యెవ్‌గెనీ ప్రిగోజిన్: పుతిన్‌కు ‘వంటమనిషి’గా పనిచేసిన ఈ వాగ్నర్ గ్రూప్ చీఫ్ ఎవరు? ఇప్పుడు పుతిన్‌పైనే తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు

యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఇన్నాళ్లూ పనిచేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు ఎదురుతిరిగి రష్యాలోని రోస్తోవ్ నగర మిలటరీ స్థావరాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం, మాస్కోనూ ముట్టడిస్తామని బెదిరించడంతో రష్యాలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది.

దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇప్పటికే స్పందించారు. కొందరు రష్యన్లు నేరపూరిత సాహసానికి ఒడిగట్టారని, అది రాజగ్రోహమని ఆయన వాగ్నర్ గ్రూప్ పేరును ప్రస్తావించకుండానే హెచ్చరించారు.

ప్రైవేట్ సైన్యమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ సైనిక తిరుగుబాటుకు యత్నిస్తున్నారని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇంతకీ ఈ వాగ్నర్ గ్రూప్ ఏమిటి? దీని చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ ఎవరు?

వాగ్నర్ గ్రూప్ ఎప్పుడు మొదలైంది?

యుక్రెయిన్‌తో యుద్దంతలో రష్యా తరఫున వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషించింది. రష్యా అసలు సైన్యం, అందులోని కీలక అధికారులపైనా వాగ్నర్ గ్రూప్ చీఫ్ తీవ్రమైన విమర్శలు చేస్తుండేవారు. పుతిన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం వల్లే ఎవరూ ఏమీ అనలేరనే ప్రచారం ఉంది.

2014లో ఈ గ్రూపును మొదలుపెట్టారు. 2015-16 మధ్య ఈ గ్రూపు చురుగ్గా కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టింది. మొదట్లో తూర్పు యుక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు సాయం అందించేందుకు ఈ గ్రూపు సైనికులను పంపించేవారు.

కొంత కాలానికి ఈ గ్రూపు కార్యకలాపాలు తూర్పు యూరప్ పరిధి దాటి విస్తరించాయి. సూడాన్, సిరియా, లిబియాతోపాటు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రూపు చురుగ్గా ఉండేది.

తమ సైన్యంలో చేరేవారికి వాగ్నర్ గ్రూపు భారీగా వేతనాలు ఇస్తోంది. మరోవైపు నేరుగా యుద్ధ క్షేత్రాల్లో పోరాడాలని ఆసక్తి ఉండేవారిని ఎక్కువగా వీరు నియమించుకుంటారు.

‘‘సరిహద్దులకు అవతల రష్యా కోసం పోరాడేందుకు ఎక్కువగా సైనికులను ఈ గ్రూపు నియమించుకుంటుంది’’అని ఈ గ్రూపు కోసం పనిచేసిన ఒక మాజీ ఫైటర్ బీబీసీతో చెప్పారు.

యుక్రెయిన్ యుద్ధానికి ముందుగా, రష్యాలో ఉద్యోగాలు దొరకని చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల యువత ఎక్కువగా వాగ్నర్ గ్రూపులో చేరేవారు.

ఈ గ్రూపు కోసం పనిచేస్తే నెలకు 1500 డాలర్లు (రూ.1.22 లక్షలు) ఇస్తారు. అదే నేరుగా యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లే ఈ మొత్తం 2,000 డాలర్లు (రూ.1.6 లక్షలకు) పెరుగుతుంది.

సిరియా అధ్యక్షుడు అసద్‌ సేనలతో కలిసి వాగ్నర్ గ్రూపు సైనికులు పోరాడారు. మరోవైపు లిబియాలో ఐక్యరాజ్యసమితి మద్దతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనరల్ హఫ్తార్‌తో కలిసి కూడా వాగ్నర్ సైనికులు పోరాటం చేశారు.

2014 నుంచి 2021 మధ్య మొత్తంగా 15,000 మంది వాగ్నర్ గ్రూపులో చేరినట్లు కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

అయితే, రష్యాలో ఈ గ్రూపు కార్యకలాపాలపై పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత, దీనిపై చర్చ ఎక్కువైంది.

యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఎవరు?

యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ను మొదట్లో 'పుతిన్ వంటమనిషి' అనేవారు అందరూ. క్రెమ్లిన్‌లో అధికారిక కార్యక్రమాలకు ఆహారం, పానీయాలు ఆయన సరఫరా చేసేవారు.

రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి ప్రిగోజిన్ ప్రస్థానం మొదలైంది. అక్కడ ఆయన రెస్టారెంట్ల వ్యాపారం చేసేవారు.

పుతిన్‌ది కూడా సెయింట్ పీటర్స్‌బర్గే.

18 ఏళ్లకే జైలుకు వెళ్లారు

18 ఏళ్ల వయసులో 1979లో తొలిసారి ఓ కేసులో దోషిగా తేలారు ప్రిగోజిన్. దొంగతనం కేసులో జైలుకు వెళ్లారు.

అక్కడికి రెండేళ్ల తరువాత దోపిడీ కేసులో ఆయనకు 13 ఏళ్ల శిక్ష పడింది.

తొమ్మిదేళ్లు జైలులోనే ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో హాట్ డాగ్స్ అమ్మే స్టాళ్లు ఆయన నెలకొల్పారు.

వ్యాపారం బాగా సాగడంతో కొద్ది కాలానికే ఆ నగరంలో ఖరీదైన రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు.

ఆ రెస్టారెంట్లు కేంద్రంగా ప్రిగోజిన్‌కు రష్యా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

ప్రిగోజిన్ రెస్టారెంట్‌కు పుతిన్ నిత్య అతిథి

1990లలో పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్‌ కార్యాలయంలో పనిచేశారు.

అదే సమయంలో ప్రిగోజిన్‌కు అక్కడ నెవా నదిపై ‘న్యూ ఐలాండ్’ అనే రెస్టారెంట్ ఉండేది. పుతిన్ అక్కడికి తరచూ వస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

పుతిన్ అధ్యక్షుడైన తరువాత కూడా ఆ రెస్టారెంట్‌కు తన విదేశీ అతిథులను తీసుకొచ్చేవారు.

‘పుతిన్‌కు, ఆయన అతిథులకు నేనే స్వయంగా వడ్డించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని ప్రిగోజిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కాలక్రమంలో ప్రిగోజిన్‌ను పుతిన్ బాగా నమ్మేవారు. 2003లో పుతిన్ తన పుట్టిన రోజును కూడా ఆయన రెస్టారెంట్లోనే చేసుకున్నారు.

2010 నాటికి అనేక మీడియా ఇన్వెస్టిగేషన్ కథనాలలో ఆయన పేరు వినిపించేది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 'ట్రోల్ ఫ్యాక్టరీ'గా పిలిచే వ్యవస్థతో ఆయనకు ఉన్న సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చేవి.

క్రెమ్లిన్ పాలన వ్యవస్థను సానుకూలంగా చూపించడం, రష్యా ప్రతిపక్షాల విశ్వసనీయత దెబ్బతీసే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉంచడం ఈ వ్యవస్థ లక్ష్యం.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ ట్రోల్ ఫ్యాక్టరీ పాత్ర కూడా ఉందని అమెరికా న్యాయవాది రాబర్ట్ మ్యూలర్ దర్యాప్తులో వెల్లడైంది.

ప్రిగోజిన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చారు. తనకు, ట్రోల్ ఫ్యాక్టరీకి ఎలాంటి సంబంధం లేదందటారాయన.

వాగ్నర్ గ్రూపుతో తనకున్న సంబంధాలనూ ఆయన ఖండిస్తూ వచ్చారు. 2014లో తూర్పు యుక్రెయిన్ కేంద్రంగా మొదలైన ఈ కిరాయి గ్రూప్ వాగ్నర్‌కు చెందిన ఫైటర్లు ఆ తరువాత సిరియా, వివిధ ఆప్రికా దేశాలలో కనిపించారు.

2022లో ఆయన వాగ్నర్ గ్రూపుతో తనకున్న సంబంధాలను అంగీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)