You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డీఎన్ఏ టెస్ట్: ఆయన భార్యలకు 25 మంది పిల్లలు.. పరీక్ష చేయిస్తే 15 మందే ఆయనకు జన్మించినట్లు తేలింది
- రచయిత, ప్రియా సిప్పీ
- హోదా, బీబీసీ ఫోకస్ ఆన్ ఆఫ్రికా పాడ్‌కాస్ట్
యుగాండాలో పితృత్వ పరీక్షలు చేయించుకుంటోన్న పురుషుల సంఖ్య పెరిగిందని నివేదికలు వస్తున్నాయి.
ఈ పరీక్షల వల్ల కాపురాలు కుప్పకూలి, పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దసంఖ్యలో భార్యలు ఉంటుండగా, మరికొందరు మహిళలతో వివాహేతర సంబంధాలున్న యుగాండా బిజినెస్ టైకూన్ ఒకరు తన భాగస్వాముల్లో ఒకరితో గొడవపడి.. ఆమె సంతానం తనతో కలిగినవారేనా అనేది తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నట్లు అక్కడి న్యూస్‌పేపర్ కథనం ప్రచురించింది. అప్పటి నుంచి ఈ పితృత్వ పరీక్షల వ్యవహారం యుగాండాలో చర్చనీయంగా మారింది.
ఈ పితృత్వ పరీక్షలో ఆయన 25 మంది పిల్లల్లో కేవలం 15 మంది మాత్రమే ఆయనకు పుట్టినట్లు తేలిందని ఆ కథనంలో రాశారు.
ఈ కథనంపై అటు ఆ బిజినెస్ టైకూన్ కానీ, ఆయన కుటుంబం కానీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.
ఈ రిపోర్ట్‌ను బీబీసీ సొంతంగా ధ్రువీకరించలేదు.
కానీ, ఈ కథనం మాత్రం యుగాండాలో దావనంలా వ్యాపించింది.
గత కొన్ని నెలలుగా ఆ దేశంలో పెద్దసంఖ్యలో డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. అనేక వివాదాలకు కారణమవుతున్నాయి.
డీఎన్ఏ పరీక్షలు చేయించుకుని పిల్లల్ని, కుటుంబాలను వేదనకు గురిచేయొద్దని, ఇలాంటి పరీక్షలకు దూరంగా ఉండాలని పురుషులను కొందరు చట్టసభల సభ్యులు కోరుతున్నారు.
‘‘మన పూర్వీకులులాగా నివసించండి. ఇంట్లో పుట్టిన ప్రతి శిశువు కూడా మీ పిల్లలే’’ అని పార్లమెంట్‌లో ఖనిజాభివృద్ధి శాఖ మంత్రి సారా ఓపెన్ది అన్నారు.
ఒకవేళ పురుషుడు డీఎన్ఏ పరీక్షను చేయించుకోవాలనుకుంటే, శిశువు పుట్టిన వెంటనే చేయించుకోవాలని.. వారు పెరిగినప్పుడు కాదని చెప్పారు.
అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే, ఈ పరీక్షలు గృహహింసకు కారణమవుతున్నాయని మానిటర్ న్యూస్‌పేపర్ రిపోర్ట్ చేసింది.
యుగాండాలో నివసిస్తోన్న ఒక ఇజ్రాయిల్ దేశస్తుడు ఆరు నెలల బిడ్డకు తండ్రి తాను కాదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలిన తర్వాత తన భార్యను కిరాతంగా చంపేశాడు.
ఆయన్ను యుగాండా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి పరీక్షల కోసం అభ్యర్థనలు పదింతలు పెరిగాయని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సిమోన్ ముండేయి జులైలో చెప్పారు.
ఈ పరీక్షల కోసం పిల్లల, తండ్రి డీఎన్ఏను సేకరించడం అవసరం.
‘‘మా ప్రభుత్వ పరీక్షల ల్యాబ్‌లో అంతకుముందు రోజుకు సగటున 10 మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు, ఈ సంఖ్య రోజుకు సగటున 100కి పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది’’ అని తెలిపారు.
యుగాండాలో పెరిగిన పితృత్వ పరీక్షల ట్రెండ్‌ను ప్రైవేట్ క్లినిక్స్ సొమ్ము చేసుకుంటున్నాయి.
ట్యాక్సీలకు వెనుకాల వ్యాపార ప్రకటనలు ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రకటనలు ఇస్తుండడం చేస్తున్నాయి.
అయితే, ఈ ఫలితాలు తప్పుడుగా కూడా రావొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ టెస్టింగ్ కిట్లు యుగాండాలో అక్రమంగా రవాణా అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఇలాంటి పరీక్షలలో వచ్చే ఫలితాలను ఎంతవరకు నమ్మొచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం మూడు ప్రభుత్వ రంగ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిమితి విధించినట్లు ప్రజారోగ్య డైరెక్టర్ డేనియల్ క్యాబయింజే చెప్పారు.
అయినప్పటికీ, సోషల్ మీడియాలో దీనిపై చాలా హైప్ క్రియేట్ అయిందన్నారు.
ఈ పరీక్షలు జరిగినప్పుడు కుటుంబాలకు కౌన్సిలింగ్, మానసికంగా మద్దతు ఇచ్చే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
‘‘పితృత్వ పరీక్షలు కుటుంబాలను కుప్పకూల్చుతున్నాయని, జెండర్ ఆధారితంగా హింసకు కారణమవుతున్నట్లు ప్రజలు బాధపడుతున్న సోషల్ మీడియా మెసేజ్‌లను మేం చూశాం. ల్యాబరేటరీల్లో వచ్చే పరీక్షల ఫలితాల మూలంగా ఈ విధంగా జరగకూడదని మేం భావిస్తున్నాం’’ అని డాక్టర్ క్యాబయింజే బీబీసీతో అన్నారు.
యుగాండాలోని బార్‌ల నుంచి పార్లమెంట్ వరకు.. ట్యాక్సీల నుంచి సోషల్ మీడియా వరకు ఈ విషయంపై భిన్న రకమైన అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి.
‘‘పిల్లలకు ఆయన వల్ల పుట్టారా? లేదా అని తెలుసుకోవడం పురుషుల హక్కు అని నేను అనుకుంటున్నా. పిల్లలు ఒక బాధ్యత. పిల్లలు కూడా వారు అనుబంధం పెంచుకునే కుటుంబం గురించి తప్పక తెలుసుకోవాలి.’’ అని ఈ పరీక్షలకు మద్దతు ఇస్తూ యుగాండా రాజధాని కంపాలాకు చెందిన బ్వెట్టే బ్రియాన్ చెప్పారు.
‘‘పితృత్వ పరీక్షల వల్ల సంతోషంగా ఉన్న వివాహ బంధం, కుటుంబాలు విడిపోయినట్లు నేను చూశాను. దీనిలో పిల్లలు బాధితులుగా మారుతున్నారు’’ అని ఈ పరీక్షలను వ్యతిరేకిస్తూ యుగాండాకు చెందిన మరో అమ్మాయి ట్రాసీ నకుబుల్వా తెలిపారు.
తన భర్తకు పిల్లల్ని ఇవ్వడం కోసం కొన్ని సార్లు భార్యలు రహస్యంగా మరో వ్యక్తితో సంబంధాలు కొనసాగించడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని మానవ హక్కుల కార్యకర్త లిండ్సే కుకుండా అన్నారు.
‘‘మన పూర్వీకులు చేశారు, మన అమ్మ, అమ్మమ్మలు చేశారు’’ అని అన్నారు.
‘‘భార్యాభర్తలకు పిల్లలు పుట్టడం కష్టమైనప్పుడు.. కొన్నిసార్లు పురుషులకు సంతానోత్పత్తి సమస్యలున్నప్పుడు.. మహిళలు భర్తలకు పిల్లల్ని కని ఇవ్వలేకపోతున్నారు. ఆఫ్రికా సంప్రదాయంలో, భార్యలు పిల్లల్ని కని ఇవ్వలేకపోతే, వారిని భర్తలు ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు, విడాకులు ఇస్తున్నారు. ’’ అని ఆమె చెప్పారు.
ఆ సమయంలో భర్తలు కోరుకున్నట్లు పిల్లల్ని కనడం కోసం మహిళలు రహస్యంగా మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్నారన్న విషయం ఈ పురుషులకు తెలియదని లిండ్సే కుకుండా అన్నారు.
పితృత్వ పరీక్షలను కోరుకునే భర్తలపై కుకుండా తీవ్రంగా మండిపడ్డారు.
‘‘పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సాధారణం. వారికి పుట్టిన పిల్లల్ని పురుషులు ఇంటికి కూడా తీసుకొస్తారు. ఆ పిల్లల్ని భార్యలే పెంచాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
అయితే, కొన్ని ల్యాబ్‌లకు ఇలాంటి పరీక్షలు చేయమని అభ్యర్థనలు తక్కువగానే వస్తున్నాయి.
పితృత్వ పరీక్షల అభ్యర్థనల్లో అంత పెద్ద పెరుగుదలనేమీ తాను చూడలేదని ప్రభుత్వ ల్యాబోరేటరీలో పనిచేసే మైక్రోబయోలజిస్ట్ ఫ్రెడ్డీ బ్వాంగా చెప్పారు.
కానీ, ఈ విషయంపై పెద్ద ఎత్తున అవగాహన చేపడుతున్నారు.
ఇన్నేళ్లలో తాను చేసిన పరీక్షల్లో 60 శాతం నుంచి 70 శాతం పరీక్షలు తండ్రికి, బిడ్డకి మధ్య బయోలాజికల్ సంబంధాలున్నట్లు రుజువు చేస్తున్నాయని చెప్పారు.
30 శాతం నుంచి 40 శాతం మాత్రమే తండ్రికి, బిడ్డకు మధ్య ఎలాంటి సంబంధం ఉండటం లేదు.
అయితే, పిల్లలు ఎక్కడైతే పుట్టారో అక్కడే స్థిరపడేందుకు కొన్నిసార్లు ఈ ఫలితాలు ప్రయోజనకరంగా మారుతున్నాయి.
పాత కాలం నాటి సంప్రదాయ విధానాలు అంటే బొడ్డు తాడుపై ఆవు కొవ్వును పూయడం, నీటితో నింపి ఓవెన్ బాస్కెట్‌లో దాన్ని పెట్టడం వంటివి చేయడం కంటే ఈ పరీక్షలే ఉత్తమమని కొందరు చెబుతున్నారు.
ఈ సంప్రదాయ విధానంలో ఒకవేళ బొడ్డు తాడు నీటిపై తేలితే, ఆ బిడ్డ ఆ కుటుంబానికి చెందిన వారేనని భావిస్తున్నారని యుగాండా మానిటర్ న్యూస్‌పేపర్ చెప్పింది.
పితృత్వ పరీక్షలు కోరాల్సినవసరం పురుషులకు లేదని యుగాండా ప్రాథమిక ఆరోగ్య సహాయ మంత్రి అన్నారు.
‘మీ బిడ్డ కాదని తెలియకపోతే నష్టమేమీ లేదు, గుండె ఏమీ ఆగిపోదు. కానీ, ఆ విషయం తెలుసుకుంటనే గుండె ముక్కలవుతుంది’ అని మార్గరెట్ ముహంగా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు ఎర్రగా పుడతారా? చర్మం రంగు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
- గర్భధారణ సమయంలో గుండె ఆకారం మారుతుందా?
- కృత్రిమ గర్భధారణతో పిల్లలను కన్నారు.. వీర్యం మారిపోవడంతో పిల్లల తండ్రి వేరొకరని తెలిసింది.. ఆ దంపతులు ఏం చేశారంటే
- కతీజా బీబీ: 'దాదాపు 10 వేల డెలివరీలు చేశాను... అన్నీ సాధారణ ప్రసవాలే, ఒక్కరు కూడా చనిపోలేదు'
- ‘లేకలేక పుట్టిన కూతురు, మమ్మల్ని చంపేస్తా అంటోంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)