‘నేను ఎవరూ చేయని పనిచేస్తున్నానని నాకు తెలుసు’

    • రచయిత, క్రిస్ బరానియుక్
    • హోదా, టెక్నాలజీ ఆఫ్ బిజినెస్ రిపోర్టర్

విమానం టేకాఫ్ అయినప్పుడు వినిపించే శబ్ధం పూజా ఉమాశంకర్‌ అనే విద్యార్థినికి స్పష్టంగా గుర్తుంది.

పదేళ్ల వయసులో పూజ తన కుటుంబంతో కలిసి శ్రీలంక నుంచి యూకేకి ప్రయాణించింది. విమానం విండో నుంచి ఆమె చూడగా నేలమీద వందలాదిగా చిన్న చిన్న లైట్లు కనిపించాయి.

''ఇదొక మెటల్, అయినా ఎగురుతోంది'' అని ఆ చిన్నారి అనుకుంది.

పదిహేనేళ్ల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చదవడానికి పూజ శ్రీలంక నుంచి సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి వచ్చారు.

"మా పట్టణంలో ఎవరూ చేయని పని నేను చేయాలనుకుంటున్నానని తెలుసు" అని పూజ అంటున్నారు.

పూజ ఎందుకు జాయిన్ అయ్యారు?

పూజ వంటి వ్యక్తులు విమానయాన పరిశ్రమకు దొరకడం కష్టం. ఎయిర్‌లైన్స్, ఇంజనీరింగ్ సంస్థలు మెయింటెనెన్స్ ఇంజనీర్లను నియమించుకోవడానికి ఏళ్లుగా కష్టపడుతున్నాయి, ఈ రంగంలో తాజాగా ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది వరకు కొరత ఉంది.

రాబోయే దశాబ్దాలలో ఏవియేషన్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నందున ఇది పెద్ద సమస్య కావొచ్చు.

ఈ పరిశ్రమ అంచనాల ప్రకారం ఇప్పటి నుంచి 2040 సంవత్సరం వరకు దాదాపు 7 లక్షల మంది ఇంజనీర్లు ఈ రంగంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది.

ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ 9 డోర్ ఊడిపోయిన తర్వాత దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి మోడళ్లను తనిఖీ చేసే ఇంజనీర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది.

యూకే ఏరోస్పేస్, డిఫెన్స్, సెక్యూరిటీ, స్పేస్ ఇండస్ట్రీలలో మొత్తం 10,000 ఖాళీలు ఉన్నాయని ట్రేడ్ అసోసియేషన్ ఏడీఎస్ తెలిపింది.

ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న పూజా ఉమాశంకర్ ఈ పరిశ్రమలో భాగమవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

"నన్ను ఈ కోర్సు చదివేలా ప్రేరేపించేది ఏంటంటే, ప్రజల ప్రయాణానికి సాయం చేసే అవకాశం ఉండటం. వారు ఆకాశంలో ఎగిరేలా చేయాలనుకుంటున్నా, అది కూడా సురక్షితంగా" అని పూజ అన్నారు.

కోర్సులో ఎలక్ట్రానిక్స్‌ అంటే ఉత్సాహంగా ఉన్నా, ఉద్యోగ శిక్షణ ఎక్కువగా లభించలేదని ఆమె అంటున్నారు. పూజ పర్మినెంట్ జాబ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు.

తనను గౌరవించే, మంచి శిక్షణ అందించే ఒక కంపెనీ కోసం పూజ వెతుకుతున్నారు. ఒకవేళ ఉద్యోగం లభిస్తే తన సహోద్యోగుల్లో మహిళలు తక్కువే ఉంటారు, అయినా ఆ సమస్య ఆమెను అడ్డుకోలేదు.

"ఈ రంగంలో మహిళా ఇంజనీర్ల కొరత చాలా ఉంది, నేను ఆ ఉద్యోగుల్లో ఒకరిగా ఉంటాను" అని పూజ అంటున్నారు.

కొరతను తీర్చడానికి..

పరిశ్రమలో తీవ్రంగా ఉన్న ఈ జెండర్ ఇంబేలన్స్‌ను పరిష్కరిస్తే ఉద్యోగుల కొరత తగ్గుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

యూకేలో ఏరోస్పేస్, ఏవియేషన్ ఇంజనీర్లలో 10 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు.

అట్లాంటిక్ అంతటా ఈ నంబర్లు అధ్వాన్నంగా ఉన్నాయని వెస్ట్రన్ మిషిగాన్ విశ్వవిద్యాలయంలో మాజీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గెయిల్ రౌషర్ చెప్పారు.

అంతేకాదు అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌లలో 2.8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.

"పరిశ్రమలో మెంటార్‌గా వ్యవహరించడానికి తగినంత మంది మహిళలు ఉన్నారనుకోవట్లేదు" అని గెయిల్ రౌషర్ అన్నారు.

ప్రస్తుతం ఏవియేషన్ టెక్నీషియన్ల కొరతలో ఉన్నారా? లేదా? అని కొన్ని పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలను బీబీసీ సంప్రదించింది. అయితే వివరాలు పంచుకోవడానికి ఆయా సంస్థలు ఇష్టపడలేదు.

కొరతను ఎదుర్కోవడానికి పరిశ్రమలోకి అమెరికా సైన్యంలో పనిచేసిన అనుభవజ్ఞులను తీసుకురావడానికి ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించామని, జీతాలు కూడా పెంచామని ఏఏఆర్ కార్పొరేషన్ తెలిపింది.

ఇలా 2019 నుంచి 60 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నామని ఆ సంస్థ పేర్కొంది.

సింగపూర్‌లో ఎస్టీ ఇంజనీరింగ్ ఒక మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది, యుఎస్‌లో శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది.

లుఫ్తాన్స టెక్నిక్ కంపెనీ పరిశ్రమలోకి ఎక్కువ మంది మహిళలను ఆకర్షించడానికి కృషి చేస్తోంది.

"అప్రెంటిస్‌ల రిక్రూట్‌మెంట్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది" అని ఆ కంపెనీ మహిళా ప్రతినిధి ఒకరు అన్నారు.

కొరతకు మరో కారణమేంటంటే..

శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యమని ఏవియేషన్ పరిశ్రమలో పనిచేస్తున్న, వింగ్ ఇంజనీరింగ్‌లో శిక్షణ డైరెక్టర్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ అయిన డేనియల్ ఒలుఫిసన్ చెప్పారు.

ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్లలో మాజీ సైనికులు తక్కువున్నారని, అందుకే మెయింటెనెన్స్ విభాగాల్లో అనుభవం ఉన్న వాళ్లు దొరకడం లేదని డేనియల్ ఒలుఫిసన్ అభిప్రాయపడ్డారు.

60 ఏళ్లు దాటిన ఇంజనీర్లు అధిక సంఖ్యలో వృత్తి నుంచి తప్పుకోవడం కూడా కొరతకు మరో కీలక కారణం.

ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఒకప్పుడున్నంత ఆకర్షణీయంగా లేదని ఆర్‌డబ్ల్యూ మాన్ అండ్ కంపెనీలో ఇండస్ట్రీ అనలిస్ట్, కన్సల్టెంట్ రాబర్ట్ మాన్ అంటున్నారు.

"ఎయిర్‌లైన్‌లో పని చేసే సిబ్బందికి ప్రయాణంలో ఉండే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ లేవు" అని ఆయన చెప్పారు.

''విమానం ప్రపంచాన్ని కలుపుతుంది''

నదీం బండాలి గాత్విక్ ఎయిర్ పోర్టులో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఇది పూర్తిగా మెకానికల్ అని, ఎయిర్ క్రాప్ట్ ను ఫిక్స్ చేయడం, సిస్టం సమస్యలు పరిష్కరించడమని ఆయన అన్నారు.

ఇటీలవ ఏ320 ఎయిర్ క్రాఫ్ట్‌లో సమస్యలు తలెత్తితే కొన్ని గంటల్లోనే దాన్ని బాగుచేసినట్లు నదీం తెలిపారు.

ఇంజినీర్ల కొరత ఉందని తెలుసని, అయితే భద్రత అనేది సమస్యగా భావించడం లేదని ఆయన చెప్పారు.

ఎటువంటి ప్రమాదం లేకుండా విమానం గాలిలో ప్రయాణించేలా చేయడం పూజా ఉమాశంకర్ కు విలువైన ప్రయత్నం.

''విమానం మొత్తం ప్రపంచాన్ని కలుపుతుంది'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)