You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ గొరిల్లాలు కొత్త మందులు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలకు దారి చూపనున్నాయా?
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్
స్వయంగా చికిత్స చేసుకునే గొరిల్లాలు భవిష్యత్‌లో ఔషధాల ఆవిష్కరణలకు దారిచూపగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అడవుల్లోని గొరిల్లాలు తినే మొక్కలపై అధ్యయనం చేసిన గబాన్ దేశ పరిశోధకులు వాటిలోని నాలుగు ఔషధ గుణాలను గుర్తించారు.
స్థానిక వైద్యులు కూడా ఈ మూలికలను చికిత్సల్లో వాడుతారు.
ఈ మొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్స్ పుష్కలంగా ఉన్నట్లు ప్రయోగశాలలో చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.
వీటిలోని ఒక మొక్క సూపర్‌బగ్‌లపై పోరాటంలో ప్రభావవంతంగా పనిచేయగలదని అధ్యయనంలో తేలింది.
గొరిల్లాలు వంటి గ్రేట్ ఏప్స్ ఔషధ గుణాలున్న మొక్కల ఆకుల పసరుతో వైద్యం చేసుకుంటాయి.
గాయపడిన ఒక ఒరాంగుటాన్ ఆకులను నమిలి ఆ పసరును గాయంపై రాసుకున్న ఘటన ఈ మధ్యే వార్తల్లో నిలిచింది.
తాజా అధ్యయనంలో గబాన్‌లోని మౌకలాబా డౌడౌ నేషనల్ పార్క్‌లోని గొరిల్లాలు తినే మొక్కలపై వృక్షశాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు.
స్థానిక వైద్యుల్ని ఇంటర్వ్యూ చేసి ఆ అంశాల ఆధారంగా నాలుగు చెట్లను వారు ఎంపిక చేశారు. ఫ్రోంగేర్ (సీబా పెంటాండ్రా), జెయింట్ ఎల్లో మల్బరీ (మిరియాంథస్ అర్బోరియస్), ఆఫ్రికన్ టేకు చెట్టు (మిలీసియా ఎక్సెల్సా), ఫిగ్ (ఫికస్) అనే నాలుగు చెట్లు, వైద్యంలో ఉపయోగపడొచ్చని వారు అంచనాకు వచ్చారు.
ఈ చెట్ల బెరడులో ఫినోల్స్ నుంచి ఫ్లేవనాయిడ్స్ వరకు రకరకాల ఔషధ గుణాలున్న రసాయనాలు ఉంటాయి.
కడుపు నొప్పి మొదలుకొని వంధ్యత్వం వరకు అనేక చికిత్సల్లో సంప్రదాయ ఔషధంగా వీటి బెరడును వాడతారు.
వివిధ ఔషధాలను తట్టుకోగలిగే ఓ ఈకోలీ వేరియంట్‌పైనా ఈ నాలుగు మొక్కలు యాంటీబ్యాక్టీరియల్ ప్రభావం చూపించాయి.
ఇప్పటివరకు పరీక్షించిన అన్ని స్ట్రెయిన్‌లపై ముఖ్యంగా ఫ్రోంగేర్ చెట్టు అద్భుతమైన ఫలితాలను చూపిందని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘తమకు ఉపయోగపడే మొక్కలను తినేలా గొరిల్లాలు పరిణామం చెందినట్లు ఇది సూచిస్తుంది. సెంట్రల్ ఆఫ్రికా వర్షారణ్యాలపై మనకున్న జ్ఞానంలోని అంతరాలను ఇది హైలైట్ చేస్తుంది’’ అని యూకేలోని డర్హామ్ యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ జొవన్నా సెట్చల్ చెప్పారు. గబాన్ శాస్త్రజ్ఞులతో కలిసి జొవన్నా కూడా పనిచేశారు.
గబాన్‌లో అడవులు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడి అడవుల్లో ఏనుగులు, చింపాంజీలు, గొరిల్లాలతో పాటు ఔషధ గుణాలున్న అనేక రకాల మొక్కలు ఉన్నాయి.
వేట, వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో వెస్ట్రన్ లోల్యాండ్ గొరిల్లాలు అదృశ్యమవుతున్నాయి.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్‌లో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో వీటిని చేర్చారు.
ప్లోస్ వన్ అనే జర్నల్‌లో ఈ పరిశోధనను ప్రచురించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)