You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలి?
- రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
విటమిన్-డి లోపం... ఇండియాలో ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్న సమస్య.
నిన్నమొన్నటి వరకు సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఈ సమస్యే రాకపోవచ్చని భావించారంతా.
కానీ, రెండేళ్ల క్రితం నిర్వహించిన ఓ పరిశోధనలో దేశంలో ఏకంగా 76 శాతం ప్రజలు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది.
ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా తాజా పరిశోధన ప్రకారం, 50 నుంచి 94 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం కనిపిస్తోందని తేలింది.
సూర్యరశ్మిలో విటమిన్-డి లభిస్తుందని మనందరికీ తెలుసు. కానీ శరీరానికి తగినంత విటమిన్-డి లభించాలంటే రోజులో ఎంత సేపు ఎండలో నిలబడాలి?
వెలుగునిచ్చే సూర్యుడు మనిషిలో ఉత్సాహాన్ని నింపుతాడు
తెల్లవారుజామునే సముద్ర తీరంలో కూర్చుని లేలేత సూర్య కిరణాలు చూడడం అనేది చాలామందికి ఆహ్లాదం కలిగించే విషయం. ఎందుకు?
కడప జిల్లాలోని గండికోట జలాశయాన్ని చూసేందుకు వెళ్లే వాళ్లంతా రాత్రంతా అక్కడే టెంట్లు వేసుకొని ఉండి, ఉదయం కాగానే ఆ ఎర్రని రాళ్లపై పడే సూర్య కిరణాలను చూసేందుకు ఎందుకు ఎగబడుతుంటారు?
అంతెందుకు.. నిన్నగాక మొన్న తూర్పుగోదావరి జిల్లాలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన పర్యటక కేంద్రం గుడిసెను సందర్శించి, ఆ కొండపైన పచ్చని గడ్డిమైదానాల్లో ఉదయపు సూర్యుడిని వీక్షించేందుకు ప్రకృతి ప్రియులు ఎంత కష్టమైనా ఎందుకు వెళ్తున్నారు?
వీటన్నిటికీ సమాధానం ఒక్కటే... వెలుగునిచ్చే సూర్యుడు మనిషిలో ఉత్సాహాన్ని కూడా నింపుతాడు. నూతన శక్తినిస్తాడు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే సూర్యుని వల్ల పైసా ఖర్చు లేకుండా లభించే విటమిన్-డి శరీర పోషణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరంలో ఉండే ఇంటర్నల్ క్లాక్ వ్యవస్థకు ప్రతి రోజూ కొంత మోతాదులో సూర్యరశ్మి అవసరం. అప్పుడే శరీరంలో ఉండే ఇంటర్నల్ క్లాక్ సిస్టమ్ బాహ్య ప్రపంచంలోని మార్పులను తనలో ఇముడ్చుకుంటుంది.
ఇంకో రకంగా చెప్పాలంటే, సూర్యరశ్మి మన మెదడులో మెలటొనిన్ అనే హార్మోన్ తయారీని అడ్డుకుంటుంది. ఈ మెలటొనిన్ హార్మోన్ ఓ రకంగా నిద్రకు కారణమవుతుంది. సాధారణంగా రాత్రి 8 గంటలకు మొదలయ్యే దీని ప్రభావం రాత్రి ఒంటిగంట సమయంలో పతాక స్థాయికి చేరుకుంటుంది.
ఉదయం కాగానే సూర్యుని వెలుగు కారణంగా ఈ హార్మోన్ తయారీ క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా శరీరం ఉత్తేజితమవుతుంది.
శరీర పోషణలో కీలక పాత్ర పోషించే విటమిన్-డి
నిజానికి ఓ 30-40 ఏళ్ల క్రితం వరకు మన దేశంలో డి-విటమిన్ లోపం అన్న మాట పెద్దగా వినిపించేది కాదు. అప్పట్లో సగటు భారతీయుడు పగలంతా ఎండలో కష్టపడి పని చేసి రాత్రి సేదదీరేవాడు. ఫలితంగా శరీరానికి అవసరమైన సూర్యరశ్మి అందడం వల్ల పెద్దగా సమస్యలు తలెత్తవి కాదు.
కానీ, ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. జలంధర్‌లోని గార్డియన్ హాస్పిటల్‌లో పని చేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజీవ్ గోయల్ ఆధర్యంలో 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో దేశంలో 76శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది.
మరీ ముఖ్యంగా 18-30 ఏళ్ల మధ్య వయస్కుల్లో అయితే ఏకంగా 82.5 శాతం మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.
డాక్టర్ సంజీవ్ గోయల్ నిర్వహించిన రీసెర్చ్ స్టడీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆర్థోపెడిక్స్ 2020 మే-జూన్ ఎడిషన్లో ప్రచురితమయ్యింది. యువతలోనూ, వృద్ధుల్లోనూ ఎక్కువగా విటమిన్-డి లోపం ఉందని ఈ పరిశోధన తేల్చింది.
మహిళల్లో తీవ్ర ప్రభావం
అటు మహిళల్లోనూ ఇది చాపకింద నీరులా ప్రవేశిస్తోందని, దేశం మొత్తం మీద 50 నుంచి 94 శాతం మంది మహిళల్లో ఇప్పుడు విటమిన్-డి లోపం కనిపిస్తోందని కొద్ది రోజుల క్రితం ది ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టేట్రెక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ముఖ్యంగా ఇతర వ్యాధుల కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో దీనిని గుర్తించడం వల్ల సరైన సమయానికి సరైన చికిత్స తీసుకోవడంలో కూడా ఆలస్యమవుతోందని తెలిపింది.
డి-విటమిన్ ఎందుకు లోపిస్తోంది?
నిన్నమొన్నటి వరకు డి-విటమిన్ విషయంలో మన వాతావరణ పరిస్థితులే మనకు వరమని వైద్య నిపుణులు భావించేవారు. అందువల్లే మన దేశంలో డి-విటమిన్ లోపం గురించి, సూర్యరశ్మి అవసరం గురించి కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా చర్చ జరగలేదు.
అయితే గత మూడు, నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న నగరీకరణ, ఆధునిక జీవన శైలి సగటు భారతీయుడిని సూర్యరశ్మికి క్రమంగా దూరం చేస్తూ వస్తోంది.
దానికి తోడు కాలుష్యం, తీసుకునే ఆహారంలో మార్పులు ఇవన్నీ డి-విటమిన్ లోపానికి కారణాలే అంటున్నారు వైద్య నిపుణులు.
మనిషి శారీరక, మానసిక వికాసంలో డి విటమిన్ పాత్ర చాలా కీలకం. మెటబాలిక్ ఫంక్షన్స్, ఇమ్యూన్ సిస్టమ్, ఎముకల పటుత్వం, మానసిక ఆరోగ్యం వీటన్నింటికీ డి విటమిన్ అత్యవసరం. ఈ లోపం వల్ల మానసిక కుంగుబాటుకు గురవుతారని, ఆందోళన పెరిగి, క్షణక్షణం మనిషి మూడ్స్ మారిపోతూ ఉంటాయని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
ఎంత సేపు ఎండలో ఉండాలి?
ఒక్కో ప్రాంతంలో ఒక్కో మనిషికి ఒక్కోలా సూర్యరశ్మి అవసరం ఉంటుంది. మన దేశం విషయానికి వస్తే ఉదయం, సాయంత్రపు ఎండ మంచిదన్నది వైద్య నిపుణుల సూచన.
తెలుపు, గోధుమ వర్ణంలో చర్మం ఉండే వారు రోజు కనీసం 20 నిమిషాలు నేరుగా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలా వారంలో కనీసం 3 నుంచి నాలుగుసార్లు ఎండలో ఉండటం ద్వారా శరీరానికి తగిన డి-విటమిన్ లభిస్తుంది.
అదే నలుపు రంగు చర్మం వారు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వారంలో 3- 4 రోజులు సూర్యరశ్మి నేరుగా శరీరానికి తగిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా మోచేతులు, ముఖానికి నేరుగా ఎండ తగలాలి.
ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్లు పూసుకోకూడదు. అలాగే ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచకూడదు. ఒకే చోట నిల్చుని ఉండకుండా అటూ ఇటూ తిరగడం మంచిది. ఎండలోంచి వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే అలోవెరా వంటి లోషన్లు శరీరానికి రాసుకోవచ్చు.
ఇక ఎండలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు కనీసం మీరు పని చేసే చోటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. వీలైతే కిటికీ పక్కనే సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో కూర్చోండి. మీరు పని చేస్తున్న కంప్యూటర్ పక్కన, మీ కంటికి తగిలేలా ఓ లైటును ఏర్పాటు చేసుకోండి.
సూర్యరశ్మికి ప్రత్యామ్నాయం ఉందా?
నిజానికి మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి. కానీ డి-విటమిన్ విషయానికి వస్తే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి ఈ విటమిన్ చాలా తక్కువగా లభిస్తుంది. అదీగాక విటమిన్-డి కలిగిన ఆహార పదార్థాలు కూడా చాలా తక్కువ.
సాల్మన్, టూనా వంటి చేపల మాంసంలోనూ, ఫిష్ లివర్ ఆయిల్స్‌లోనూ విటమిన్-డి చాలా కొద్ది మోతాదులో లభిస్తుంది. అలాగే బీఫ్ లివర్, చీజ్, కొన్ని రకాల పుట్టగొడుగుల్లో కూడా కొంత వరకు విటమిన్-డి ఉంటుంది.
విటమిన్-డి విషయంలో సూర్యరశ్మికి మించినది మరొకటి లేదు. అందుకే వైద్యులు కూడా కనీసం రోజులో 20 నిమిషాల సేపు ఎండలో ఉండాలంటున్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)