You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అగలెగ: ఈ దీవి భారతదేశపు కొత్త గూఢచార కేంద్రమా?
- రచయిత, జాకబ్ ఇవాన్స్,
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందూ మహాసముద్రంలోని అగలెగ అనే చిన్న ద్వీపం వదిలి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందని స్థానికుడైన అర్నౌడ్ పౌలే ఎప్పుడూ అనుకోలేదు.
అయితే, ఈ ఏడాది ఆయన తన సామాన్లన్నీ సర్దుకుని ముక్కలైన హృదయంతో దీవిని వీడి వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం, ఈ ద్వీపంలో సైనికీకరణ పెరగడమే.
ఇటీవలి వరకు, అగలెగ జనాభా కేవలం 350 మంది మాత్రమే. చేపలు పట్టడం, కొబ్బరి తోటలు పెంచడం వీరి ప్రధాన వృత్తి. దీవిలోని వారికి అవసరమైన ఆహారం ఇక్కడకు ఉత్తరంగా 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్ రాజధాని పోర్ట్ లూయీస్ నుంచి వస్తుంది. ఇలా ఏడాదిలో నాలుగుసార్లు నౌకల ద్వారా ఆహార పదార్ధాలు వస్తాయి.
ఇక్కడున్న చిన్న రన్‌వేను వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో అరుదుగా ఉపయోగిస్తారు.
అయితే 2015లో భారత ప్రభుత్వం మారిషస్ ఏలుబడిలో ఉన్న అగలెగ గురించి ఆ దేశ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఇక్కడ 3వేల మీటర్ల పొడవైన రన్‌వే, నౌకల్ని నిలిపేందుకు పెద్ద జెట్టీని నిర్మిస్తారు. సముద్ర భద్రతపై రెండు దేశాల మధ్య సహకారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, కొంతమంది అగలెగ ద్వీపవాసులు దీని వల్ల ఈ ప్రాంతం పూర్తి స్థాయి సైనిక కేంద్రంగా మారవచ్చని ఆందోళన చెందుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 44 ఏళ్ల పౌలే ఉద్యమం ప్రారంభించారు. ఆయన అక్కడ చిన్న చిన్న రిపేర్లు లాంటి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఆయన రెగ్గే సంగీత కళాకారుడుగా కూడా.
“నా దీవిని ప్రేమిస్తాను. అది కూడా నన్ను ప్రేమిస్తుంది. అయితే ఈ ఎయిర్ బేస్ ప్రారంభమైతే ఈ ప్రాంతాన్ని వదిలెయ్యాలని నాకు తెలుసు.” అని ఆయన చెప్పారు.
నైరుతి హిందూ మహా సముద్రంలో రెండు దీవుల్ని కలుపుకుని అగలెగ 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హిందూ మహా సముద్రంలో నౌకల రాకపోకల్ని పర్యవేక్షించేందుకు భారత్‌కు ఇది అనువైన ప్రాంతం. 2019లో తీసిన శాటిలైట్ చిత్రాలు 2024 జులైలో తీసిన శాటిలైట్ చిత్రాలతో పోలిస్తే ఈ ప్రాంతం ఎంతగా మారిపోయిందో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.
ద్వీపంలో రెండు ప్రధాన గ్రామాలు, ద్వీపానికి ఉత్తరాన ఉన్న లా ఫౌర్చే దక్షిణాన ఉన్న వింట్ సింక్ మధ్యన విస్తరించిన కొబ్బరి చెట్లను కొట్టేసి పొడవాటి రన్‌వే నిర్మించారు.
కాంక్రీటుతో నిర్మించిన పెద్ద గ్రౌండ్ లాంటి ప్రాంతంలో 60 మీటర్ల వెడల్పు ఉన్న రెండు పెద్ద భవనాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇండియన్ నేవీకి చెందిన పీ 81 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నిలిపి ఉంచేందుకు అయ్యుండొచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ శామ్యూల్ బష్‌ఫీల్డ్ భావిస్తున్నారు.
బోయింగ్ 737 విమానాన్ని పీ 81గా మార్చారు. ఇది జలంతర్గాముల్ని వేటాడి వాటిపై దాడి చేస్తుంది. సముద్ర జలాల్లో సమాచార వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. ఈ విమానం ఎయిర్ స్ట్రిప్ మీద ఉన్నప్పుడు స్థానికులు ఫోటోలు తీశారు.
ద్వీపానికి వాయువ్యం వైపున సముద్రం లోపలకు ఉన్న కొత్త జెట్టీ, భారతీయ నిఘా నౌకలు అగలెగకు సామాన్లు తీసుకొచ్చే నౌకలు ఉపయోగించుకునేందుకు నిర్మించి ఉండవచ్చని బష్‌ఫీల్డ్ చెప్పారు.
“కొత్త శాటిలైట్ చిత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హిందూ మహా సముద్రం సమాచార వ్యవస్థలో అగలెగ పాత్ర ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు” అని బష్‌ఫీల్డ్ తెలిపారు.
ఈ నూతన నిర్మాణాన్ని ‘నిఘా కేంద్రం’ అని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. మారిషస్‌లో ఇతరచోట్ల నిర్మించినట్లే ఇక్కడ కూడా కోస్టల్ రాడార్ నిఘా వ్యవస్థ ఉండవచ్చని తెలిపింది.
అగలెగ గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలపై స్పందించేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. దీని గురించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ అడ్వర్టయిజ్‌మెంట్లు ఉన్నాయని బీబీసీకి తెలిపింది.
ఇందులోని ఒక ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “సముద్ర భద్రతకు సంబంధించి హిందూ మహా సముద్రంలో సంప్రదాయ, సంప్రదాయేతర సవాళ్లను ఎదుర్కోవడంలో భారత, మారిషస్ సహజ భాగస్వాములు.” అని తెలిపారు.
1970ల నుంచే భారత్, మారిషస్‌ల మధ్య రక్షణకు సంబంధించి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మారిషస్ జాతీయ భద్రత సలహాదారు, సముద్ర తీర రక్షక దళం చీఫ్, పోలీస్ హెలికాప్టర్ దళం అధిపతి అందరూ భారతీయులే. వాళ్లు భారతీయ విదేశీ నిఘా సంస్థ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అధికారులు.
అగలెగలో జరుపుతున్న నిర్మాణాల్ని “సామర్థ్యాన్ని పెంచుకునే కోణంలో చూడాలే తప్ప సైనికపరంగా ఉపయోగించుకోకూడదని” రెండు దేశాలు కోరుకుంటున్నాయని లండన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఎట్ కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ హర్ష్ పంత్ చెప్పారు.
హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరగడంపై భారత్‌తో పాటు పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయన్నది రహస్యమేమీ కాదు.
అగలెగలో నిర్మాణాలపై స్థానికుల అభ్యంతరం
ఒక పెద్ద దేశం, చిన్నదైన తన భాగస్వామ్య దేశంలో మిలటరీ ఔట్‌పోస్ట్ నిర్మించడం అసాధారణం ఏమీ కాకున్నప్పటికీ అగలెగలో నిర్మాణాలు స్థానికుల్ని ఇబ్బంది పెడుతున్నాయి.
దీవి చుట్టూ ఉన్న తీరంలోని తెల్లటి ఇసుక తిన్నెలు, వాటి చుట్టూ పెద్దపెద్ద కొబ్బరి చెట్లను మొత్తంగా చుట్టుముట్టేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ద్వీపంలోని లా ఫౌర్చే గ్రామాన్ని భారత ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాలు మింగేస్తాయోమోనని, అక్కడ నివసిస్తున్న పది కుటుంబాలను బలవంతంగా బయటకు పంపిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి.
“ఇది పూర్తిగా నిషేధిత ప్రాంతంగా మారుతుంది, భారతీయులది అవుతుంది.” అని అగలెగ అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు లావల్ సూప్రమనియెన్ చెప్పారు.
అగలెగ కథ కూడా ‘చాగోస్ ఐలండ్స్’ మాదిరిగా మారుతుందేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. అగలెగలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే బిల్లీ హెన్రీ కూడా ఇదే విషయమై భయపడుతున్నారు. ఆయన చాగోస్ ఐలండ్స్ నుంచి వచ్చిన మహిళ కుమారుడు.
“మా అమ్మ తన దీవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడిక మా నాన్న వంతు” అని హెన్రీ అన్నారు.
అగలెగలో నివసిస్తున్న కుటుంబాలు గతంలో చాగోస్ ఐలండ్స్ నుంచి బలవంతంగా పంపించి వెయ్యడం వల్ల వచ్చి స్థిరపడ్డాయి. చాగోస్ ఐలండ్స్, అగలెగకు తూర్పు వైపున 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
బ్రిటన్ ప్రభుత్వం 1965లో దీన్ని తమ సొంత ప్రాంతంగా ప్రకటించుకుంది. డీగో గార్షియా దీవిలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతం పూర్తి స్థాయి సైనిక కేంద్రంగా మారిపోయింది.
అగలెగ దీవి మీద పూర్తి అధికారాలున్న ప్రభుత్వం కూడా తమకు ఆంక్షలు పెట్టి, అందరు వెళ్లిపోయేలా చేస్తుందని బెల్లీ హెన్రీ భయపడుతున్నారు.
ఆయన స్థానికంగా ఉన్న సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. విద్య, వైద్యం, స్థానిక ఆర్థిక వ్యవస్థలో పరిమిత పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, స్థానికులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతులు లేకపోవడం వంటి వాటి గురించి గుర్తు చేస్తున్నారు.
తాము ఎవరినీ దీవిని వదిలి వెళ్లాలని అడగలేదని మారిషస్ ప్రభుత్వ ప్రతినిధి బీబీసీతో చెప్పారు. స్థానికులు పోర్టు, ఎయిర్‌పోర్టులోకి వెళ్లకుండా మాత్రమే అడ్డుకుంటున్నట్లు చెప్పారు. దీవిలో ఏర్పాటు చేసిన సౌకర్యాల వల్ల తమ దేశ నియంత్రణ విధానం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇష్టం వచ్చినట్లుగా చేపలు పట్టడాన్ని ఆపేందుకు సాయపడతాయని చెప్పారు.
అగలెగలో సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న ఆరోపణలను మారిషస్ తిరస్కరించింది. ఈ దీవి జాతీయ పోలీసుల స్వాధీనంలో ఉందని తెలిపింది.
భారత ప్రభుత్వం తన సొంత ఖర్చులతో కొత్తగా చేపట్టిన నిర్మాణాల ‘నిర్వహణ కార్యకలాపాల్లో’ సాయం చేస్తుందని అంగీకరించింది.
దీవిలో చేపట్టిన జల, వాయు రవాణా మార్గాలకు సంబంధించి నిర్మాణాలు స్థానికులకు మేలు చేసేందుకే రూపొందించినవని, అవి వారిని పేదరికం నుంచి బయటపడేస్తాయని భారత్, మారిషస్ ప్రభుత్వాలు చెబుతున్నాయి.
అయితే స్థానికులు మాత్రం అలాంటిదేమీ జరగదంటున్నారు. అగలెగ నుంచి మారిషస్‌కు ఏటా నాలుగు ఫెర్రీలు మాత్రమే తిరుగుతున్నాయని, ప్యాసింజర్ విమానాలు నడవడం లేదని వారు చెబుతున్నారు.
దీవిలో కొత్తగా భారత్ నిర్మించిన ఆసుపత్రిలోకి తమను రానివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్‌రే మెషీన్లు, దంతసంబంధ సామగ్రి గురించి మారిషస్ ప్రభుత్వం గొప్పగా చెప్పినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
అక్టోబర్‌లో స్థానికంగా ఉండే ఓ బాలుడిపై మరిగే నూనె పడటంతో గాయాలయ్యాయి. అతనికి నార్త్ ఐలండ్‌లోని ఆరోగ్య కేంద్రంలో అందే వైద్య సాయం కంటే భారత్ నిర్మించిన ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేది. అయితే భారత్ నిర్మించిన ఆసుపత్రిలోకి అతనిని చేర్చుకోలేదని బిల్లీ హెన్రీ చెప్పారు.
“అది కేవలం భారతీయుల కోసమే” అని ఆయన అన్నారు.
దీంతో గాయపడిన బాలుడిని, బాలుడి తల్లిదండ్రులు మారిషస్ తీసుకెళ్లారు. బాలుడు ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడని లావల్ సూప్రమనియెన్ చెప్పారు. మారిషస్ నుంచి నౌక అగలెగ వచ్చే వరకు బాలుడి తల్లిదండ్రులు అక్కడ ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.
బాలుడి పరిస్థితి గురించి మారిషస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ప్రకటన చేసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది.
మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నౌత్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ “అగలెగ సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ అజెండాలో అగ్రభాగాన ఉంది” అని అన్నారు.
అగలెగలో ఆరోగ్య, విద్య, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు స్థానికులకు వినోదాన్ని కల్పించేందుకు ఒక ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేశారు. అంతే కాకుండా మత్స్య పరిశ్రమ అభివృద్ధి, కొబ్బరి ఉప ఉత్పత్తులను వాడుకునేలా ప్రోత్సాహం కల్పించడం కూడా ఇందులో ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు.
అయితే భారత ప్రభుత్వం కానీ, మారిషస్ ప్రభుత్వం కానీ రెండు దేశాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం గురించి ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు. దీంతో భనిష్యత్ ప్రణాళికలు ఏంటో తెలియక అక్కడి వారిలో అపనమ్మకం పెరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)