హమాస్ దాడి - ఇజ్రాయెల్: ‘నాలుగైదు గంటలపాటు హర్రర్ మూవీని తలపించింది’.. మ్యూజిక్ ఫెస్టివల్‌లో 260 శవాలు

    • రచయిత, ఫ్రాన్సెస్కా గిల్లెట్
    • హోదా, బీబీసీ న్యూస్

యూదుల పండుగ సుక్కోట్‌తో పాటు సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కోసం సంగీత ప్రియులంతా వారాల తరబడి ఎదురుచూశారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక ఎడారిలో సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

‘‘కుటుంబం అంతా మళ్లీ కలుసుకునే సమయం వచ్చింది. ఇది ఎంత సరదాగా ఉండబోతుందో.. ’’ అంటూ ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో నిర్వాహకులు పేర్కొన్నారు.

కానీ, ఇప్పుడు ఆ సోషల్ మీడియా పేజీలు చూస్తే తమ ప్రియమైన వారి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వారు పెడుతున్న బాధాకరమైన సందేశాలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌పై భారీ ఆకస్మిక దాడిలో భాగంగా పాలస్తీనా మిలిటెంట్లు, ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

ఈ సంగీత కార్యక్రమం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు 260కి పైగా మృతదేహాలు లభించినట్లు రెస్క్యూ ఏజెన్సీ ‘జాకా’ వెల్లడించింది.

రాకెట్ల దాడిని హెచ్చరించే సైరన్ తెల్లవారుజామున మోగినప్పుడే ఏదో కీడు జరిగిందని అనిపించిందని మ్యూజిక్ పార్టీలో పాల్గొన్న ఓర్టెల్ అనే మహిళ చెప్పారు.

రాకెట్ల దాడులు మొదలైన వెంటనే తుపాకీ కాల్పులు కూడా ప్రారంభమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

‘‘వారు కరెంట్‌ను నిలిపేసి, ఎక్కడి నుంచో అకస్మాత్తుగా లోపలికి వచ్చి వెంటనే కాల్పులు మొదలెట్టారు. లోపల ప్రతీ దిశలో కాల్చారు’’ అని ఇజ్రాయెల్‌కు చెందిన చానల్‌ 12తో ఓర్టెల్ చెప్పారు.

‘‘మిలిటరీ యూనిఫామ్‌లు ధరించిన 50 మంది టెర్రిరిస్టులు, వ్యాన్లలో వచ్చారు’’ అని ఆమె తెలిపారు.

అక్కడి నుంచి పారిపోవడానికి అందరూ ప్రయత్నించారని అన్నారు.

ఇసుకలో పరిగెత్తుకుంటూ వచ్చి కార్లలో అక్కడి నుంచి బయటపడాలని అనుకున్నారని చెప్పారు.

కానీ, తుపాకులు పట్టుకున్న ముష్కరులు జీపుల నిండా ఉన్నారని, వారు కార్లపై కాల్పులు జరిపారని చెప్పారు.

‘‘వాళ్ల కాల్పులకు వాహనాలను వదిలేసి అందరూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తడం మొదలుపెట్టారు. నేను ఒక చెట్ల పొదలోకి వెళ్లి దాక్కున్నా. గాయపడిన వారు గుట్టలుగా పడిపోవడం నేను చూశాను. చెట్ల పొదల్లోంచి అక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను’’ అని ఆమె వివరించారు.

మ్యూజిక్ ఫెస్టివల్ జరిగే ప్రదేశంలో మూడు స్టేజీలు.. ఒకటి క్యాంపింగ్ ఏరియా, రెండు బార్, మూడు ఫుడ్‌ ఏరియా ఉన్నాయి.

కిబ్బుజ్ రీమ్ సమీపంలోని నెగెవ్ ఎడారిలో ఈ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ ప్రదేశం గాజా స్ట్రిప్‌కు దగ్గరగానే ఉంటుంది.

ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి గాజా స్ట్రిప్‌ను తెల్లవారుజామున దాటుకొని వెళ్లిన హమాస్ ఫైటర్లు.. గ్రామాలు, పట్టణాల్లో చొరబడి పదుల సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు.

ఆ ఏరియాలో రాకెట్ పడే అవకాశం ఉందనే అవగాహన పార్టీకి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఉందని, కానీ తుపాకీ కాల్పులు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయని హారెట్జ్‌తో ఆడమ్ బారెల్ చెప్పారు.

ఆయన కూడా మ్యూజిక్ పార్టీలో పాల్గొన్నారు.

చాలా మంది చేసినట్లుగానే, తాను కూడా కారులో తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

కానీ, కార్లపై కాల్పులు జరుపుతుండటంతో దాన్నుంచి దిగి పరిగెత్తినట్లు ఆయన తెలిపారు.

‘‘ప్రజల్ని కొట్టారు. తలో దిక్కుకు పారిపోయారు. మేం దాక్కున్నాం’’ అని ఆయన అన్నారు.

తాను డ్రైవ్ చేస్తున్న కారు మరో కారుని ఢీకొందని ఎస్తెర్ బ్రోచోవ్ రాయిటర్స్‌కి తెలిపారు. మరో కారును నడుపుకుంటూ వెళ్తున్న ఒక యువకుడిని తాను చూశానని, అతను తనని కారులోకి వచ్చేయమన్నాడని చెప్పారు. వెంటనే అతని కారులోకి వెళ్లినట్లు తెలిపారు.

కానీ, అతన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారని కన్నీరు పెట్టుకున్నారు. మరణించినట్లు నటించానని, చివరికి ఇజ్రాయెల్ సైన్యం తనని రక్షించిందని అన్నారు.

‘‘నా కాళ్లను కూడా కదపలేకపోయాను. సైనికులు వచ్చి, మమ్మల్ని కాల్పుల నుంచి రక్షించేందుకు పొదల్లోకి తీసుకెళ్లారు’’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చెప్పారు.

మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిన ఓర్టెల్ లాంటి చాలా మంది దగ్గర్లోని పొదల్లో, పండ్ల తోటల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఇజ్రాయెల్ సైనికులు వచ్చి, వారిని రక్షిస్తారనే ఆశతో గంటల తరబడి అక్కడే ఎదురుచూశారు.

‘‘నా ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టి, మెల్లగా బత్తాయి తోటలోకి పాక్కుంటూ వెళ్లి దాక్కున్నాను. ’’ అని ఓర్టెల్ చెప్పారు.

‘‘వారు చెట్టు చెట్టు వద్దకు వెళ్లి, కాల్పులు జరుపుతున్నారు. ఆ సమయంలో నా చుట్టుపక్కలున్న వారంతా చనిపోవడం చూశాను. కానీ, పంటి దిగువనే నా కన్నీటినంతా ఆపుకుని, నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది. నేను ఏడవలేదు. స్తబ్దుగా ఉండిపోయాను’’ అని పండ్ల తోటలోకి వెళ్లి తానెలా ప్రాణాలు రక్షించుకున్నానో గిలి యోస్కోవిచ్ బీబీసీకి వివరించారు.

ఆ తర్వాత మూడు గంటలకి, ఇజ్రాయెల్ సైనికుల మాటలను తాను విన్నానని, దీంతో వెంటనే వారి వద్దకు పరిగెత్తినట్లు వెల్లడించారు.

‘‘అక్కడ నాలుగైదు గంటల పాటు ఒక హర్రర్ మూవీ తలపించింది. మేం పిచ్చిపట్టిన వారిలా పరిగెత్తాం. ఎలా, ఎటు పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెత్తాం ’’ అని మరో ప్రత్యక్ష సాక్షి ఛానల్12కి తెలిపారు.

‘‘ఇదొక పెద్ద ఊచకోత’’ అని పార్టీలో ఎమర్జెన్సీ మెడిక్‌గా సేవలందించేందుకు వచ్చిన యనీవ్ వర్ణించారు.

‘‘నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇది ప్రణాళికబద్ధంగా జరిగిన భారీ ఆకస్మిక దాడి. ఎమర్జెన్సీ దారుల నుంచి ప్రజలు బయటికి రాగానే, అక్కడ ఉగ్రవాదులకు చెందిన బలగాలు వారి కోసం వేచిచూస్తున్నాయి. వారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు’’ అని పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్ కాన్ న్యూస్‌కి ఆ రోజు నాటి సన్నివేశాన్ని వివరించారు.

‘‘ఆ ఈవెంట్‌లో 3 వేల మంది ఉన్నారు. వారికి అది తెలిసే ఉంటుంది. వారికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉండే ఉంటుంది’’ అని అన్నారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం తప్పిపోయిన ఆత్మీయుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. జర్మన్ పర్యటకురాలు షాని లౌక్ అనే అమ్మాయి కిడ్నాప్ అయిందని, తనను కాపాడాలంటూ ఆమె తల్లి అభ్యర్థిస్తున్నారు.

25 ఏళ్ల నోవా అర్గమణి అనే మరో మహిళను కూడా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి అపహరించారని ఆమె కుటుంబం, స్నేహితులు చెబుతున్నారు.

తాను దాక్కున్న దగ్గర్నుంచి మెసేజ్ చేసిందని నోవా స్నేహితుడు అమిత్ పర్పారా బీబీసీకి చెప్పారు.

‘‘ఆమె దగ్గర్నుంచి సుమారు 8.30 గంటల ప్రాంతంలో చివరి మెసేజ్ వచ్చింది’’ అని తెలిపారు.

ఆ తర్వాత తనని బంధించి తీసుకెళ్తోన్న వీడియో సోషల్ మీడియాలో చూశామన్నారు.

‘‘ఆమెను మోటార్‌సైకిల్‌పై లాక్కెళ్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్‌ నుంచి లాక్కెళ్లి తీసుకెళ్తున్నారు’’

అమెరికా-ఇజ్రాయెల్‌కు చెందిన 23 ఏళ్ల హెర్ష్ గోల్బెర్గ్-పోలిన్ తల్లిదండ్రులు కూడా తమ కొడుకు కోసం వెతుకుతున్నారు. ఆ యువకుడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తర్వాత అక్కడకి వెళ్లారు.

శనివారం ఉదయం అతని నుంచి రెండు షార్ట్ మెసేజ్‌లు వచ్చాయని, ఒకటి.. ‘‘ఐ లవ్ యూ’’, రెండు ‘‘ఐ యామ్ సారీ’’ అని తల్లిదండ్రులు చెప్పారు.

ఈ ఆకస్మిక దాడులు ప్రారంభమైన తర్వాత సుమారు 600 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలటెంట్ల మధ్య భీకర పోరు కొనసాగుతోంది.

ఇదే సమయంలో గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం కూడా వైమానిక దాడులు చేపట్టింది.

ఈ దాడుల్లో సుమారు 413 మంది మరణించారని పాలస్తీనా అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)