికి, మనందరికీ ఆరోగ్యం గురించి ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. అది పరిమితి దాటితే, నిత్యం అదే ఆలోచిస్తూ బెంగపడుతుంటే అప్పుడు చికిత్స అవసరం.
కరోనావైరస్ మహమ్మారి తరువాత మనుషుల్లో ఇలాంటి మానసిక స్థితి పెరిగినట్టు కనిపిస్తోంది. తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా సందేహపడడం ఎక్కువవుతోంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, జలుబు, దగ్గులు ఈ పరిస్థితిని మరిత దిగజారుస్తున్నాయి.
ఈ మానసిక స్థితిని 'హెల్త్ యాంగ్జైటీ' అంటున్నారు.
ఆరోగ్యం పట్ల అతి భయం, అతి శ్రద్ధ
బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ఈ కండిషన్ లక్షణాలను వివరించింది.
- నిత్యం ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం
- అనారోగ్య సంకేతాల కోసం వెతకడం, ఏ చిన్న నొప్పి, వాపు కనిపించినా భయపడడం
- నాకు ఒంట్లో బాలేదు కదా? అంటూ పక్కవారితో చెక్ చేసుకుంటూ ఉండడం
- డాక్టర్ సరిగా పరీక్షలు నిర్వహించలేదనో, లేక లక్షణాలు సరిగా గుర్తించలేదనో బెంగపడడం
- ఇంటర్‌నెట్‌లో ఎప్పుడూ ఆరోగ్యం గురించి చదువుతూ అవసరానికి మించి సమాచారాన్ని సేకరించడం
- తీవ్రమైన అనారోగ్యానికి సంబంధించినది ఏదైనా, చివరికి టీవీ కార్యక్రమాలను కూడా చూడకుండా ఉండడం
- అనారోగ్యంతో ఉన్నట్టు ప్రవర్తించడం. ఉదాహరణకు, శారీరకంగా శ్రమ పడకుండా విశ్రాంతి తీసుకోవడం.
ఒక్కోసారి ఈ ఆందోళన వల్ల తలనొప్పి లేదా గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి కనిపించవచ్చు. దాంతో మరింత భయపడుతుంటారు.
కంటికి కనిపించని శత్రువుతో పోరాటం
కోవిడ్ మహమ్మారి తరువాత ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది. కరోనావైరస్ వల్ల మనపై ఒత్తిడి పెరిగింది. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం, ప్రతి చిన్న విషయానికి భయపడడం. కరోనా వ్యాప్తి తీవ్రత బాగా తగ్గిపోయినా ఈ భయాలు పోలేదు.
ఆరోగ్యం పట్ల అతి భయం, అతి శ్రద్ధ ఉన్నవారు ఇంట్లో కిటికీలు కూడా తెరవకపోవడం, ఇంటి నుంచి బయటకు రాకపోవడం, గంటల తరబడి ఇంటిని శుభ్రంచేయడం వంటి పనులు చేస్తుంటారు. ఈ శ్రమ, ఒత్తిడి వల్ల మరింత బాధపడుతుంటారు.
ఈ భయాల్లో రెండు రకాలు. ఇప్పుడు వ్యాధి సోకుతుందని భయం, భవిష్యత్తులో రావచ్చన్న భయం.
కరోనా తరువాత హెల్త్ యాంగ్జైటీ గురించి సందేహాలు, ప్రశ్నలు అడిగేవారు ఎక్కువైపోయారని హెల్త్ యాంగ్జైటీ స్పెషలిస్ట్, బిహేవియరల్ థెరపిస్ట్ డాక్టర్ రాబ్ విల్సన్ గతంలో బీబీసీతో చెప్పారు.
"కరోనా వచ్చినా, ఆందోళన చెందినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కరోనా ఒక దుర్మార్గపు చక్రాన్ని సృష్టించింది. వ్యాధి వల్ల ఆందోళన మొదలవుతుంది. ఆందోళన పెరుగుతున్న కొద్దీ వ్యాధి ముదురుతుంది. తగ్గినా, మళ్లీ సోకవచ్చన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నట్టు ఉంటుంది" అని ఇంగ్లాండ్‌లోని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ మరియన్ ట్రెంట్ వివరించారు.
హెల్త్ యాంగ్జైటీని ఎలా గుర్తించాలి?
ఎంత తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాం, ఎంత ఎక్కువగా ఇతరులతో దీని గురించి మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు ఇంటర్నెట్‌లో సమాచారం సేకరిస్తున్నాం అన్నవి నోట్ చేసుకుంటే హెల్త్ యాంగ్జైటీ ఉందో, లేదో గుర్తించడం తేలిక అవుతుందని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.
ఒంట్లో బాగానే ఉందా, లేదా ఎక్కడైనా నొప్పి, వాపు ఉందా అని సందేహం వస్తే, వెంటనే మనసును మరోదాని పైకి మళ్లించాలని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.
నడకకు వెళ్లడం లేదా స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడడం వంటివి చేయవచ్చు. మానేసిన ఆటలు మళ్లీ మొదలెట్టడం, భయపడి ఇంట్లో కూర్చోకుండా నలుగురిలోకి రావడం వంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఈ స్థితి నుంచి బయటపడడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుందని డాక్తర్ ట్రెట్ చెబుతున్నారు.
"రోగితో మాట్లాడుతూ వారి ఆలోచనా విధానాలను మార్చడం, భయాలను తొలగించడం మొదలైనవి చేయాలి."
అలాగే ఎక్స్‌పోజర్ థెరపీ కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దేనికి భయపడుతున్నారో గుర్తించి, ఆ పని చేసేలా ఉత్సాహపరచడం. ఉదాహరణకు మార్కెట్‌కు వెళ్లడానికి భయంగా ఉంటే, నెమ్మది నెమ్మదిగా భయాలను పోగొడుతూ మార్కెట్‌కు వెళ్లేటట్లు చేయాలి. ఒకేసారి కాకుండా దశలవారీగా ఆ పని పూర్తిచేసేందుకు ప్రోత్సహించాలి.
చికిత్స అందించడం ముఖ్యం
హెల్త్ యాంగ్జైటీతో బాధపడుతున్నవారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ వైదేహి భిడే చెప్పారు.
"కరోనా తరువాత హెల్త్ యాంగ్జైటీ పెరిగినట్లు కనిపిస్తోంది. అలాంటి వారికి సకాలంలో వైద్యం అందిస్తే ప్రమాదం తప్పుతుంది. దీని లక్షణాలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతూ ఉంటాయి. తీవ్రత కూడా వేరుగా ఉండవచ్చు. హెల్త్ యాంగ్జైటీతో బాధపడుతున్న వ్యక్తులు గుండె దడ, పానిక్ అటాక్ లేదా మానసిక వ్యథ అనుభవిస్తూ ఉంటారు. వణుకు వస్తున్నట్టు, రక్తపోటు పెరుగుతోందని, తల తిరుగుతున్నట్టు ఉందని భ్రమపడుతుంటారు. వైద్య పరీక్షల్లో ఎలాంటి అనారోగ్యం కనబడకపోతే, సరిగా పరీక్షలు చేయలేదని సందేహిస్తారు. కొంతమంది డాక్టర్లను కూడా మారుస్తారు. ఈ ఆందోళన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే, వెంటనే మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది" అని ఆమె వివరించారు.
"గూగుల్ మీకు ఫ్రెండ్ కాదు. అందులో ఉన్న సమాచారం అంతా మనకు వర్తించకపోవచ్చు. మీకు ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదు అన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. డాక్టర్లు, కౌన్సిలర్లతో మాట్లాడి, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేయించుకోవడం మంచిది" అని డాక్టర్ వైదేహి భిడే అన్నారు.
కుటుంబ సభ్యుల సహకారం అవసరం
హెల్త్ యాంగ్జైటీతో బాధపడుతున్నవారికి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
తమకు ఒంట్లో బాలేదని చెప్పినప్పుడు వారి మాట కొట్టిపారేయకుండా, ఓపికగా వారు చెప్పేది విని భయాలను తొలగించే ప్రయత్నంచేయాలి.
"ఎక్కడ నొప్పిగా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, ఎంత తరచూ వస్తోంది" వంటి ప్రశ్నలు అడుగుతూ ప్రేమతో వ్యవహరించాలి.
ఒక్కోసారి "ఏమీ బాగాలేదు, ఏదో తేడాగా ఉంది, ఒంట్లో బాలేదు" వంటి అస్పష్టమైన జవాబులు రావచ్చు. అలాంటప్పుడు కుటుంబ సభ్యులు మరింత ఓపికతో వ్యవహరిస్తూ, మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
నిరాశ, ఆందోళన, పశ్చాత్తాపం, కోపం, ద్వేషం వంటి భావాలు మనసులో ఉండవచ్చు. అవి అలాగే ఎక్కువకాలం కొనసాగుతుంటే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించడం మేలు.
ఈ ఆందోళన జీవితానికి అడ్డం పడుతున్నట్టు అనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స గురించి ఆలోచించాలి.
అపోహలకు, అపార్థాలకు దూరంగా ఉండాలి
సాధారణంగా ఏదైనా మానసిక సమస్య ఉంటే వెంటనే పిచ్చి లేదా డిప్రెషన్ అని పేరు పెట్టేస్తారు.
మానసిక అవస్థలు అనేక రకాలు. అవి వివిధ దశల్లో ఉండవచ్చు. ఎక్కువగా ఆలోచించడం, ఓసీడీ, ఆందోళన, డిప్రెషన్ ఇలా వివిధ రకాలు ఉంటాయి.
సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్లడానికి సంకోచించకూడదు. సైకియాట్రిస్టు దగ్గరకు వెళుతున్నారంటే పిచ్చి ఉందని అనుకునేవారికి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఇలాంటి మాటలు రాకుండా చూసుకోవాలి.
అన్ని రకాల సమస్యలకూ షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తారని అనుకోకూడదు. ఒకవేళ ఇచ్చినా, అది డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. చికిత్స తరువాత, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఇంటికి వెళతారు.
కాబట్టి, అపోహలు పక్కనపెట్టి మానసిక సమస్యలను గుర్తించడం, చికిత్స చేయించుకోవడం అవసరం.
(గమనిక: ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)
ఇవి కూడా చదవండి:
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్‌కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- కిబితూ: భారత్‌లోని చివరి గ్రామం నుంచి చైనాకు మోదీ ప్రభుత్వం పంపుతున్న సందేశం ఏమిటి?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?