ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ ఏర్పాటు.. అసలు ఈ క్వాంటమ్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ అంటే ఏంటి?

వరల్డ్ క్వాంటం డే

ఫొటో సోర్స్, prof narayanan rao

ఫొటో క్యాప్షన్, ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ పరికరాలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

'వరల్డ్‌ క్వాంటమ్ డే'ను పురస్కరించుకుని ఏప్రిల్‌14న అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్‌లో క్వాంటమ్ కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ను సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్‌ బీబీసీకి తెలిపారు.

మంగళవారం ప్రారంభం కానున్న ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ గురించి బీబీసీకి ఐటీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా చాలాకాలం పాటు పనిచేసి, నెలరోజుల కిందట అటవీశాఖ అడిషనల్‌ పీసీసీఎఫ్‌ (అడ్మిన్‌ అండ్‌ ఐటీ)గా బదిలీ అయిన సుందర్‌ వివరించారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లో అమరావతి 1ఎస్, మేధా టవర్స్‌లో అమరావతి 1క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటమ్ టెస్టింగ్‌ రిఫరెన్సు ఫెసిలిటీలు ఏర్పాటు కానున్నాయని సుందర్‌ తెలిపారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ ఉన్న తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుందని ఆయన పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'క్వాంటమ్ కంప్యూటర్‌గానూ వాడొచ్చు'

'ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెండింటిని క్వాంటమ్ కంప్యూటర్స్‌గా వాడుకోవచ్చు. అదే సమయంలో రిఫరెన్స్‌ ఫెసిలిటీగానూ(టెస్ట్‌ బెడ్స్‌) వాడుకోవచ్చని' ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(రీసెర్చ్‌), ప్రొఫెసర్‌ నారాయణరావు బీబీసీతో అన్నారు.

క్యూబీటెక్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్‌ బెడ్‌లు, క్వాంటమ్ హార్డ్‌ వేర్‌ తయారీలో కీలకం కానున్నాయని ప్రొఫెసర్‌ నారాయణరావు తెలిపారు.

మైనస్‌ 273 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటమ్ కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్‌లు, క్వాంటమ్ కంప్యూటర్లలో ఉపయోగించే వివిధ పరికరాలను టెస్ట్‌ చేసేందుకు ఉపయోపడతాయని చెప్పారు.

''క్వాంటమ్ సబ్‌ సిస్టమ్స్‌ టెస్ట్‌ చేసేందుకు దేశంలో ఎక్కడా ఈ సౌకర్యం లేదు. ఇప్పుడు అమరావతిలో నెలకొల్పుతున్న ఈ బెడ్స్‌ ద్వారా, ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్‌గా వాడుకోవచ్చు. సబ్‌సిస్టమ్స్‌ను, కాంపోనెంట్స్‌ను టెస్ట్‌ చేసుకోవచ్చు.

క్వాంటమ్ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ అల్గారిథమ్స్‌తో పాటు హార్డ్‌వేర్‌ తయారీలోనూ ఇక్కడ పరీక్షలు, పరిశోధనలు జరుగుతాయి. ఇక్కడ పరీక్షించిన క్వాంటమ్ కంప్యూటింగ్‌ పరికరాలకు సర్టిఫికేషన్‌ ఇచ్చేలా ఈ టెస్ట్‌ ఫెసిలిటీలను సిద్ధం చేశారు'' అని నారాయణ రావు తెలిపారు.

ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ పరికరాలు

ఫొటో సోర్స్, prof narayanan rao

ఫొటో క్యాప్షన్, ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ పరికరాలు

క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేలా

క్వాంటమ్ కంప్యూటర్‌ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఓపెన్‌ యాక్సెస్‌ రిఫరెన్స్ టెస్ట్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేశారని నారాయణరావు చెప్పారు.

క్వాంటమ్ కంప్యూటింగ్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేలా ఓపెన్‌ యాక్సెస్‌ రిఫరెన్స్ ఫెసిలిటీగా దీన్ని తీర్చిదిద్దారని తెలిపారు. మొత్తంగా క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం అవసరమైన ఎకోసిస్టం, అమరావతిలో సిద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్స్ ఫెసిలిటీ

అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారని నారాయణ రావు వెల్లడించారు.

''ఈ క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సహా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, డీఆర్డీఓ వంటి సంస్థలు సహకారం అందించాయి. దేశీయంగానే తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్‌ టెస్ట్‌ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వస్తుంది'' అని నారాయణరావు తెలిపారు.

ప్రొఫెసర్ నారాయణ రావు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ నారాయణ రావు

సాధారణ కంప్యూటర్‌కు, క్వాంటమ్ కంప్యూటర్‌కి తేడా ఏమిటంటే..

''సాధారణ కంప్యూటర్లకు ఏదైనా ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేయాలంటే చాలా సమయం పడుతుంది. క్వాంటమ్ కంప్యూటర్‌ చాలా వేగంగా రియాక్ట్‌ అవుతుంది. ఉదాహరణకు ఒక డ్రగ్‌ తయారీలో కొన్ని మిలియన్స్‌ మూలిక్యులర్స్‌ను స్క్రీన్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సాధారణ కంప్యూటర్‌కు ఇందుకు కొన్ని నెలలు పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్‌ కేవలం 20 రోజుల్లోనే ఈ పని చేస్తుంది. అలాగే పవర్‌ గ్రిడ్లను స్టేబుల్‌ చేయాలంటే మామూలు కంప్యూటర్‌ కంటే క్వాంటమ్ కంప్యూటర్‌ అత్యంత వేగంగా చేయగలదు'' అని విశాఖ రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓ నరేష్‌ బీబీసీకి తెలిపారు.

క్వాంటమ్ కంప్యూటింగ్‌ అంటే ఏమిటి?

''సాంప్రదాయ కంప్యూటర్లు బిట్స్‌ (0,1) ఆధారంగా పనిచేస్తే, క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్‌ ఉపయోగిస్తాయి.100కి పైగా క్యూబిట్స్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి. దీని వల్ల క్లిష్ట గణనల్ని వేగంగా పరిష్కరించగలవు. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఔషధ పరిశోధన వేగవంతమవుతుంది. ఆర్థిక రంగంలో రిస్క్‌ విశ్లేషణలు సాధ్యమవుతాయి. సైబర్‌ భద్రతలో మెరుగుదల చూపించొచ్చు. వాతావరణ మార్పులను వేగంగా పసిగట్టవచ్చు'' అని నరేష్‌ తెలిపారు.

కరెంటు వినియోగం ఎక్కువే కానీ..

క్వాంటమ్ కంప్యూటర్లకు కరెంటు వినియోగం చాలా ఎక్కువనే మాట నిజమే కానీ సాంకేతికత పెరిగే కొద్దీ కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చని నారాయణ రావు తెలిపారు.

'డైమండ్‌ క్యూబిక్స్‌, ఫిలికాన్‌ క్యూబిక్స్‌ రెండుమూడేళ్లలో డెవలప్‌ అవుతాయి. అప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు కూడా మామూలు కంప్యూటర్ల మాదిరే రూం టెంపరేచర్‌లోనే పనిచేసే అవకాశం ఉంటుంది. దాంతో వవర్‌ కన్సంప్షన్‌ ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది' అని ఆయన వివరించారు.

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుందర్‌
ఫొటో క్యాప్షన్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుందర్‌

క్వాంటమ్ కంప్యూటింగ్‌ పాలసీలో భాగంగానే..

అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేసింది. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద సుమారు 50 ఎకరాల్లో టెక్నాలజీ పార్క్‌, క్వాంటమ్ కంప్యూటింగ్‌ ల్యాబ్స్‌ ఏఐ, సెమీకండక్టర్‌ పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం క్వాంటమ్ కంప్యూటింగ్‌ పాలసీ 2025-30ని కూడా విడుదల చేసింది.

గత ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ డిక్లరేషన్‌ను ప్రకటించారు.

''నూతన ఔషధాల ఆవిష్కరణ, సంక్లిష్ట వ్యాధులకు వ్యాక్సీన్ల ఉత్పత్తిలో వేగం, వెదర్‌ మోడలింగ్, లాజిస్టిక్స్‌ రంగాల్లో డేటా అనలిటిక్స్, రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో కీలకమైన పరిశోధనలు చేసి అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా మార్చడమే మా లక్ష్యం' అని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుందర్‌ బీబీసీకి వివరించారు.

'పూర్తిస్థాయి ప్రయోజనాలకు టైం పడుతుంది'

''ఈ రెండు క్వాంటమ్ కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌తో అప్పుడే అద్భుతాలు జరిగిపోతాయని చెప్పలేం. పూర్తిస్థాయిలో వీటి ఫలితాలు రావాలంటే ఇప్పుడు పక్కాగా మొదలు పెడితే ఇంకా ఐదారేళ్లు పడుతుంది.

ఉపాధి అవకాశాలు పెద్దసంఖ్యలో రావాలంటే కనీసం నాలుగైదు ఏళ్లు పడుతుంది. ఎకో సిస్టమ్ పూర్తయి, అమరావతి నగరం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

ఈ రెండు క్వాంటమ్ టెస్ట్‌ బెడ్స్‌ను రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలకు కనెక్ట్‌ చేస్తేనే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది'' అని ఓ నరేష్‌ అభిప్రాయపడ్డారు.

రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓ నరేష్‌
ఫొటో క్యాప్షన్, రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరేష్‌

వాటి పాత్ర చాలా నామినల్: వైసీపీ

కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్‌ టెస్ట్‌ బెడ్స్‌ కేవలం అకడమిక్ పరంగా తప్ప రియల్ టైమ్ అప్లికేషన్స్‌కు పనికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని బీబీసీకి ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న వైసీపీ విశాఖ ఐటీ డిజిటలైజేషన్‌ ఇన్‌చార్జి కె. శ్రీనివాసరావు చెప్పారు.

'ఇవి చాలా నామమాత్ర పాత్ర పోషిస్తాయి. ఈ సెక్టార్‌లో ఎంప్లాయిమెంట్ ప్రపంచవ్యాప్తంగానే చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే 30,000 మంది హైలీ స్కిల్డ్ లేబర్‌ ఈ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. 2030కి ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది అవసరమని అంచనా. ఈ నేపథ్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్న పరిస్థితి లేదు' అని ఆయన అభిప్రాయపడ్డారు.

'రెండు టెస్ట్‌ బెడ్స్‌తో ఏం జరిగిపోదు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ పాలసీని బయటపెడితే అసలు ప్రభుత్వానికి ఈ రంగంలో ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది'' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఐటీ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్ విజయభాస్కర్‌రెడ్డి బీబీసీతో అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)