క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఎలా గెలిచింది... అదీ చేజ్ చేసి?

వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ మరో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సోమవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ కేవలం రెండే వికెట్లు కోల్పోయి, ఒక ఓవర్ మిగిలి ఉండగానే చేరుకుంది.

ఈ విజయంతో అఫ్గానిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.

పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. ‘‘మేం ప్రపంచకప్ గెలిచినట్లు అనిపించింది. ఇంతకు ముందు పాకిస్తాన్‌తో ఏడు మ్యాచ్‌లు ఆడాం. కానీ ఒక్కటి కూడా గెలవలేదు. కానీ, ఈసారి మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం" అని అన్నాడు.

87 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

పాకిస్తాన్‌పై గెలిచిన సందర్భంగా అఫ్గాన్ క్రికెటర్లు ప్రపంచ కప్ గెలిచినంత ఆనందంగా చెన్నైలో స్టేడియంలో మొత్తం కేరింతలు కొడుతూ తిరిగారు.

మ్యాచ్ తర్వాత కెప్టెన్లు ఏమన్నారు?

తమ జట్టు సరిగా ఆడలేకపోయిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంగీకరించాడు. ఓటమికి బౌలర్లే కారణమని ఆరోపించాడు.

“మా స్కోరు బాగానే ఉంది, కానీ మా బౌలింగ్ బాగా లేదు. మిడిల్ ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ను ఆపలేకపోయాం. మేం మంచి క్రికెట్ ఆడలేదు. తదుపరి మ్యాచ్‌లలో ఈ తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం.’’ అని ఆజం అన్నాడు.

జట్టు విజయాన్ని ఆస్వాదిస్తున్నానని అఫ్గానిస్తాన్ జట్టు కెప్టెన్ షాహిదీ అన్నాడు. ‘‘ఈ గెలుగు అద్భుతంగా ఉంది. మేం మా నెక్ట్స్ మ్యాచ్‌లపై దృష్టి పెట్టాం’’ అని వ్యాఖ్యానించాడు.

“మంచి క్రికెట్ ఆడుతున్నామని మాపై మాకు నమ్మకం కలిగింది. ఈ టోర్నీని మా దేశ ప్రజలకు గుర్తుండిపోయేలా చేస్తామని మేం చెప్పాం. మా బౌలింగ్‌ బాగుంది. ముఖ్యంగా మా స్పిన్నర్ నూర్ బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో గుర్బాజ్, ఇబ్రహీం మ్యాచ్‌ను మొదటి నుంచి మా అదుపులో ఉండేలా చేశారు’’ అని అన్నాడు షాహిదీ.

సోషల్ మీడియాలో పాక్‌పై విమర్శలు

పాకిస్తాన్ ఓడిపోవడంపై ఆ‌న్‌లైన్‌లో విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఫరీద్ ఖాన్ అనే యూజర్ దీనిపై స్పందించాడు.

‘‘మా టీమ్ రేపే విమానం‌లో తిరిగి పాకిస్తాన్ రావాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని అవమానించవద్దు’’ అని రాశాడు.

అఫ్గానిస్తాన్ విజయంపై కొందరు స్పందించారు. @SellTerStegen అనే హ్యాండిల్‌లో ఇలా రాశారు.

‘‘ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైంది. నా కళ్లు చెమర్చాయి. నా బాల్యాన్ని కాబూల్ శిక్షణా శిబిరాల్లో గడిపాను. జీవితం కష్టాలతో నిండిపోయింది. నా హృదయంలో అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది.’’ అని పేర్కొన్నాడు.

అఫ్గానిస్తాన్ జట్టు తొమ్మిది రోజుల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లనే రెండు పెద్ద జట్లను ఓడించిందని వినీత్ అనే యూజర్ రాశారు.

‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్‌లో ఈ ప్రపంచకప్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు హ్యాట్సాఫ్.’’ అని తన పోస్టులో వినీత్ పేర్కొన్నారు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఇలా రాశాడు. ‘‘ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శనను అందరూ విమర్శిస్తున్నారు. కానీ దానిపై నేనేమైనా వ్యాఖ్యానిస్తే నన్ను యాంటీ పాకిస్తానీ అంటారు.’’ అని అన్నారు.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా స్పందిస్తూ “అక్టోబర్ 23, 2022న భారత్‌ చేతిలో ఓటమి, అక్టోబర్ 23, 2023న అఫ్గానిస్తాన్‌ చేతిలో ఓటమి. ఈ తేదీలను పాకిస్తాన్ గుర్తుంచుకోవడానికి ఇష్టపడదు. ఈ ఓటమితో వాళ్లు సెమీ‌ఫైనల్‌కు చేరుకోవడానికి ఉన్న ప్రతి అవకాశం మూసుకు పోయినట్లే.’’ అని వ్యాఖ్యానించారు.

చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్

అక్టోబరు 15న దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. అఫ్గాన్ జట్టు వరల్డ్ కప్ మ్యాచుల్లో వరసగా 14 మ్యాచుల్లో ఓడిన తర్వాత ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి విజయం.

అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 285 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 215 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ 40.3 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది.

అఫ్గాన్ విజయంలో భారతీయుడి పాత్ర

అప్గానిస్తాన్ అద్భుత విజయానికి ఓ భారతీయుడు కూడా సహకరించాడు. అతనే మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. ఒకప్పుడు భారత జట్టుకు ఆడిన అజయ్ జడేజా ఇప్పుడు అఫ్గానిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

గతంలో ప్రపంచ కప్ ఆడిన అనుభవం అజయ్ జడేజాకు ఉంది. 1996 ప్రపంచకప్‌లో బెంగుళూరులో పాకిస్తాన్‌తో ఆడిన అతని అద్భుత ఇన్నింగ్స్‌ను చాలామంది క్రికెట్ అభిమానులకు గుర్తే ఉంది.

ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో జడేజా చెలరేగి ఆడాడు.

తాజాగా అఫ్గానిస్తాన్ విజయంలో అజయ్ జడేజా పాత్ర ఎంతో ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)