You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం కేసు: స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలోని విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం సుప్రీం కోర్టు మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం సుప్రీం కోర్టు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన కేసును శుక్రవారం విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పనిసరిగా అనుసరించాలంటూ 15 మార్గదర్శకాలను జారీ చేసినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
విశాఖపట్నంలోని ఆకాష్ బైజూస్ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని 2023 జూలైలో హాస్టల్ టెర్రస్ నుంచి కిందపడి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఆ విద్యార్థిని తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్, విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఫిర్యాదుల పరిష్కార వేదిక వంటి వాటిని తప్పనిసరి చేస్తూ, రెండు నెలల్లోపు నిబంధనలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ నిబంధనల అమలు, తనిఖీలు, ఫిర్యాదులను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.
ఈ విధానం అమలు దశలు, రాష్ట్రాలతో సమన్వయం, నియంత్రణ పురోగతి, పర్యవేక్షణ యంత్రాంగాలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై జాతీయ టాస్క్‌ఫోర్స్ నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వం 90 రోజుల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
అధికారులు సరైన చట్టాలు లేదా నియమాలను రూపొందించే వరకు, విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ 15 మార్గదర్శకాలను నిర్దేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
అన్ని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది కౌన్సెలర్లు ఉండేలా చూసుకోవాలని పేర్కొంది.
ముఖ్యంగా, పరీక్షల సమయంలో లేదా కొత్త తరగతులు లేదా కోర్సులకు మారేటప్పుడు విద్యార్థులకు క్రమం తప్పకుండా, స్నేహపూర్వకంగా, వ్యక్తిగతంగా మద్దతునిచ్చేందుకు మార్గదర్శకులు లేదా కౌన్సెలర్లు ఉండేలా చూడాలని కోర్టు సూచించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)