నెతన్యాహు, హమాస్ నేతలపై ఐసీసీ ప్రాసిక్యూటర్ చేసిన యుద్ధ నేరారోపణలు ఏమిటి?

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో ప్రమేయమున్న అధినేతలపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కోరినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ సోమవారం తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌‌ల మీద వినిపిస్తున్న యుద్ధ నేరాలు, మానవతను మంటగలిపేలా పాల్పడిన అకృత్యాలకు తన వద్ద ''నమ్మదగిన సహేతుకమైన ఆధారాలు'' ఉన్నాయని ఖాన్ స్పష్టం చేశారు.

పాలస్తీనాకి చెందిన మిలిటెంట్ సంస్థ 'హమాస్‌' నాయకులు ముగ్గురిని.. గాజాలో ఆ గ్రూప్ అధిపతిగా ఉన్న యహ్యా సిన్వార్, దాని నాయకులు ఇస్మాయిల్ హనియే, మొహమ్మద్ అల్ మస్రిని కూడా ఈ అకృత్యాలకు బాధ్యులుగా పరిగణిస్తున్నారు కరీంఖాన్.

ఆ ఐదుగురినీ అదుపులోకి తీసుకోవాలని ప్రాసిక్యూటర్ ఖాన్ కోర్టును అభ్యర్థించారు. అయితే, అరెస్టు వారెంట్ల జారీకి సాక్ష్యాలు సరిపోతాయో లేదో ఐసీసీ ఇన్వెస్టిగేటివ్ జడ్జిల బృందం నిర్ణయించాల్సి ఉంది.

ప్రాసిక్యూటర్ ప్రకటనకు నెతన్యాహు స్పందిస్తూ, ''ప్రజాస్వామ్య ఇజ్రాయెల్‌‌తో, నరహంతకులైన హమాస్‌ను హేగ్ ప్రాసిక్యూటర్ పోల్చడాన్ని అసహ్యించుకుంటున్నా. దానిని తిరస్కరిస్తున్నా'' అని ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు, హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జుహ్రీ మాట్లాడుతూ, తమ నాయకులను అరెస్టు చేయాలని చేసిన అభ్యర్థన బాధితుడినే ఉరితీయమనడంతో సమానమని అన్నారు.

ఐసీసీ ఏర్పాటు కోసం చేసిన రోమ్ ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయలేదు. కాబట్టి ఇజ్రాయెల్ భూభాగంపై ఐసీసీకి ఎలాంటి అధికారాలు సంక్రమించవు. కానీ, అరెస్టు వారెంట్ జారీ చేసినట్లయితే నెతన్యాహు, గల్లంట్ విదేశాలకు వెళ్లే అవకాశాలు తగ్గిపోవచ్చు.

మరి ఇరుపక్షాలపై చేసిన ఆరోపణలేంటి?

ఇజ్రాయెల్‌పై ఆరోపణలు

ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్న నేరాలు ఇవి:

  • పౌరుల ఆకలి చావులను యుద్ధ విధానంగా అనుసరించడం - యుద్ధ నేరం
  • ఉద్దేశపూర్వకంగా శరీరానికి లేదా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించడం లేదా క్రూరంగా వ్యవహరించడం - యుద్ధ నేరం
  • ఉద్దేశపూర్వకంగా నరవధ లేదా హత్య - యుద్ధ నేరం
  • సామాన్య జనంపై ఉద్దేశపూర్వక దాడులు - యుద్ధం నేరం
  • ఆకలితో చనిపోతున్నవారిని నిర్మూలించడం లేదా హత్య - మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • హింసించడం - మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరాలు, ఇతర అమానవీయ చర్యలు

హమాస్‌ను నాశనం చేసే ఉద్దేశంతో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడితో నెతన్యాహు, గల్లంట్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1200 మందికి పైగా చనిపోగా, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది.

ఆహారం, నిత్యవసరాలు అందకుండా చేయడాన్ని యుద్ధంలో ఆయుధంగా వాడడం, హత్యలు, సమూల నిర్మూలన, సామాన్య పౌరులపై ఉద్దేశపూర్వక దాడుల వంటి చట్టవ్యతిరేక చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడిందని ఖాన్ భావిస్తున్నారు.

''ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలు, నమ్మదగిన వీడియో, ఫోటో, ఆడియో సాక్ష్యాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్తుల ప్రకటనలతో సహా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా, ఒక పద్ధతి ప్రకారం కనీస అవసరాలు అందకుండా చేసి గాజాలో సామాన్య పౌరుల మనుగడ లేకుండా చేసేందుకు ప్రయత్నించిందని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి'' అని ప్రాసిక్యూటర్ అభియోగపత్రం పేర్కొంది.

''2023 అక్టోబర్ 8 నుంచి మూడు సరిహద్దులైన రఫా క్రాసింగ్, కెరెమ్ షాలోమ్, ఎరేజ్‌లను పూర్తిగా మూసేసి, సరిహద్దుల ద్వారా ఆహారం, మందులు వంటి కనీస అవసరాలను కూడా ఏకపక్షంగా నియంత్రించడం ద్వారా ఈ నేరానికి పాల్పడినట్లయింది.'' అని అందులో పేర్కొన్నారు.

''గాజా ప్రజల తాగునీటికి ప్రధాన ఆధారమైన ఇజ్రాయెల్ నుంచి గాజాకు వచ్చే నీటి పైపులైన్లను ధ్వంసం చేసి నీటి సరఫరాను అడ్డుకోవడం 2023 అక్టోబర్ 9 నుంచి సాగుతోంది. అలాగే, 2023 అక్టోబర్ 8 నుంచి ఇప్పటి వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేయడం లేదా అడ్డుకోవడం.'' వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

తమ దేశ ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకునే హక్కు తమకు ఉంటుందనే అంశాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తినప్పటికీ, ''అంతర్జాతీయ మానవతా చట్టానికి లోబడి ఉండాలన్న నిబంధన నుంచి ఇజ్రాయెల్‌కి కానీ, లేదా మరే దేశానికి కానీ మినహాయింపు ఉండదు.'' అని ఆయన పేర్కొన్నారు.

''వారికి ఎలాంటి సైనిక లక్ష్యాలు ఉన్నప్పటికీ, వాటిని సాధించేందుకు ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న మార్గాలు మరణాలకు కారణం కావడం, ఆకలి చావులు, సామాన్య పౌరులకు లేదా వారి ఆరోగ్యానికి తీవ్ర హాని చేయడం వంటివి నేరమే.'' అని కరీంఖాన్ స్పష్టం చేశారు.

హమాస్‌పై ఆరోపణలు

ఐసీసీ ప్రాసిక్యూటర్ పేర్కొన్న నేరాలు ఇవి..

  • నిర్మూలించే ఆలోచన - మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • హత్య - యుద్ధం నేరం, మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • బందీలుగా పెట్టుకోవడం - యుద్ధ నేరం
  • రేప్, లైంగిక హింస - యుద్ధ నేరం, మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • చిత్రహింసలకు గురిచేయడం - మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • నిర్బంధ సమయంలో చిత్రహింసలు - యుద్ధ నేరం
  • బందీలపై అమానవీయ చర్యలు - మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరం
  • బందీలతో క్రూరంగా ప్రవర్తించడం - యుద్ధ నేరం
  • నిర్బంధ సమయంలో వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడం - యుద్ధ నేరం

గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఆకస్మిక దాడి ప్రస్తుత ఘర్షణకు దారితీసింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఐసీసీ ప్రాసిక్యూటర్ దీనిని శిక్షార్హమైన నేరంగా పరిగణించారు.

హమాస్‌కి చెందిన నిందితులు సిన్వార్, హనియే, అల్ మస్రి ''ప్రణాళికాబద్దంగా నేరాలకు ప్రేరేపించారు. కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బందీల వద్దకు వెళ్లడం వంటి చర్యల ద్వారా వారు నేరాలకు బాధ్యత వహిస్తున్నట్లు చెప్పినట్లైంది'' అని ఖాన్ తెలిపారు.

''హమాస్ దాడి చేసిన కిబ్బుట్జ్ బీరీ, కిబ్బుట్జ్ కఫర్ అజా, రీయిమ్‌లోని సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ ప్రదేశాలకు నేను స్వయంగా వెళ్లినప్పుడు, ఆ దాడుల వినాశకర దృశ్యాలు, ఆ దారుణ నేరాల ప్రభావం గురించి ఈరోజు దాఖలు చేసిన అభియోగాల్లో పేర్కొన్నాం'' అని ప్రాసిక్యూటర్ చెప్పారు.

''ప్రాణాలతో బయటపడిన వారితో మాట్లాడినప్పుడు కుటుంబ బాంధవ్యాలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే బంధాలు.. క్రూరత్వం, కాఠిన్యం వారికి ఎంతటి బాధను మిగిల్చాయో నేను విన్నా. ఈ చర్యలకు సమాధానం చెప్పాల్సిందేనని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి'' అన్నారు.

వాటితో పాటు 1200 మంది మరణానికి కారణమైన హమాస్.. విదేశీయులు, ఇజ్రాయెలీలతో సహా 254 మందిని బందీలుగా తీసుకెళ్లింది. వారిలో 120 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదు.

''ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్ చేసిన బందీలపై రేప్, లైంగిక హింస సహా ఎన్నో అమానవీయ చర్యలకు పాల్పడినట్లు నమ్మదగిన సహేతుకమైన ఆధారాలు నా కార్యాలయంలో ఉన్నాయి'' అని ప్రాసిక్యూటర్ చెప్పారు.

''వైద్య నివేదికలు, డాక్యుమెంటరీలు, వీడియో సాక్ష్యాలు, బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారి ఇంటర్వ్యూల ఆధారంగా ఒక అభిప్రాయానికి వచ్చాం'' అని ఆయన చెప్పారు.

ఆరోపణల పరంపర

బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ విశ్లేషణ

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి సహా హమాస్‌కి చెందిన ముగ్గురు ప్రముఖ నేతలకు వ్యతిరేకంగా చేసిన వినాశకర చర్యల ఆరోపణలకు సంబంధించి జాగ్రత్తగా చట్టపరమైన భాషను ఉపయోగించారు.

అరెస్టు వారెంట్లు జారీ చేయాలా? వద్దా? అనే అంశాన్ని ఐసీసీ న్యాయమూర్తుల ప్యానెల్ ఇప్పుడు పరిశీలిస్తుంది. అవకాశం ఉంటే, ఐసీసీ చట్టంపై సంతకం చేసిన దేశాలకు చెందిన వారిని అరెస్టు చేయాల్సి ఉంటుంది.

ఈ చట్టానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసిన 124 మందిలో రష్యా, చైనా, అమెరికా లేవు. ఇజ్రాయెల్‌ కూడా దీనిపై సంతకం చేయలేదు. పాలస్తీనియన్లు సంతకం చేసినందున యుద్ధంలో నేరపూరిత చర్యలపై విచారణ చేపట్టే అధికారం తమకు ఉందని ఐసీసీ చెప్పింది.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి యుద్ధం, హత్య, నిర్మూలన, సామాన్య పౌరులపై ఉద్దేశపూర్వక దాడులు, పౌరుల ఆకలి చావులను యుద్ధంలో ఆయుధంగా వాడడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఐసీసీ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

అరెస్టు వారెంట్లు జారీ అయితే, ఇజ్రాయెల్‌కు సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన బెంజమిన్ నెతన్యాహు తన పాశ్చాత్య మిత్రులను కలిసేందుకు వెళ్లాల్సి వచ్చినా అరెస్టు ప్రమాదం వెంటాడుతుంది.

ఇందులో ఆయనకు మినహాయింపు లభించేది, ముఖ్యమైనది కేవలం అమెరికా విషయంలో మాత్రమే. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌కి కూడా ఇది వర్తిస్తుంది.

ఇజ్రాయెల్ గాజాను ముట్టడిస్తామని ప్రకటించినప్పుడు గల్లంట్ వాడిన పదాలు ఇజ్రాయెల్ ఉద్దేశాన్ని తెలియజేస్తుందంటూ విమర్శకులు చాలాసార్లు ఉదహరించారు.

అక్టోబర్ 7న హమాస్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత గల్లంట్ మాట్లాడుతూ, ''గాజా స్ట్రిప్ ముట్టడికి ఆదేశించా. అక్కడ కరెంటు ఉండదు, ఆహారం ఉండదు, ఇంధనం ఉండదు, అన్ని మూతపడతాయి. మనిషి రూపంలోని జంతువులతో పోరాడుతున్నాం. అదే రీతిలో మా సమాధానం కూడా ఉంటుంది'' అన్నారు.

''ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా, ఒక పద్ధతి ప్రకారం గాజా వ్యాప్తంగా సామాన్య పౌరుల మనుగడకు కనీస అవసరాలను కూడా అందకుండా చేసింది'' అని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

హమాస్ యుద్ధ నేరాల్లో హత్య, నిర్మూలన, కిడ్నాప్ చేసి బందీలుగా తీసుకెళ్లడం, రేప్, చిత్రహింసలు వంటివి ఉన్నాయని ఖాన్ తెలిపారు.

నిందితులుగా పేర్కొన్న హమాస్‌కి చెందిన ఇద్దరు నేతలు యహ్యా సిన్వార్ (గాజాలో హమాస్ అధిపతి), హమాస్ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ దీఫ్(ఐసీసీ మోహమ్మద్ అల్ మస్రిగా పేర్కొన్న వ్యక్తి) గాజాలో కాకుండా వేరేచోట దాక్కున్నట్లు భావిస్తున్నారు.

వారిని అంతం చేసేందుకు ఇజ్రాయెల్ గత ఏడు నెలలుగా ప్రయత్నిస్తోంది, కాబట్టి అరెస్టు వారెంట్ వారిపై పెద్దగా ప్రభావం చూపించదు. కానీ, హమాస్ నాయకుడు, పాలస్తీనా గ్రూప్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే కోర్టు ఉత్తర్వులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆయన ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తారు. సీనియర్ అరబ్, ఇరానియన్ నేతలతో సమావేశమవుతారు. ఖతార్ కేంద్రంగా హానియే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ దేశం కూడా ఇజ్రాయెల్ మాదిరిగా ఐసీసీ ఏర్పాటుకు కారణమైన రోమ్ ఒప్పందంపై సంతకం చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)