You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో నేరస్థుడిగా రుజువైన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడిచిపెట్టాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ హత్య కేసులో ఆనంద్ మోహన్‌కు సుప్రీం కోర్టులో కూడా ఉపశమనం లభించలేదు. కానీ, బిహార్‌లోని నీతీశ్ కుమార్ ప్రభుత్వం ఆయనతోపాటు మరో 27 మందిని జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది.
గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య 1994 డిసెంబరు 5న నడి రోడ్డు మీదే హత్యకు గురయ్యరు. ఈ కేసులో ఆనంద్‌కు జీవిత ఖైదు విధించారు.
మొదట ఈ కేసులో దిగువ న్యాయస్థానం ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. అయితే, ఈ శిక్షను జీవిత ఖైదుకు పట్నా హైకోర్టు తగ్గించింది.
పట్నా హైకోర్టు తీర్పు తర్వాత, ఆనంద్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ, ఆయనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు.
ఆనంద్ మోహన్ ఎవరు?
సహరసా జిల్లా పచగఛియా గ్రామానికి చెందిన ఆనంద్ మోహన్ బిహార్‌లోని ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఒకరు. 1974లో విద్యార్థిగా ఉన్నప్పుడే జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలోనూ ఆయన పాలుపంచుకున్నారు.
1990లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిషీ నియోజకవర్గం నుంచి జనతా దళ్ టికెట్‌పై ఆయన గెలిచారు.
అప్పట్లో కోసీ ప్రాంత రాజ్‌పుత్ నాయకుల్లో ఆనంద్ మోహన్ పేరు బలంగా వినిపించేది. గుర్రంపై స్వారీ చేస్తూ, తుపాకీ పట్టుకుని తీసుకున్న ఫోటోలు బిహార్‌లో పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించేవి.
మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్‌తోనూ ఆనంద్ మోహన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు.
బిహార్‌లోని శివహర్ ప్రాంతంలో 1980, 1990లలో రఘునాథ్ ఝా ప్రధాన నాయకుడిగా ఉండేవారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీగానూ ఆయన పనిచేశారు.
రఘునాథ్ ఝా మనమడు నవ్‌నీత్ ఝా మాట్లాడుతూ.. ‘‘1990ల్లో మా తాతగారు జనతా దళ్ పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా ఉండేవారు. ఆయనే మహిషీ అసెంబ్లీ టిక్కెట్‌ను ఆనంద్ మోహన్‌కు ఇప్పించారు’’అని చెప్పారు.
1993లో కొత్త పార్టీ
ఆ తర్వాత బిహార్‌తోపాటు ఉత్తర భారత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి.
రామ్ మందిర్ ఉద్యమంతో కాంగ్రెస్‌కు బీజేపీ ఒకవైపు గట్టి సవాల్ విసిరింది. మరోవైపు వీపీ సింగ్ ప్రభుత్వానికి మండల్ కమిషన్ సిఫార్సులతో మరో తలనొప్పి వచ్చిపడింది.
మండల్ కమిషన్ సిఫార్సులను బిహార్‌లోని జనతా దళ్ స్వాగతించింది. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు మండల్ కమిషన్ సిఫార్సులకు గట్టిగా మద్దతు పలికారు.
అయితే, రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్ మోహన్ రిజర్వేషన్లను వ్యతిరేకించారు. అందుకే 1993లో ఆయన జనతా దళ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొత్తగా ‘‘బిహార్ పీపుల్స్ పార్టీ (బీపీపీ)’’ని ఆయన పెట్టారు.
కోసీ-సీమాంచల్ ప్రాంతానికి చెందిన మరో నాయకుడు పప్పు యాదవ్ రిజర్వేషన్లను గట్టిగా సమర్థించేవారు. పప్పూ యాదవ్-ఆనంద్ మోహన్‌ల మధ్య వైరంపై పత్రికల్లో చాలా వార్తలు వచ్చేవి.
‘‘రాబిన్‌హుడ్ ఇమేజ్’’
ఆ ఇద్దరు నాయకులూ ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరి కాన్వాయ్‌లో ఎక్కువ వాహనాలు ఉన్నాయి? అని ప్రజలు మాట్లాడుకునేవారు. వీరిద్దరూ ప్రజల్లో రాబిన్‌హుడ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
1991లో మాధేపురా అసెంబ్లీ ఉప ఎన్నికలో వీరిద్దరి మధ్య వైరం పతాక స్థాయికి వెళ్లింది.
ఆ సమయంలో జనతా దళ్ నుంచి శరద్ యాదవ్ పోటీచేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఆనంద్ మోహన్ నిలబడ్డారు.
శరద్ యాదవ్‌కు మద్దతుగా పప్పూ యాదవ్ ప్రచారానికి వచ్చారు. అయితే, అక్కడ ఆనంద్ మోహన్, పప్పూ యాదవ్‌ల మధ్య గొడవ జరిగిందని, కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని వార్తలు వచ్చాయి.
ఛోటన్ శుక్లా హత్య కేసు..
1990ల్లో రిజర్వేషన్లపై ప్రజలు దాదాపుగా వర్గాలుగా విడిపోయారు. ప్రజల్లో బాహుబలి, రాబిన్‌హుడ్ లాంటి పేరున్న చాలా మంది నాయకులు అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
అలా వచ్చిన వారిలో ముజఫర్‌పుర్‌కు చెందిన ఛోటన్ శుక్లా ఒకరు. భూమిహార్ వర్గానికి చెందిన ఆయనకు ఆనంద్ మోహన్‌తో దగ్గర సంబంధాలు ఉండేవి.
ఆనంద్ మోహన్ పార్టీ టికెట్‌పై ఛోటన్.. కేసరియా నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావించారు. కానీ, 1994 డిసెంబరు 4న ముజఫర్‌పుర్‌లో ఛోటన్ హత్యకు గురయ్యారు.
అయితే, అసలు ఆయన ఎలా చనిపోయారో అంతుచిక్కని మర్మంగానే మిగిలిపోయింది.
కృష్ణయ్య హత్య
ఛోటన్ శుక్లా హత్య తర్వాత రెండో రోజు అంటే డిసెంబరు 5న ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అటువైపుగా వచ్చిన ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్యపై జనం దాడిచేశారు.
ఆనాడు కృష్ణయ్య గోపాల్‌గంజ్‌కు జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముజఫర్‌పుర్‌తో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేదు.
అయితే, అక్కడ ఏం జరిగిందో సీనియర్ జర్నలిస్టు సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు పట్నా నుంచి కృష్ణయ్య తిరిగివస్తున్నారు. అయితే, పట్నా-ముజఫర్‌పుర్ హైవేపై చోటన్, ఆనంద్ మోహన్ మద్దతుదారులు నిరసన చేపడుతున్నారు. ఆ మార్గంలో ఎర్రబుగ్గతో కారు రావడంతో జనం దానిపై పడ్డారు’’అని ఆయన చెప్పారు.
జనాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఆనంద్ మోహన్‌ను దోషిగా 2007లో అడిషనల్ జిల్లా, సెషన్సు జడ్జి తీర్పునిచ్చారు. ఆయనకు మరణ శిక్ష విధించారు.
అయితే, 2008 డిసెంబరులో పట్నా హైకోర్టు ఈ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా పట్నా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
రాజకీయ పలుకుబడి..
శివహర్ ఎంపీగా ఆనంద్ మోహన్ పనిచేశారు. ఆయన భార్య లవ్లీ ఆనంద్ వైశాలి నుంచి ఎంపీగా పనిచేశారు. వీరి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఆర్జేడీ ఎమ్మెల్యే.
కొన్ని నెలల క్రితమే ఆనంద్ మోహన్‌ను విడుదల చేయొచ్చని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ.. నీతీశ్‌ను తప్పుపట్టారు.
‘‘తీవ్రమైన నేరాల కేసుల్లో దోషులను కూడా ఇలా వదిలిపెట్టడం దురదృష్టకరం. అసలు ఏ అంశాల ఆధారంగా ఆయనను విడిచి పెడుతున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి’’అని సుశీల్ కుమార్ మోదీ అన్నారు.
అసలు ఆనంద్ మోహన్‌ను ఎందుకు విడిచిపెడుతున్నారనే ప్రశ్నపై సీనియర్ జర్నలిస్టు నవీన్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లోని ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఆనంద్ మోహన్ ఒకరు. ఆయన ప్రభావం శివహర్‌తోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం’’అని ఆయన అన్నారు.
‘‘నిజానికి 2021కే ఆనంద్ మోహన్ జైలుకు వెళ్లి 14 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఆయనను విడుదల చేయాలనే రాజ్‌పుత్ వర్గాల డిమాండ్‌ను నీతీశ్ తోసిపుచ్చారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు’’అని నవీన్ చెప్పారు.
‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 మంది రాజ్‌పుత్‌లు గెలిచారు. వీరిలో చాలా మంది ఎన్‌డీఏ వైపే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం వరకూ వీరు ఉంటారు. దాదాపు 40 అసెంబ్లీ, ఎనిమిది లోక్‌సభ సీట్ల ఫలితాలను వీరు ప్రభావితం చేయగలరు. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీతీశ్ కూడా రాజ్‌పుత్ ఓట్లను కూడగట్టేందుకే ఆనంద్ మోహన్‌ను విడిపిస్తున్నారు’’అని ఆయన అన్నారు.
దళిత ఓట్లపై ప్రభావం పడుతుందా?
రాజ్‌పుత్‌ల కోసమే చట్టంలో మార్పులుచేసి, ఆనంద్ మోహన్‌ను విడిచిపెడుతున్నట్లు నీతీశ్ ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.
అయితే, కృష్ణయ్య దళిత వర్గానికి చెందినవారు. దీంతో దళిత ఓట్లు దూరం అవుతాయా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఈ విషయంలో ఇప్పటికే బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి.. నీతీశ్‌ను విమర్శించారు.
‘‘అయితే, దళితులు ఎక్కువగా చిరాగ్ పాసవాన్ పార్టీకి ఓట్లు వేస్తుంటారు. మహాదళిత్‌లు నీతీశ్‌కు అండగా నిలుస్తారు. మహాదళిత్ ఓటు బ్యాంకును నీతీశ్ కుమారే సిద్ధంచేసుకున్నారు. దీంతో తాజా నిర్ణయంతో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే, నేడు మహా కూటమికి రాజ్‌పుత్ ఓట్ల అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో దీని ఫలితాలు కనిపించొచ్చు’’అని నవీన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)