You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒక చీమకు ఆరోగ్యం బాలేదని సర్జరీ చేసిన తోటి చీమ, మనుషుల్లాగే అవి వ్యవసాయం, పశుపోషణ లాంటి పనులు కూడా చేస్తాయా?
- రచయిత, శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
చీమల జీవశాస్త్రం, వాటి సామాజిక నిర్మాణం అనేవి మనుషులకు దగ్గరగా ఉంటాయనే విషయాన్ని పరిశోధకులు చాలాసార్లు ధ్రువీకరించారు. తోబుట్టువులతో వాటి అనుబంధం, ఆప్యాయత చూసి చాలాసార్లు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
తాజాగా చీమల విషయంలో ఇలాంటిదే మరో కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తడి దుంగల్లో జీవించే ఒక రకమైన చీమలో ఒక ఆశ్చర్యకరమైన అలవాటును ఫ్లోరిడాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
తోటి చీమ ప్రాణాన్ని కాపాడటానికి, దాని శరీరంలో కొంత భాగాన్ని మరో చీమ తొలగిస్తుండటాన్ని శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వూర్జ్‌బర్గ్‌కు చెందిన నిపుణుడు ఎరిక్ ఫ్రాంక్ ఈ అధ్యయనాన్ని చేశారు.
‘‘జంతువుల్లో తోటి జీవి ప్రాణాన్ని కాపాడటానికి, దాని శరీరంలోని ఒక అవయవాన్ని మరో జీవి తొలగించడాన్ని గుర్తించడం ఇదే తొలిసారి’’ అని తన అధ్యయన పత్రంలో ఎరిక్ ఫ్రాంక్ పేర్కొన్నారు.
తోటి చీమలు గాయపడితే వాటిని చూసుకోవడం, యుద్ధంలో ఇతర చీమల్ని కాపాడటానికి తమ ప్రాణాన్ని త్యాగం చేయడం వంటి ప్రవర్తనలను చీమల్లో పరిశోధకులు తరచూ గమనిస్తుంటారు.
చాలాసార్లు నేను కూడా చీమల్లో ఇలాంటి ప్రవర్తనల్ని గమనించాను. కొన్నిరోజుల క్రితం ఇలాంటిది చూసే మరో అవకాశం నాకు లభించింది.
గుమ్మం దగ్గర భీకర యుద్ధం
ఆ సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. టీ తాగడానికి బయటకు వెళ్దామని ఇంట్లో నుంచి బయలుదేరాను. కానీ, తలుపు దగ్గర నాకు కనిపించిన ఒక దృశ్యంతో నేను టీ తాగాలనే సంగతి మర్చిపోయి, ఆ దృశ్యాన్నే తదేకంగా చూస్తూ రెండు గంటల పాటు అక్కడే ఉండిపోయాను.
అక్కడ ఒక చీమ తన తల పైభాగంలోని యాంటెన్నా(కొండి)తో నిర్జీవంగా ఉన్న మరో చీమ తలను పట్టుకుని లాక్కొని వెళ్తోంది.
ఆ దృశ్యం చూడటానికి, యుద్ధంలో శత్రువును ఓడించి దాని తలను కిరీటంలా అలంకరించుకొని విజయగర్వంతో శత్రువు శరీరాన్ని లాక్కెళ్తున్నట్లుగా ఉంది.
ఆ చీమల్ని అలా చూశాక, అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వాటిని మరింత నిశితంగా పరిశీలించాను. వాటి మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా తర్వాత నాకు అర్థమైంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు చీమల మధ్య భీకర యుద్ధం జరిగింది.
సాధారణంగా చీమల మధ్య యుద్ధానికి రెండు కారణాలు ఉంటాయని అశోక ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్‌కు చెందిన ఎంటమాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ చెప్పారు.
ఆయన చెప్పినదాని ప్రకారం, రెండు చీమలు ఒకే జాతికి చెందినప్పటికీ, వాటి ఆవాసాలు (కాలనీలు) వేర్వేరు అయితే, వాటి మధ్య ఆహారం లేదా ఆవాసం కోసం గొడవ జరిగే అవకాశం ఉంటుంది. నేను పైన పేర్కొన్న యుద్ధానికి కూడా ఇదే కారణం కావొచ్చు.
మరో సందర్భంలో హాంచ్‌బ్యాక్ జాతి చీమల యుద్ధాన్ని చూసే అవకాశం కూడా నాకు లభించింది. పక్క, పక్క కాలనీలకు చెందిన ఈ చీమలు ఘర్షణపడ్డాయి. ఆహారం కోసమే అవి కూడా గొడవపడి ఉంటాయి.
ఆహారమే కాకుండా, చీమల మధ్య యుద్ధం జరగడానికి మరో కారణం కూడా ఉంది. చీమల్లో అనేక సమూహాలు ఉన్నాయి. కొన్ని జాతుల చీమల మధ్య ఉండే సారూప్య ప్రవర్తనల ఆధారంగా, జీవశాస్త్రపరంగా వాటిని ఒక సమూహంగా వర్గీకరించారు.
బానిస చీమలు
ఉదాహరణకు, కొన్ని జాతుల చీమలు ఆకులు, పుల్లలు సేకరిస్తాయి. వాటి ఆవాసాల్లోపల శిలీంధ్రాలను పెంచుతాయి.
కొన్ని రకాల చీమలు అఫిడ్స్ అని పిలిచే కీటకాలకు తమ ఆవాసంలో ఆశ్రయం ఇస్తాయి. వాటి నుంచి లభించే సిరప్ వంటి ద్రవాన్ని పోషకాహారంగా తీసుకుంటాయని ప్రియదర్శన్ చెప్పారు.
చీమల్లో ఇలా అఫిడ్స్ అనే కీటకాల పెంపకం, శిలీంధ్రాల పోషణ అనేవి మానవులు చేసే వ్యవసాయం, పశుపోషణ వంటివని కీటక నిపుణులు చెబుతున్నారు.
అలాగే, చీమల్లో మరో రకం కూడా ఉంటాయి. అవి బానిసలను తయారు చేస్తాయి. ఈ చీమలు ఇతర జాతుల ఆవాసాలపై వేటకు వెళ్లి అక్కడి లార్వా (అపరిపక్వ చీమ)లను దొంగిలిస్తాయి. వాటిని పెంచుకొని తమకు బానిసల్లాగా వాడుకుంటాయి.
ఇతర జాతి చీమలతో వీటికి ఎలాంటి సంబంధాలు ఉండవని, కేవలం తమ ఆవాసాల్లో పనిచేయించుకోవడానికి బానిసలను తయారు చేసుకునే ప్రక్రియ ఇది అని చీమలపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ బ్రోనోయ్ బైథియా వివరించారు.
ఈ రెండు రకాల యుద్ధాలలో వాటి లక్ష్యం శత్రువుల కాలనీలను దోచుకోవడం. అంటే శత్రువుల ఆహారం, ఆవాసం, సంతానాన్ని దొంగిలించడం.
‘‘ఈ యుద్ధాల సమయంలో, ఆక్రమణకు గురైన కాలనీకి చెందిన చీమలు తమ కాలనీని కాపాడుకునేందుకు భీకరంగా పోరాడతాయి. కానీ, ఈ యుద్ధంలో ప్రత్యర్థులు, తమ కాలనీ రాణి చీమను బంధిస్తే ఆక్రమణలో ఉన్న కాలనీలోని కాపలా చీమలు, కార్మిక చీమలు అన్నీ పోరాటాన్ని ఆపివేస్తాయి” అని బెంగళూరుకు చెందిన అశోక ఫౌండేషన్‌కు చెందిన పరిశోధనా విద్యార్థి సహనశ్రీ చెప్పారు.
చీమల సామాజిక నిర్మాణం ఎలా ఉంటుంది?
రాణి చీమ పట్టుబడితే యుద్ధం ఎందుకు ముగుస్తుంది? రాణి చీమకు, ఇతర చీమలకు మధ్య సంబంధం ఏంటి?
‘‘ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం, చీమల కాలనీని రాణి చీమ ఏర్పరుస్తుంది. ఒకవేళ రాణి చీమ చనిపోతే, ఆ ఆవాసం నాశనం అవుతుంది. అందుకే తమ ఆవాసంపై ఆక్రమణ జరిగినప్పుడు ఇతర చీమలన్నీ రాణి కోసం తమ ప్రాణాలను పణంగా పెడతాయి’’ అని డాక్టర్ బ్రోనోయ్ బైథియా వివరించారు.
సాధారణంగా, కాలనీలో అన్ని ఆడ చీమలే ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. వీటినే రాణి చీమలు అంటారు. పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న మగ చీమలు చాలా తక్కువ సంఖ్యలో పుడతాయి.
సంతానోత్పత్తి ప్రక్రియలో రాణి చీమ వేరే కాలనీకి చెందిన మగ చీమను ఎంచుకొని దానితో సహవాసం చేస్తుంది.
తర్వాత రాణి చీమ ఒక ప్రదేశాన్ని కనుగొని, అక్కడ భూగర్భంలో ఒక చిన్న గూడును నిర్మిస్తుంది. తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. కొన్ని వారాల్లోనే ఆ గుడ్లు పొదిగి పిల్లలు పుడతాయి. ఇలా పుట్టిన చీమలు తమ కాలనీని విస్తరిస్తాయి.
చీమల అధికార శ్రేణి
రాణి చీమలు: పునరుత్పత్తి చేస్తాయి. గుడ్లు పెట్టి వాటిని సంరక్షించడం రాణి చీమల బాధ్యత.
మగ చీమ: రాణి చీమ పునరుత్పత్తికి సహాయం చేయడమే మగ చీమ విధి.
వర్కర్ (కార్మిక) చీమలు: గూడు కట్టడం, గూడు నిర్వహణ, ఆహారం, గుడ్లు- లార్వాల సంరక్షణ వీటి ప్రధాన బాధ్యత.
గార్డ్ (కాపలా) చీమలు: ఆవాసాన్ని రక్షించడం, దాడులను ఎదుర్కోవడం, ఇతర ఆవాసాలపై దాడి చేయడం వీటి పని.
ఒకే రాణితో ప్రారంభమయ్యే సంఘం కొన్ని వందల నుంచి, అనేక లక్షల చీమల వరకు పెరుగుతుందని ప్రియదర్శన్ వివరించారు.
ఇందులో రాణి మినహా మిగతా ఆడ చీమలేవీ పునరుత్పత్తి చేయలేవు. అవి తమ సమాజ ఎదుగుదలకు పూర్తిగా రాణిపైనే ఆధారపడతాయి. కాబట్టి, అవి ఆ రాణిని కోల్పోతే, తమ భవిష్యత్తును కోల్పోతాయి.
అందుకే యుద్ధ సమయంలో రాణిని, తమ తరువాతి తరాన్ని రక్షించడం కోసం ఒక చీమల కాలనీలోని కార్మిక, కాపలా చీమలన్నీ తమ ప్రాణాలకు తెగించి పోరాడతాయి.
ఎంతకైనా తెగిస్తాయి
ఇలాంటి మరో చీమల యుద్ధాన్ని హరియాణాలో చూశాం. అప్పుడు సాయంత్రం అవుతోంది. అప్పుడే అక్కడ చీమల మధ్య యుద్ధం మొదలైనట్లు ఉంది.
చీమల ఆవాసం ప్రవేశ మార్గం వద్ద దాడి మొదలైంది. ప్రత్యర్థులు లోనికి రాకుండా కాపలా చీమలు అడ్డుకుంటూ పోరాడుతున్నాయి. వాటిలో చాలా చీమలు చనిపోయాయి.
ఇంతలో, ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళ్లిన కార్మిక చీమలు, వెంటనే వెనక్కి తిరిగి తమ ఆవాసాల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఆహారం వెతుక్కుంటూ వెళ్లిన కార్మిక చీమలకు, అక్కడ దాడి జరిగిందనే విషయం ఎలా తెలిసిందన్న ప్రశ్న తలెత్తింది. చీమలకు ఉన్న అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికి కారణం అంటున్నారు డాక్టర్ బ్రోనోయ్ బైథియా.
చీమలు తమ కంటే తమ సంఘానికే అధిక ప్రాధాన్యతనిస్తూ పని చేసే గుణం కలిగి ఉంటాయి. అందుకే దండయాత్ర జరిగినప్పుడు, తమ ఆవాసాలను, రాణిని రక్షించేందుకు ప్రాణత్యాగం చేయడానికైనా తెగిస్తాయి.
చీమల కమ్యూనికేషన్..
సరే, ఇప్పుడు చీమలు ఎలా కమ్యూనికేట్ అవుతాయో, వాటి కమ్యూనికేషన్ భాష ఏంటో తెలుసుకుందాం.
చీమలకు యాంటెన్నా ఎందుకు ఉంటుంది?
చీమల శరీరంలో యాంటెన్నా అని పిలిచే కొండి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చీమల కళ్ల పైభాగంలో రెండు సన్నని పుల్లలాంటి నిర్మాణాలు తలలో నుంచి బయటకు పొడుచుకొని ఉంటాయి. వీటినే సెన్సరీ హార్న్స్ అని పిలుస్తారు.
ఈ యాంటెన్నా లేకుంటే, చీమల మనుగడ ఒక సవాలుగా మారుతుందని డాక్టర్ బ్రోనోయ్ చెప్పారు.
“చీమలు తమ శరీరం నుంచి ఫెరోమోన్స్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ సువాసనను గ్రహించడం ద్వారా, చీమలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. సహచరులను గుర్తిస్తాయి’’ అని ఆయన వివరించారు.
ఉదాహరణకు, ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లిన చీమకు అది మోయలేనంత ఆహారం దొరికితే, అక్కడ ఫెరోమోన్స్ రసాయనాన్ని విడుదల చేస్తుంది. అంటే అక్కడి నుంచి తమ ఆవాసం వరకు ఆ సువాసనను వెదజల్లుతుంది.
ఆ తర్వాత ఆవాసం నుంచి వచ్చే ఇతర చీమలకు ఈ రసాయనం ఒక జీపీఎస్ తరహాలో పనిచేస్తుంది.
ఈ కొండిని కోల్పోతే చీమలు దిక్కులు, మార్గాలు తెలుసుకోవడం తోటి చీమలతో కమ్యూనికేట్ చేయడం, ప్రమాదాలను పసిగట్టడం వంటి సామర్థ్యాలను కోల్పోతాయని బ్రోనోయ్ వివరించారు. సరళంగా చెప్పాలంటే, చీమల మనుగడకు ఈ కొండి అత్యవసరం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)