You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ‘3 పరీక్షలు’.. తెలంగాణలో నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఆరేళ్లుగా గ్రూప్-1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. మాది ఆదిలాబాద్ జిల్లా. అక్కడి నుంచి వచ్చి ఇన్నేళ్లుగా హైదరాబాద్‌లో రూములో ఉంటున్నా. కోచింగ్ తీసుకోవడానికి కాకుండా రూమ్ రెంట్, తినడానికి.. ఇతర అవసరాలకు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉంటాను. ఇది ఒకరకంగా మా కుటుంబంపై ఆర్థిక భారమే’’ అన్నారు గ్రూప్ -2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బత్తుల ప్రశాంత్.
‘‘ఇప్పుడు నా ముందున్న ఆప్షన్ గ్రూప్-2 రాయడమే. అందులో పోస్టులు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి అవకాశం రావాలంటే వాయిదా వేసి పోస్టులు సంఖ్య పెంచాలని అడుగుతున్నాం’’ అని బీబీసీతో చెప్పారు ప్రశాంత్.
అశోక్ నగర్‌లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ప్రశాంత్.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగ యువత ఆందోళనలకు దిగుతోంది.
రోజూ అశోక్ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి.. నిరుద్యోగులను అరెస్టు చేసి, ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానమైన 4 డిమాండ్లు
నిరసనలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఏదో ఒక రూపంలో.. ఎక్కడో ఒక చోట యువత ఆందోళనలు కొనసాగిస్తోంది.
వీరు ముఖ్యంగా నాలుగు డిమాండ్లు చేస్తున్నారు.
- ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలి.
- గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలు వాయిదా వేయాలి.
- డీఎస్సీని రెండు నెలలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలి.
- గ్రూప్-1 మెయిన్స్‌కు పోస్టులు, అభ్యర్థుల నిష్పత్తిని 1:50 నుంచి 1:100కు పెంచాలి.
ఎందుకీ డిమాండ్స్?
ముందుగా గ్రూప్-1 విషయానికి వద్దాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది.
503 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పట్లో ప్రకటించింది.
2022 అక్టోబరు, 2023 ఆగస్టులో రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి.
ఒకసారి ప్రశ్నపత్రం లీకేజీ, మరోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోని కారణంగా అవి రద్దయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఫిబ్రవరి 19న మరోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది.
పోస్టుల సంఖ్యను మరో 60 పెంచి 563 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా.. ఇప్పటికే ఫలితాలు విడుదలయ్యాయి.
ఇందులో నోటిఫికేషన్ ప్రకారం.. 1:50 నిష్పత్తి అంటే ఒక పోస్ట్‌కు 50 మంది లెక్కన మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు.
అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం కొందరు గ్రూప్-1 అభ్యర్థులు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యాయపరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉండటంతో ఇది సాధ్యం కాదని ప్రభుత్వం చెప్తోంది.
‘‘నిష్పత్తి మారిస్తే న్యాయపరంగా చిక్కులు ఎదురుకావొచ్చు. నోటిఫికేషన్ ప్రకారం కాకుండా కొత్త నిష్పత్తిని తీసుకుంటే ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు’’ అని టీజీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు ఒకరు బీబీసీతో చెప్పారు.
గ్రూప్-2 పై వివాదం ఏమిటి?
గ్రూప్-2 విషయానికి వస్తే.. తెలంగాణ ఏర్పడ్డాక 2016 తర్వాత 2022 డిసెంబరు 29న గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది.
783 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.
2023 ఆగస్టు, 2024 జనవరిలో పరీక్షలు జరగాల్సి ఉంది.
కానీ ఎన్నికలు, ఇతర కారణాలతో అవి వాయిదా పడ్డాయి.
ఈ పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
నోటిఫికేషన్ 2022 డిసెంబరులో ఇచ్చిన కారణంగా.. ఇప్పటి ఖాళీల ప్రకారం గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేయాలని కోరుతున్నారు.
రేవంత్ రెడ్డి హామీ ఏమైంది?
నిరుడు అక్టోబరు 1న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
దీనికి హాజరైన అప్పటి మల్కాజిగిరీ ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ‘‘గ్రూప్-2 విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు. త్వరలోనే ప్రజా ప్రభుత్వం రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తాం. యువతకు న్యాయం చేస్తాం’’ అంటూ ప్రకటించారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత నోటిఫికేషన్ ప్రకారమే 783 పోస్టులతో పరీక్షలు నిర్వహిస్తోంది.
ఈ విషయంపై టీజీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి బీబీసీతో మాట్లాడారు.
‘‘గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పరీక్షలకు సంబంధించి ఒక దశకు చేరుకున్నాక నిబంధనలు మార్చడానికి వీలుండదు. కానీ ఇప్పుడు గ్రూప్-2కు సంబంధించి దరఖాస్తుల దశ మాత్రమే ముగిసింది. పోస్టుల లభ్యత ఆధారంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచేందుకు వీలుంటుంది’’ అని చెప్పారు.
2016లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-2 నోటిఫికేషన్ దాదాపుగా 700 పోస్టులతో ఇచ్చారు. ఆ తర్వాత నిరుద్యోగులు, అఖిలపక్ష నాయకుల డిమాండ్ మేరకు మరో 300 పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను అప్పట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం నిరుద్యోగులు గ్రూప్-2 వాయిదా కోరడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని చెప్పారు ఎకనామిక్స్ కోచింగ్ ఫ్యాకల్టీ చౌటి ప్రభాకర్.
‘‘గ్రూప్-2 రాసే అభ్యర్థుల్లో 80శాతం మంది గ్రూప్-3 కూడా రాస్తుంటారు. ఈ రెండు పరీక్షలకు సిలబస్ చాలావరకు ఒకేలా ఉంటుంది. ఒక్క పేపర్ మాత్రమే తేడా ఉంటుంది. గ్రూప్-3 నవంబరు 17, 18 తేదీల్లో జరుగుతుంది. అదే సమయంలో కొన్ని రోజుల తేడాతో గ్రూప్-2 పరీక్షలు పెడితే అభ్యర్ధుల ప్రిపరేషన్ సులువు అవుతుంది. అలాగే గ్రూప్-2 రాసే అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా సెలక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు పరీక్షలకు ఒకేసారి చదవడం కూడా ఇబ్బంది అవుతుంది కనుక వాయిదా వేయాలని కోరుతున్నారు’’ అని చెప్పారు ప్రభాకర్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ధరావత్ మోతీలాల్. ఈ విషయంపై ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మేం డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 783 పోస్టులకు అదనంగా పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేందుకు వీలవుతుంది. గ్రూప్-2, 3 పరీక్షలు కొంత తేడాతో నిర్వహిస్తే, నిరుద్యోగులకు సమయం వృథా కాకుండా ఉంటుంది’’ అని చెప్పారు.
డీఎస్సీ వాయిదా కోరిక ఎందుకు?
టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
11,062 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
డీఎస్సీ రాయాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో తొలుత అర్హత సాధించాలి.
తెలంగాణలో టెట్ అర్హత పొందిన అభ్యర్థులు సుమారు 3.50లక్షల మంది ఉన్నట్లు అంచనా.
ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది.
జులై 18 నుంచి ఆగస్టు 5 మధ్య ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది.
ఈ పరీక్షను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
‘‘సహజంగా ఏదైనా పరీక్ష జరిగిన తర్వాత మరో పోటీ పరీక్ష రాసేందుకు కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలి.
టెట్ మే చివరి వారంలో జరిగితే, ఫలితాలు జూన్ 12న వచ్చాయి. వెంటనే జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించారు. టెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదు. అందుకే రెండు, మూడు నెలలు డీఎస్సీ వాయిదా వేయాలని అడుగుతున్నాం’’ అని దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన డీఎస్సీ అభ్యర్థి శివాజీ బీబీసీతో అన్నారు.
డీఎస్సీ వాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు.
ఈ వ్యవహారంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.
‘‘డీఎస్సీ పరీక్షలకు 2.79లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పుడు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దాదాపు 11వేల ఖాళీలు నింపుతున్నాం. ఇవి కాకుండా మరో 5 వేల ఖాళీలు ఉంటాయని ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ఈ ఖాళీలతో సమీప భవిష్యత్తులో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది’’ అని చెప్పారు.
మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏం చెప్పింది?
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాం. దరఖాస్తుదారులు ఎవ్వరూ ఒక రూపాయి ఫీజు కట్టవలసిన అవసరం లేదు’’ అని మేనిఫెస్టోలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ.
2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్-2 నోటిఫికేషన్, డిసెంబరు 15న రెండో ఫేజ్ నోటిఫికేషన్, జూన్ 1, డిసెంబరు 1 - రెండుసార్లు గ్రూప్-3, 4 నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది.
కానీ, ఈ తేదీల ప్రకారం ఇప్పటివరకు నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు చెప్తున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది
గ్రూప్-2 పోస్టుల పెంపు, వాయిదాపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.
మూడు రోజుల కిందట జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
‘‘గ్రూప్-1 ప్రిలిమ్స్ చిన్న తప్పు లేకుండా నిర్వహించాం. నోటిఫికేషన్‌లో ఏ షరతులు పెట్టామో దాని ప్రకారమే ఫలితాలు ఇచ్చాం. 1:50 ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే పరీక్ష పెట్టాం. కొందరు ఇప్పుడు 1:100 పిలవాలని అంటున్నారు. దానికి మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, నోటిఫికేషన్ ప్రకారం వెళ్లలేదని కోర్టులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరీక్షలు వాయిదా వేస్తే, ప్రభుత్వానికి పోయేదేమీ లేదు’’ అని చెప్పారు రేవంత్ రెడ్డి.
‘‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం. ఏటా మార్చి 31లోపు ఖాళీల సమాచారం తెప్పించి జూన్ 2లోగా నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9 లోగా భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్దత తీసుకువస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)