You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాస్టింగ్ కౌచ్ వివాదం: మలయాళ సినీ పరిశ్రమ గురించి మోహన్‌లాల్, టాలీవుడ్ గురించి సమంతా ఏమని స్పందించారంటే...
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ వివాదంపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, నటుడు మోహన్ లాల్ తొలిసారి స్పందించారు.
‘‘మలయాళ పరిశ్రమను నాశనం చేయవద్దు’’ అని ఆయన కోరారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదికను మోహన్ లాల్ స్వాగతించారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. దోషులకు శిక్ష పడుతుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు దర్యాప్తుకు సహకరిస్తారని ఆయన చెప్పారు. అలాగే త్వరలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొన్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇటీవలే బయటికి వచ్చింది. మహిళా ఆర్టిస్టులపై వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం వంటి దిగ్భ్రాంతికరమైన విషయాలతో కూడిన ఈ నివేదిక భారత సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.
"ఇలాంటి సంఘటనలు మొత్తం పరిశ్రమను నాశనం చేయడానికి దారి తీస్తాయి. ‘అమ్మ’పైనే మొత్తం దృష్టి పెట్టవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. దర్యాప్తు జరుగుతోంది.” అని మోహన్ లాల్ తెలిపారు.
“అసోసియేషన్‌లో కూడా విభేదాలు ఉన్నాయి, తగిన చర్యలు తీసుకుంటాం. త్వరలో ఎన్నికలు ఉంటాయి. ఇది ఏ రకంగానూ తప్పించుకోవడం కాదు. దయచేసి అసోసియేషన్‌పై అనవసర నిందలు వేయకండి. జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఆ నివేదికను విడుదల చేయడం సరైన నిర్ణయమే.’’ అని ఆయన అన్నారు.
దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిక్, ముఖేష్ సహా మలయాళ సినిమాలోని ప్రముఖ వ్యక్తులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొందరు మహిళా నటీనటులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ సహా, ఇతర ‘అమ్మ’ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
'కష్టపడి పనిచేసే పరిశ్రమ’
మొత్తం పరిశ్రమను నెగెటివ్‌గా చిత్రించవద్దని మీడియాను, ప్రజలను మోహన్ లాల్ కోరారు. మాలీవుడ్ చాలా కష్టపడి పనిచేసే చిత్ర పరిశ్రమ అని ఆయన అన్నారు.
"‘అమ్మ’ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదు. ఈ ప్రశ్నలు అందరినీ అడగాలి. ఇది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. ఇందులో చాలామంది ప్రమేయం ఉంది. కానీ అందరినీ నిందించకూడదు. చట్టాన్ని ఎవరి కోసం మార్చలేం. బాధ్యులకు శిక్ష పడుతుంది. పరిశ్రమను నాశనం చేయవద్దు.’’ అని అన్నారు.
‘‘విచారణ కచ్చితంగా జరుగుతుంది. ఉన్నపళంగా పరిష్కారం చూపలేం. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి సారిస్తున్నాం. ఒక్కసారిగా పేర్లు బయటకు వస్తున్నాయి. నిస్సహాయంగా ఉన్నాం. దర్యాప్తు ప్రక్రియకు సహకరిస్తాం. మేము ఇక్కడ ఉన్నది సమస్యలను సరిదిద్దడానికే." అని మోహన్ లాల్ అన్నారు.
టాలీవుడ్‌నూ తాకిన రిపోర్టు....సమంత స్పందన
మలయాళ సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారంపై ప్రముఖ నటి సమంత స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును బయట పెట్టాలని 'వాయిస్ ఆఫ్ విమెన్ సంస్థ' ప్రభుత్వాన్ని కోరగా, సమంతా ఆ ప్రకటనను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.
"తెలుగు సినీ పరిశ్రమలోని మహిళలమంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది. ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలకు మద్దతు కోసం 2019లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలి." అని ఆ ప్రకటనలో వాయిస్ ఆఫ్ విమెన్ కోరింది.
2017లో కేరళలో ఏర్పడిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థ సినీ పరిశ్రమలో లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది. స్త్రీలకు సమాన హక్కులు కల్పించేలా విధానపరమైన మార్పుల కోసం కృషి చేస్తోంది.
మలయాళ సినీ పరిశ్రమలో పని చేస్తున్న మహిళలతో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పడింది.
ఆ మాలీవుడ్ నివేదికలో ఏముంది?
మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరుతూ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) 2017లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మెమోరాండం సమర్పించింది. దీని తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రముఖ హీరోయిన్ మీద కారులోనే కొందరు అత్యాచారం చేయడంతో సినీ పరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం చేయాలంటూ డబ్ల్యూసీసీ సభ్యులు ఒక మెమోరాండం సమర్పించారు.
ఈ కమిటీలో నటి టి.శారద, కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి కేబీ వల్సల కుమారి ఉన్నారు.
కేరళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి హేమ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ మలయాళ సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ బాగా వేళ్లూనుకుపోయిందని పేర్కొంది.
ఆ కమిటీ రిపోర్టును కేరళ ప్రభుత్వం ఇటీవల బయటపెట్టింది.
సినీ పరిశ్రమలో వివిధ దశల్లో నియామకాల కోసం ‘కాంప్రమైజ్’, ‘అడ్జస్ట్‌మెంట్స్’ అనే పదాలను పాస్‌వర్డులుగా వాడుతున్నట్లు కమిటీ నివేదిక పేర్కొంది.
సినిమాల్లో అవకాశాలు కావాల్సిన మహిళలు అవసరమైనప్పుడు ఎవరితోనైనా సెక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలనేది ఈ రెండు పదాలకు అర్థం.
కొత్తగా సినిమాల్లోకి వచ్చే వాళ్లకు ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న వాళ్లు ఇచ్చే సంకేతం ఇది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ను ఇది తెలియజేస్తుంది.
దీన్ని అమలు చేసేందుకు ‘కోడ్ నెంబర్లు’ కూడా ఇస్తున్నారు.
44 పేజీలు కనిపించలేదు
జస్టిస్ కె. హేమ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించిన నాలుగున్నరేళ్ల తర్వాత కేరళ ప్రభుత్వం ఆ రిపోర్టును విడుదల చేసింది.
నివేదికలోని 290 పేజీల్లో 44 పేజీలు కనిపించలేదు. ఈ పేజీల్లో సినీ పరిశ్రమలో తమని వేధించిన వ్యక్తుల పేర్లను మహిళలు పేర్కొన్నారు.
నివేదిక నుంచి తొలగించిన మరో పేజీలో మహిళల్ని ఎలా వేధించారో, వారి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారో రాసి ఉంది.
“ముందు రోజు తనను వేధించిన వ్యక్తితోనే ఆ హీరోయిన్ తర్వాతి రోజు భార్యగా నటించాల్సి వచ్చింది. ఆమెను అతను బలంగా హత్తుకునే వాడు.”
“అది చాలా భయంకరమైన ఘటన. షూటింగ్ సమయంలో ఆమెకు ఎదురైన ఈ చేదు అనుభవం ఆమె మొహంలో కనిపించింది. దీంతో, ఒక్క షాట్ కోసం ఆమె 17 టేకులు తీసుకున్నారు. డైరెక్టర్ ఆమెను చాలా హీనంగా మాట్లాడారు.” అని నివేదిక తెలిపింది.
ఈ రిపోర్టు విడుదలైన తర్వాత హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపులను ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)