You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మినరల్ వాటర్ తాగితే మలబద్ధకం తగ్గుతుందా?
- రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
- హోదా, హెల్త్ రిపోర్టర్
ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారంపై దృష్టి సారించడం కంటే రోజూ కొన్ని కివీ పండ్లను తినడం మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎక్కువ సాయపడుతుందని కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
కుళాయి నీటిని తాగడం కంటే మినరల్స్ ఎక్కువగా ఉండే నీటిని తాగడం మలబద్ధకం సమస్య నుంచి బయటపడడానికి మంచిదని ఆ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ సప్లిమెంట్లు కూడా మలబద్ధక లక్షణాలను తగ్గిస్తాయని తెలిపాయి.
లండన్‌లోని కింగ్స్ కాలేజీలోని పరిశోధకులు అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరీక్షించిన తరువాత ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. మలబద్ధకం నుంచి ఉపశమనానికి ‘‘మీ ఆహారంలో మరింత ఫైబర్ ఉండేలా చూసుకోండి’’ అనే మూస సలహా మానుకోవడానికి ఇప్పుడు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు. మొండిఘటం లాంటి మలబద్దకం వల్ల ప్రతి 10మందిలో ఒకరు ప్రభావితమవుతుంటారు.
తొక్క తీసి తినడం బెటరా?
వారంలో కనీసం మూడు సార్లు మల విసర్జనకు వెళ్లకపోయినా లేదా సాధారణం కంటే తరచూ తక్కువగా వెళ్తున్నా మలబద్ధక సమస్య ఉన్నట్టని ఎన్‌హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) తెలిపింది.
మల విసర్జన సమయంలో ఇబ్బంది పడటం లేదా మల విసర్జన పూర్తిగా జరిగినట్లు అనిపించకపోవడం కూడా మలబద్ధక సంకేతాలే. అయితే, ఇవొక్కటే కాదు.
''మలబద్ధకానికి చెందిన 30 రకాల లక్షణాలను ప్రజలు ఇప్పటి వరకు రిపోర్టు చేశారు'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కింగ్స్ కాలేజీ లండన్ (కేసీఎల్)కు చెందిన న్యూట్రిషినల్ సైన్సెస్ రీడర్ డాక్టర్ ఇరిని డిమిడి తెలిపారు.
సూపర్‌మార్కెట్లో తాజాగా వచ్చిన ప్రొబయోటిక్‌పై దృష్టిపెట్టడం, లేదంటే వివిధ రకాల ఫైబర్లను మీరు తినే ఆహారంలో నింపేయడం కంటే ముందుగా పండ్లు, పానీయాలపై దృష్టిసారించడం ఉత్తమమైన నివారణా మార్గమని ఈ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
మలబద్ధకం నుంచి మెరుగవ్వాలంటే రోజులో రెండు లేదా మూడు కివీలను తినాలని లేదంటే 8 నుంచి 10 ప్రూనేలను (ఎండు ఫలాలను ) తీసుకోవాలని డాక్టర్ డిమిడి చెప్పారు.
కివీ తొక్క తీసి తినాలా, తొక్కతో తినాలా?
''తొక్క లేకపోయినా ఇది మంచిది. ఫైబర్ ఉంటుంది'' అని ఆమె వివరించారు. తొక్క అలాగే ఉంచడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలిపారు.
కివీ పండులో ఉన్న ఫైబర్ గట్‌పై ప్రభావం చూపి మల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది పేగులో కదలికలను ప్రేరేపిస్తుంది.
మల విసర్జన సాఫీగా జరిగేలా గట్‌లో అవసరమైన నీటి శాతాన్ని కివీ పండు పెంచుతుందని డాక్టర్ డిమిడి తెలిపారు.
రోజుకి 8 నుంచి 10 ప్రూనేలను తిన్నా, లేదా కొంత రై బ్రెడ్ తీసుకున్నా ఇదే ప్రభావం కనిపిస్తుందన్నారు.
తాగేందుకు కుళాయి నీటి కంటే మినరల్ వాటర్ మంచిదని ఆమె తెలిపారు.
అయితే, తూర్పు యూరప్ వంటి ప్రాంతాల్లో దొరికే నీళ్లలో కంటే యూకేలో బాటిల్ నీటిలో చాలా తక్కువ ఖనిజాలు ఉంటున్నాయన్నారు.
అత్యంత కీలకమైన ఖనిజం మెగ్నీషియం. దీనికి మలబద్ధకాన్ని పోగొట్టే గుణం ఉంది.
అందుకే, మెగ్నీషియం ఆక్సైడ్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇవి కడుపు కింద భాగంలో నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని, అలసటను తగ్గించి, మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి.
'తాజా మార్గదర్శకాలు'
ఇప్పటి వరకు మలబద్ధకం ఉన్న రోగులకు చికిత్స చేసే వైద్యుల గైడెన్స్ చాలా పరిమితమైనదిగా, కాలం చెల్లినదిగా ఉంది. ఎక్కువగా ఫైబర్ తినడం, ఎక్కువగా మంచినీళ్లు తాగడం వంటి సూచనలపై వారు దృష్టిపెట్టారని పరిశోధకులు చెప్పారు.
75 క్లినికల్ ట్రయల్స్ నుంచి సేకరించిన ఆధారాలకు అనుగుణంగా సరికొత్త ప్రతిపాదనలు ఉన్నాయి. అవ్వన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణుల ప్యానల్ వీటిని పరిశీలించింది.
ఈ కొత్త మార్గదర్శకాలు, ఆహారం ద్వారా మలబద్ధకాన్ని నియంత్రించే విషయంలో ఆరోగ్య నిపుణులకు, వారి రోగులకు సాధికారిత కల్పించే దిశగా ఒక ఆశాజనకమైన ముందడుగు అని కింగ్స్ కాలేజ్ లండన్‌లో డైటెటిక్స్ ప్రొఫెసర్, ఈ పరిశోధనకు సీనియర్ రచయిత ప్రొఫెసర్ కెవిన్ వీలాన్ తెలిపారు.
మలబద్ధకంతో బాధపడుతున్న రోగుల లక్షణాలను మెరుగుపరిచేలా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవనం కోసం తాజా సలహాలను పొందగలరని ఆయన చెప్పారు.
డైటిషియన్లకు, వైద్యులకు, నర్సులకు ఇవి అద్భుతమైన ఆధారాలు అని సరికొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రాజెక్టుకు నిధులు అందించిన బ్రిటీష్ డైటెటిక్ అసోసియేషన్ తెలిపింది.
ఈ సరికొత్త మార్గదర్శకాలు, పరిశోధన హ్యుమన్ న్యూట్రిషియన్ అండ్ డైటెటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)