You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?
- రచయిత, ఎంఆర్ శోభన
- హోదా, బీబీసీ తమిళ్
సాధారణంగా జంతువుల గురించి మాట్లాడుకునేటప్పుడు అడవులు, పర్వతాలు మనకు గుర్తుకు వస్తాయి. అయితే, మన చుట్టూ ఉండే జంతువులు, కీటకాల ప్రాధాన్యాన్ని మనం గుర్తించం.
మన చుట్టూ ఉండే జీవుల నుంచి మనం చాలా ప్రయోజనాలను పొందుతుంటాం. కానీ, వాటిపై మనం పెద్దగా దృష్టిపెట్టం.
అలాంటి జీవుల్లో బల్లి ఒకటి. బల్లి పేరు చెప్పగానే చాలా మంది ఉలిక్కిపడతారు. మరికొందరు భయపడుతుంటారు. ఇంకొందరు అయితే ‘అపశకునం’గా భావిస్తారు.
నిజానికి బల్లులు జీవావరణ సమతుల్యతలో తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి.
ఒకవేళ మన ఇంట్లో అసలు బల్లులే లేకపోతే ఏం జరుగుతుంది? మన ఇంటికి బల్లులకు సంబంధం ఏమిటి?
ఈ అంశంపై పర్యావరణవేత్త షణ్ముగనాథన్ ‘బీబీసీ తమిళ్’తో గతంలో మాట్లాడారు. ఆ వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం..
బల్లుల వల్ల ప్రయోజనాలు ఏమిటి?
కీటకాలను నియంత్రించడంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో కీటకాల జనాభా చాలా ఎక్కువ.
కీటకాలు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం అసలు ఊహించుకోలేం. అలాగే కీటకాలు మరీ ఎక్కువైనా పరిస్థితులు భయానకంగా మారిపోతాయి.
ఈ సమతుల్యత కాపాడడంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
దోమలు, ఈగలు లాంటి కీటకాల జనాభా నియంత్రణలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బల్లులను కొన్ని పక్షులు తింటాయి. అలా ఆహారపు గొలుసు సాగుతుంది.
బల్లులు ఏం తింటాయి?
రాత్రిపూట ఎక్కువగా సంచరించే దోమలు, ఈగలు, పురుగులు, ఇతర కీటకాలను బల్లులు ఆహారంగా తీసుకుంటాయి.
ఇళ్లలో ఎలాంటి బల్లులు కనిపిస్తాయి?
సాధారణంగా ఇళ్లలో కనిపించే బల్లులను హౌస్, గార్డెన్/ట్రీ లిజర్డ్స్‌గా పిలుస్తారు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి.
అయితే, మొదట వీటిలోని భిన్న రకాలపై పరిశోధన జరగాల్సి ఉంది.
బల్లులు విషపూరితమైనవని అంటారు.. ఇది నిజమేనా?
నిజానికి బల్లుల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి.
ఆహారంలో బల్లి పడితే, అది విషపూరితం అవుతుందని కూడా చెబుతారు.
అయితే ఇది అపోహే.
బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు. నిజానికి బల్లుల్లో మనషులను చంపేంత విషం ఉండదు. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
అయితే, ఒక్కోసారి బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు, తలనొప్పి లాంటివి కలగొచ్చు. ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి. ఈ లక్షణాలను మందులతో మనం తగ్గించుకోవచ్చు.
ఈ విషయంలో మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముంది.
బల్లులే లేకపోతే ఏమవుతుంది?
అసలు బల్లులే లేకపోతే, కీటకాల జనాభా పెరిగిపోతుంది.
దీంతో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. దోమలు విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటి పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి వాతవరణ మార్పులు కూడా ఒక కారణం.
మరోవైపు కొన్ని కీటకాలను హతమార్చేందుకు మనం కీటక నాశనులను వాడుతున్నాం. అవి మనుషులపైనా ప్రభావం చూపగలవు.
ఈ కీటకాలను బల్లులు మెరుగ్గా నియంత్రించగలవు. అవే లేకపోతే మనకు కొత్త సమస్యలు రావొచ్చు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)