భారతీయులు పనికోసం గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు

    • రచయిత, అమృత దుర్వే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కువైట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

ఇలాంటి ప్రమాదాల తర్వాతే గల్ఫ్ దేశాల్లో కార్మికుల స్థితిగతులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇంతకీ భారతీయులు పని కోసం గల్ఫ్ దేశాలకే ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఈ వలసల చరిత్ర ఏంటి?

జీసీసీ అంటే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్, బహ్రెయిన్, ఖతర్, కువైట్ అనే ఆరు దేశాలు ఉన్నాయి. ఈ గ్రూపు 1981లో ఏర్పాటుచేశారు.

ఈ ఆరు దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2022లో ఈ దేశాలలో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

ఇందులో సౌదీ అరేబియాలో 24,65,464 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 35,54,274 మంది, కువైట్‌లో 9,24,687 మంది, ఖతర్‌లో 8,44,499 మంది, ఒమన్‌లో 6,53,500 మంది, బహ్రెయిన్‌లో 3,08,662 మంది భారత పౌరులు ఉన్నారు.

దక్షిణాసియా నుంచి కూడా ఈ దేశాలకు పని కోసం పెద్ద సంఖ్యలో వలస వెళ్తుంటారు.

ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, ఈ ఆరు దేశాలలో 2020లో 1.70 కోట్ల మందికి పైగా దక్షిణాసియా పౌరులున్నారు. వారిలో ఎక్కువ మంది భారతీయులే. ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పౌరులున్నారు.

ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కథ..

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో కేరళ వాసులే అధికం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు వలస వెళ్తున్న భారతీయుల్లో కేరళ, గోవా ప్రజలు అత్యధికులు.

వలస కార్మికుల కోసం యూఏఈ జాబ్ పోర్టల్ అయిన హంటర్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, కేరళలో 'బ్లూ కాలర్ జాబ్స్' కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తున్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాలంటే మాన్యువల్ లేబర్ ఉద్యోగాలు, ఫ్యాక్టరీ ఉద్యోగాలు లేదా శారీరక శ్రమ ఎక్కువగా అవసరమయ్యే ఏవైనా ఉద్యోగాలు.

అయితే గత కొన్నేళ్లుగా కేరళ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య తగ్గగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి పెరిగింది.

జీసీసీ దేశాలలో నిర్మాణ రంగంలోని కార్మికులలో ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, తమిళనాడులకు చెందిన అత్యధికులు ఉన్నారని సర్వే తెలిపింది.

ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం మిడిల్ ఈస్ట్ - నార్త్ ఆఫ్రికా(మెనా) ప్రాంత దేశాలకు వలసలలో కేరళ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని హంటర్ చేసిన మరో సర్వే పేర్కొంది.

కఫాలా పద్ధతిలో రిక్రూట్‌మెంట్

నిర్మాణం, ఆరోగ్యం, తయారీ, రవాణా, ఆతిథ్యం, సేవా రంగాలలో ఉద్యోగాల కోసం ఎక్కువగా జీసీసీ దేశాలకు వలసపోతున్నారు.

వీటిలో చాలావరకు బ్లూ కాలర్ - మాన్యువల్ లేబర్ ఉద్యోగాలే. ఈ దేశాలలో పని చేయడానికి వెళ్లాలంటే ప్రతి ఉద్యోగానికి నిర్దిష్ట విద్యార్హత లేదా కోర్సు ఉండాల్సిన అవసరం లేదు.

జీసీసీ దేశాలలో పౌరసత్వం పొందడానికి దీర్ఘకాలిక నివాసం ఉండాలనేది ఒక షరతు. ఈ కాలం 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. పని కోసం అక్కడికి వెళ్లే వ్యక్తులు నిర్దిష్ట వర్క్ వీసాలపై వెళతారు.

తరచుగా ఈ వలస కూలీలు ఆ దేశాలలోని కఫాలా విధానం ప్రకారం రిక్రూట్ అవుతారు. ఇందులో వలస కార్మికుల వీసా, ప్రయాణం, వసతి, ఆహార ఖర్చులు యజమాని (కఫీల్) భరిస్తారు. ఈ వ్యక్తి వలసదారునికి స్పాన్సర్. ఈ ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది.

అయితే ఈ కఫాలా విధానంతో వలస కూలీలు దోపిడీకి గురవుతున్నారని చాలా ఏళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధానంలో ఒప్పంద కార్మికుల పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలు యజమాని దగ్గరే పెట్టుకుంటున్నారు. దీంతో ఈ కార్మికులు భారతదేశానికి తిరిగి రాలేరు లేదా ఇష్టానుసారంగా ఉద్యోగాలు మారే అవకాశం ఉండదు. అనంతరం ఈ కార్మికులను తక్కువ వేతనాలకే పనికి తీసుకుంటున్నారు.

కఫాలా రద్దుకు ఖతార్ ముందుకొచ్చినా..

బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలలో ఈ కఫాలా విధానం అమలులో ఉంది. ఇది కాకుండా, జోర్డాన్, లెబనాన్లలో కూడా ఈ పద్ధతిని పాటిస్తారు.

2020 ప్రారంభంలో కఫాలా వ్యవస్థకు స్వస్తి పలుకుతామని ఖతార్ పేర్కొంది, విదేశీ కార్మికులు తమ ఇష్టానుసారం ఉద్యోగాలు మార్చుకోవడానికి లేదా దేశం విడిచి వెళ్లడానికి ఇది వీలు కల్పిస్తుందని అందరూ ఆశించారు.

కానీ ఖతార్‌లో జరిగిన 2022 ఫీఫా ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియం నిర్మాణ కార్మికుల చికిత్స, వారి పరిస్థితుల గురించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి.

కార్మికులపై ఇటువంటి దోపిడీని నిరోధించడానికి, భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. దీనితో పాటు, ఒక దేశంలో కార్మికులు మోసానికి గురైనట్లయితే, వారు అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు.

విదేశీ ఉద్యోగమనే కల

విదేశీ ఉద్యోగం వస్తే మంచి జీవితం గడపవచ్చన్న కలతో చాలామంది వలసలు వెళ్తున్నారు. వారిలో కొందరు విజయం సాధిస్తారు. పరిచయస్తుల ద్వారా ఈ ఉద్యోగాల గురించి సమాచారాన్ని పొంది, అక్కడికి వెళతారు.

ఈ జీసీసీ దేశాలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉండటం కూడా వలసలకు ప్రధాన కారణం. 2022 ఫీఫా ప్రపంచ కప్ ఖతార్‌లో జరిగింది. ఈ ప్రపంచకప్ కోసం 7 స్టేడియాలు, ఒక కొత్త విమానాశ్రయం, మెట్రో సర్వీస్, రోడ్లు, దాదాపు 100 హోటళ్లు నిర్మించారు. ఫైనల్ మ్యాచ్ జరిగే స్టేడియం చుట్టూ ఒక నగరమే నిర్మించారు.

ప్రపంచ కప్ కోసం దాదాపు 5 నుంచి 10 లక్షల మంది కార్మికులను ఇతర దేశాల నుంచి వలస తీసుకొచ్చినట్లు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది.

జీసీసీ దేశాలలో ప్రస్తుతం కార్మికుల కోసం నియమాలు, నిబంధనలున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ కార్మికుల పరిస్థితులు, కనీస వేతనాల కోసం విధానాలను నిర్దేశిస్తుంది. అందుకే ఈ దేశాల్లో ఉద్యోగం కోసం జనాలు క్యూ కడుతున్నారు.

కార్మికుల వలసలతో భారతదేశానికి ఏం లాభం?

భారత్, జీసీసీ దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. ఈ దేశాలు భారత వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములు. అంతేకాకుండా ఈ దేశాలలోని చమురు, గ్యాస్ సహజ నిల్వలు ఇండియాకు ముఖ్యమైనవి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 మే నుంచి 2023 డిసెంబర్ మధ్యలో 10 సార్లు గల్ఫ్ దేశాలను సందర్శించారు.

విదేశాల నుంచి భారతదేశానికి పంపించే డబ్బు (ఇన్వార్డ్ రెమిటెన్స్‌) విషయంలో కూడా ఈ దేశాలు ముఖ్యమైనవి. 2021లో జీసీసీ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు 87 బిలియన్ డాలర్లను భారతదేశానికి పంపారు. 2022లో ఈ మొత్తం 115 బిలియన్ డాలర్లకు పెరిగింది.

17వ లోక్‌సభలో విదేశీ వ్యవహారాల శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, 2023లో డిసెంబర్ వరకు 120 బిలియన్ అమెరికన్ డాలర్ల ఇన్‌వర్డ్ రెమిటెన్స్‌లు భారత్‌కు వచ్చాయి. ఈ జీసీసీ దేశాల నుంచి చాలా రెమిటెన్స్‌లు భారతదేశానికి పంపుతారు. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కార్మికుల నుంచి చెల్లింపులు ఉన్నాయి.

ఈ ఆరు దేశాలలో భారతదేశం యూఏఈ నుంచి అత్యధికంగా డబ్బు అందుకుంటోంది. ఆ తర్వాత సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశానికి డబ్బు పంపుతారు.

గల్ఫ్ దేశాలలో వలసల చరిత్ర

బ్రిటీష్ పాలన నుంచే పని కోసం గల్ఫ్ దేశాలకు భారతీయులు వలస బాట పట్టారు.

'ఇండియా మూవింగ్: ఏ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్' అనే పుస్తకంలో వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన వలసలను చిన్మయ్ తుంబే విశ్లేషించారు. చిన్మయ్, ప్రపంచ వలసల విశ్లేషణలో నిపుణులు.

1970ల నుంచి జీసీసీ దేశాలకు ప్రారంభమైన వలసలు ప్రపంచ వలస చరిత్రలో ముఖ్యమైన భాగమని చిన్మయ్ అభిప్రాయపడ్డారు.

తొలినాళ్లలో గల్ఫ్ దేశాలకు పనికి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు.

1930ల నాటికి బ్రిటిష్ పాలిత ఆడెన్ నగరంలో (ఇప్పుడు యెమెన్‌లో ఉంది) దాదాపు 10,000 మంది భారతీయులు పనిలో ఉన్నారని చిన్మయ్ తుంబే తెలిపారు.

భారతదేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన ధీరూభాయ్ అంబానీ కూడా 1948 నుంచి ఒక దశాబ్దం పాటు అదే అడెన్ పోర్ట్‌లో పనిచేశారు. చమురును కనుగొన్న తర్వాత గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరిగింది.

'ఇండియా మూవింగ్: ఎ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్' పుస్తకం ప్రకారం.. ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ (APOC) ఈ కాలంలో పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులను నియమించుకుంది.

1990 ఆగస్టులో కువైట్‌పై ఇరాక్ దాడి చేసింది. గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత 1990 అక్టోబర్ నాటికి కువైట్ నుంచి 1,75,000 మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)