టిల్లు: తిహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ మర్డర్ ఎలా జరిగింది...ఈ జైల్లో ఇంకా ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి?

సెప్టెంబర్ 24, 2021. కోర్ట్ రూమ్: 207, రోహిణి కోర్టు కాంప్లెక్స్, దిల్లీ

గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మాన్ గోగిని కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో కోర్టు హాలులో చాలా మంది న్యాయవాదులున్నారు.

విచారణ ప్రారంభం కావడానికి కాస్త ముందు, నల్లకోట్లు వేసుకుని న్యాయవాదులు లాగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు పిస్టల్స్ బయటికి తీసి, గోగిపై కాల్పులు జరిపారు.

దీంతో కోర్టు రూమ్ బయట, లోపల తొక్కిసలాట చోటు చేసుకుంది. దిల్లీ పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. మొత్తం 27 బుల్లెట్లు పేలిన తర్వాత జితేంద్ర మాన్ గోగి, ఆయనపై కాల్పులు జరిపిన దుండగులు మరణించారు.

దేశ రాజధాని దిల్లీలో కోర్టు కాంప్లెక్స్‌లోనే గ్యాంగ్‌స్టర్ హత్య జరగడం, ఆ సమయంలో తీవ్ర భయాందోళన కలిగించింది. ఆ సమయంలో కోర్టులో 68 ఇతర కేసుల విచారణ జరుగుతోంది.

మే 2, 2023. భవనం గ్రౌండ్ ఫ్లోర్, జైల్ నెంబర్. 8, తిహార్ జైలు, దిల్లీ

‘‘గ్యాంగ్‌స్టర్ సునీల్ బాలాయన్ అలియాస్ టిల్లు తాజ్‌పురియాపై ఉదయం 6 గంటలకు దాడి జరిగినప్పుడు ఆయన తిహార్ జైలులోని తన గదిలో ఉన్నారు.’’ అని దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

నిందితులు బెడ్ షీట్లను తాడులాగా కట్టి మొదటి అంతస్తులోని తమ బరాక్స్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు దిగారు. కేవలం 15 నిమిషాల్లోనే టిల్లు తాజ్‌పురియాను 90 చోట్ల గాయపరిచారు. ఇనుప చువ్వలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

టిల్లు అరవడాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీ గార్డులు, రక్తం మడుగులో ఉన్న టిల్లును వెంటనే తిహార్ జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది.

టిల్లు తాజ్‌పురియా హత్య వెనుక రోహిణి కోర్టు ప్రాంగణంలో జితేంద్ర గోగిని దాడి చేసి హతమార్చిన కోణం ఉందని ఆరోపణలున్నాయి.

జితేంద్ర గోగి మరణానికి ప్రతీకారంగా ఇప్పుడు తిహార్‌ జైలులో టిల్లు తాజ్‌పురియాను చంపేశారని అంటున్నారు.

ప్రస్తుతం తప్పించుకుని కెనడాలో దాక్కున్న జితేంద్ర గోగి అనుచరుడైన గోల్డీ బ్రార్ ఈ దాడికి తానే బాధ్యుడని అంగీకరించారు. ఫేస్‌బుక్ పోస్టులో ఈ విషయాన్ని తెలిపారు.

అయితే ఈ ఫేస్‌బుక్ అకౌంట్ గోల్డీ బ్రార్‌దా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

‘‘గోగి హత్యకు ప్రతీకారం’’ అంటూ చెబుతూ నలుగురు వ్యక్తుల్ని గోల్డీ బ్రార్ పొగిడారు. ఆ నలుగుర్ని పోలీసులు గుర్తించారు.

హత్యపై పలు ప్రశ్నలు

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలులో బహిరంగంగా ఈ హత్య జరగడంపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

మొదటి ప్రశ్న

దశాబ్దానికి పైగా టిల్లు, గోగి గ్యాంగ్‌ల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు జైలులో ఈ రెండు గ్యాంగ్‌లకు చెందిన వారిని అంత దగ్గరగా ఉంచారు?

టిల్లు, గోగి ఇద్దరూ కూడా దిల్లీ యూనివర్సిటీకి చెందిన వారు. శ్రద్ధానంద కాలేజీ ఎన్నికల్లో తొలిసారి వీరి మధ్య వివాదం నెలకొంది.

రెండు వారాల క్రితమే తాజ్‌పురియాను మండోలి జైలు నుంచి తిహార్‌కి తరలించారు.

రెండో ప్రశ్న

వార్డులో డజన్ల కొద్ది సీసీటీవీ కెమెరాలున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుంది.

అయినప్పటికీ గోగి గ్యాంగ్ సభ్యులు ఎలా ఇనుప చువ్వలను విరగొట్టారు. సెక్యూరిటీ ఎందుకు కనుగొనలేదు? వీటిని కత్తిరించే పరికరాలు వీరి దగ్గరికీ ఎలా వచ్చాయి?

మూడో కీలకమైన అనుమానం

15 నిమిషాల పాటు నిందితులు టిల్లుపై దాడి చేస్తున్నప్పుడు, కనీసం ఒక్క గార్డు లేదా వాచ్‌మెన్ వద్ద కూడా ఆయుధం లేదా? ఎందుకు గార్డులకు అంత సమయం పట్టింది?

‘‘క్రిమినల్ లేదా గ్యాంగ్‌స్టర్లు జైలుకు వచ్చి, మళ్లీ వారి గ్యాంగ్‌లలో చేరినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు నిరాశ్రయులుగా మారిపోతున్నారు’’ అని దిల్లీ పోలీసు ఏసీపీ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు పొందిన రాజ్‌బిర్ సింగ్ చాలా ఏళ్ల క్రితమే చెప్పారు.

తిహార్‌ జైలులో హత్యలు

దిల్లీ తిహార్ జైలు అంతకుముందు నుంచే బాగా పాపులర్. ప్రస్తుతం ఈ హత్యల వల్ల మరింతగా వార్తల్లోకెక్కింది. గత నెలలో గ్యాంగ్‌స్టర్ ప్రిన్స్ తెవతియా తిహార్‌ జైలులో హత్యకు గురయ్యారు. కత్తి లాంటి దానితో ఎనిమిది సార్లు దాడి చేసిన గుర్తులను ఆయన శరీరంపై గుర్తించారు.

దిల్లీ తిహార్ జైలులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లు సొంతంగా తమ గ్యాంగ్‌లను నిర్వహిస్తున్నారని ప్రింట్ న్యూస్ వెబ్‌సైట్ 2021లో రిపోర్ట్ చేసింది.

2021లో తిహార్ జైలు లోపలే గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జర్ మృతదేహం దొరికింది. సీబీఐ విచారణలో జైలు అధికారిపై అభియోగాలు నమోదు చేశారు.

‘‘వ్యవస్థ నుంచి అవినీతిని తొలగించనంత వరకు ఇలాంటి కేసులు జరుగుతూనే ఉంటాయి’’ అని ఐపీఎస్ మాజీ అధికారి యశోవర్ధన్ ఆజాద్ చెప్పారు.

‘‘జైలులో సంపన్న ఖైదీలకు సాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తోన్న ఉద్యోగులను, అధికారులను ఎంత మందిని సస్పెండ్ చేసిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఏమవుతుంది? తక్కువ శిక్ష లేదా జరిమానా లేదా సస్పెన్షన్ విధిస్తున్నారు. లేదంటే బదిలీ చేస్తారు అంతే కదా. ఆ తర్వాత మళ్లీ వారు ఇలానే చేస్తారు’’ అని అన్నారు.

బీబీసీ ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ తిహార్ జైలు డైరెక్టర్ జనరల్(జైళ్ల) సంజయ్ బెనివాల్ స్పందించలేదు. కానీ, ఈయన కార్యాలయం దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీలోని మూడు జైళ్ల నుంచి 348 మొబైల్ ఫోన్లను, వాటి ఛార్జర్లను సీజ్ చేసినట్లు అదే నెలలో సంజయ్ బెనివాల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)