మూడు రాజధానులలో ఎక్కడా గెలవని వైసీపీ, ఇక అమరావతే ఏకైక రాజధానా?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది..? నిన్నమొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లుగా భావించవచ్చు. ఆ సమాధానమే.. అమరావతి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చింది.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నారు.

ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుండటంతో రాజధానిగా అమరావతి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనే ఆశతో ఉన్నట్టు ఉద్యమించిన వారు చెబుతున్నారు.

ఉద్యమ నాయకులు ఏం అంటున్నారు?

అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రతిఫలం దక్కనుందని అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు చెబుతున్నారు .

దాదాపు 1632 రోజులుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు కొందరు ఉద్యమిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కచ్చితంగా అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకురాలు కొమ్మినేని వరలక్ష్మి బీబీసీతో చెప్పారు .

‘‘అమరావతి పరిరక్షణ కోసం చేసిన ఉద్యమం కారణంగా ఎన్నో నిర్బంధాలు అనుభవించాం. అయినా.. ఆత్మవి‌శ్వాసం కోల్పోకుండా ఉద్యమం సాగించాం. న్యాయస్థానాలకు వెళ్లి అనుమతులు తెచ్చుకుని ఉద్యమాలు చేశాం. ఇప్పుడు మా త్యాగానికి, ఉద్యమానికి ప్రతిఫలంగా ప్రజలే తీర్పు ఇచ్చారు ’’అని చెప్పారు వరలక్ష్మి.

మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పింది?

అమరావతి రాజధాని నిర్మాణానికి 2015 అక్టోబరు 22న శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది.

‘‘తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు, రహదారులు.. అన్నింటికి పునర్వైభవం తీసుకువస్తాం’’ అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటించారు.

అమరావతి పరిధిలో ఫలితాలు ఎలా వచ్చాయంటే..

అమరావతి రాజధాని ఉన్న ప్రాంతం.. సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక్క సీటును కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది.

ముఖ్యంగా తుళ్లూరు ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ 39,606 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఆయన మొత్తం 1,09,585 ఓట్లు దక్కించుకున్నారు.

గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు.

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

నరసరావుపేట నుంచి పోటీ చేసి కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయులు 1,59,729 ఓట్లతో గెలిచారు.

విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని శివనాథ్ (చిన్ని) 2,82,085 ఓట్లతో విజయం సాధించారు.

బాపట్ల నుంచి తెన్నేటి క్రష్ణప్రసాద్ 2,08,031 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మరోవైపు, రాజధానులు పెడతామన్న విశాఖపట్నం, కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థులు గెలవలేదు.

అమరావతి ఉద్యమం ఆపేస్తున్నారా?

నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన వారు ఉద్యమం చేస్తున్నారు. టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.

గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనలను నిలిపివేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ విషయంపై కొమ్మినేని వరలక్ష్మి.. బీబీసీతో స్పందించారు.

‘‘సీఆర్డీఏ చట్టం కాలపరిమితి అయిపోయింది. దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అసైన్డ్ భూములకు కౌలు చెల్లింపులు, పెండింగులో ఉన్న బకాయిల చెల్లింపు, డెవలప్ చేసిన ప్లాట్ల కేటాయింపు.. తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం హామీ ఇస్తుందని అనుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు నిరసన పూర్తిగా నిలిపివేస్తామని కాదు గానీ, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా మా సమస్యలను ప్ర‌‍భుత్వంతో చర్చించి నిరసన విరమిస్తాం’’ అని ఆమె చెప్పారు.

రెండేళ్లుగా కౌలు అందకపోవడంతో..

గత ఐదేళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

రెండేళ్లుగా ప్రభుత్వం ‌‍ఇస్తానని చెప్పిన కౌలు కూడా నిలిచిపోయిందని చెబుతున్నారు రైతులు. వీరి నుంచి ప్రభుత్వం సీఆర్డీఏ ఆధ్వర్యంలో 33,771 ఎకరాలు సేకరించింది. మొత్తంగా 29,771 మంది భూములు ఇచ్చారు.

వీరు ఇచ్చిన భూమి ఆధారంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ‌‍ఉంది. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ ఆరె శివారెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘ఒక చట్టంలోని నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘించింది. రెండేళ్లుగా మాకు ఇస్తామని చెప్పిన కౌలు ఇవ్వలేదు. అంతకుముందు కూడా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటేనే కౌలు చెల్లించేవారు. అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిపై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎత్తివేయాలి. రైతులకు రూ.350-400 కోట్లు కౌలు బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించి రైతులను ఆదుకోవాలి. మళ్లీ అమరావతిలో నిర్మాణాలు, పనులు ప్రారం‌‍భమవుతాయన్న నమ్మకం వచ్చింది’’ అని ఆయన చెప్పారు.

అంచనా ఎంత, ఖర్చు ఎంత?

అమరావతి రాజధానిని పదేళ్ల కిందట డిజైన్ చేసినప్పుడు.. దశల వారీగా 2050 నాటికి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రణాళికలను తయారు చేసింది అప్పటి ఏపీ ప్రభుత్వం.

దీనికి రూ.1,09,023 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది.

మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ఫ్లాట్లు ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు రూ.52,837 కోట్లు అవుతుందని లెక్కగట్టింది.

సీఆర్డీఏ లెక్కల ప్రకారం 2019 నాటికి రూ.42,170 కోట్లు విలువజేసే పనులు చేయడానికి టెండర్లు పిలిచారు.

మొత్తంగా రూ.10వేల కోట్లు ఖర్చు చేసినట్లు 2019లో ప్రభుత్వం ప్రకటించింది.

అప్పట్లో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు.. ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైన్లు రూపొందించింది.

వీటిని తిరిగి కొనసాగిస్తారా.. లేదా కొత్తగా డిజైన్లు రూపొందించి నిర్మా‌‍ణాలు చేపడతారా? అన్నది కొత్త ప్ర‌భుత్వం నిర్ణయించాల్సి ఉంది.

‘‘అమరావతిలోని కట్టడాలు, ప్రణాళికలపై ప్రభుత్వం త్వరలోనే సమీక్షిస్తుంది. మా ప్రభుత్వ ప్రాధాన్యాలలో అమరావతి కచ్చితంగా ఉంటుంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు రేట్ల ప్రకారం ఖర్చు కొంతమేర పెరుగుతుంది. త్వరలోనే అన్నింటిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది’’ అని కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు బీబీసీతో చెప్పారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో ఏం జరిగిందంటే?

అమరావతి పరిధిలో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో ‌భాగంగా వైసీపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసింది.

50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.

అలాగే భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను 2,500 రూపాయల నుంచి 5,000కు పెంచుతూ 2024 ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది.

‘‘అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ.. అక్కడి ప్రజలకు ఇతరత్రా ప్రయోజనాలు ఇస్తే తమవైపు తిప్పుకోవచ్చని భావించింది. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు, మిగిలిన ప్రజానీకంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది’’ అని సీనియర్ జర్నలిస్టు నర్సిం‌హారావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని ముఖ్య సంఘటనలు

2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

2019 డిసెంబర్ 18 నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు.

2019 డిసెంబర్ 27న అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడంగ్ జరిగిందని, భూములపై విచారణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

4,075 ఎకరాలు టీడీపీ నాయకులు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని మంత్రులు ఆరోపించారు.

2020 ఫిబ్రవరి 3న అమరావతి భూములపై విచారణకు ఈడీ రంగంలోకి దిగింది. అదే నెల 20న అమరావతి భూములలో అక్రమాలు జరిగాయని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

2020 జులై 31న సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

2020 ఆగస్టు 4న 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే.

2020 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు అయిన సందర్బంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోట రైతుల పూజలు.

2021 జనవరి 19న అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పెట్టిన కేసులు కొట్టేసిన హైకోర్టు.

2021 జులై 30న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం.

సెప్టెంబరు 2న దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురిపై పెట్టిన ఇన్ సైడర్ ట్రేడింగ్, ఏసీబీ కేసులు కొట్టివేసిన హైకోర్టు.

2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం.

నవంబర్ 22న గతంలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుని, మెరుగైన బిల్లు తీసుకువస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన.

2022 మార్చి 3న మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు సరికాదని హైకోర్టు తీర్పు, ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశం.

ఇదిలా ఉంటే, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

‘‘అమరావతిని మాత్రమే రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ నిర్మాణపు పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలంటూ 3 మార్చి, 2022లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం కోరుతున్నాం’’అని సుప్రీం కోర్టులోని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం 2022 నవంబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)