ఇజ్రాయెల్: 'పాలస్తీనా మిలిటెంట్లు మా ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే మా ఇద్దరు పిల్లలతో నేను ఓ గదిలో దాక్కున్నాను'

ఇజ్రాయెల్-గాజా సరిహద్దు ప్రాంతాల నుంచి న్యూస్ స్టేషన్లకు ఒక్కసారిగా ఫోన్లు రావడం మొదలైంది. పాలస్తీనా మిలిటెంట్లు మెరుపు దాడులు చేస్తున్నారని, ఇళ్లలోనే చిక్కుకుపోయామని చెప్పడానికి ప్రజలు మీడియాను సంప్రదించారు.

ఇజ్రాయెల్‌పై 20 నిమిషాల్లో 5,000 రాకెట్లతో దాడులు చేసిన హమాస్, అదేసమయంలో సాయుధ సిబ్బందితో సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఈ దాడులను ఇజ్రాయల్ ముందుగా పసిగట్టలేకపోయింది.

న్యూస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన వారు, తమకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు. తమ భాగస్వాములు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నాడో తెలియడం లేదని కొంతమంది ఆందోళన చెందారు.

“తీవ్రవాదులు నా ఇంట్లోకి జొరబడానికి ప్రయత్నిస్తున్నారు” అంటూ గాజా స్ట్రిప్ సరిహద్దుకు అత్యంత సమీపాన ఉన్న కిబ్బుట్జ్ బెర్రి పట్టణానికి చెందిన అయిలెట్ హచిమ్ అనే వ్యక్తి చానెల్ 12కు ఫోన్ చేసి తెలిపాడు.

“నాకు మిలిటెంట్ల మాటలు వినిపిస్తున్నాయి. మా ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నారు. నా ఇద్దరు పిల్లలతో నేను ఇంట్లోనే ఉన్నాను” అని తెలిపారు.

దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలను షెల్టర్లలోకి వెళ్లాల్సిందింగా ప్రభుత్వం సూచించింది. అయితే, పాలస్తీనా మిలిటెంట్లు తమ ఇళ్లు, షెల్టర్లల్లోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని కిబ్బుట్జ్ బెర్రి పట్టణంలోని ప్రజలు చెబుతున్నారు.

“కాల్పులు శబ్దాలు అంతటా వినిపిస్తున్నాయి. నేను నా ఇంట్లోనే ఉన్నాను. ఇంటి బయటే శబ్దాలు వినిపిస్తున్నాయి. మొత్తం పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది. మేం ఎలాంటి శబ్దాలు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నాం. అలా చేస్తే వారు మా దగ్గరికి రారని అనుకుంటున్నాం” అని పట్టణానికి చెందిన వ్యక్తి ఛానెల్ 12కు తెలిపారు.

“ఉగ్రవాదులు షెల్టర్లలోకి కూడా ప్రవేశించారు. నాకు ఇంకా కాల్పులు శబ్దాలు వినిపిస్తున్నాయి” అని 23 ఏళ్ల ఎల్లా చెప్పారు.

ఇజ్రాయెల్‌ చట్టం ప్రకారం ప్రతి ఇంటికీ బాంబ్ షెల్టర్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలి. ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాలలో షెల్టర్లు నిర్మించింది.

ఈ స్థాయిలో దాడులు..

గాజా-ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఎప్పుడూ దాడులు జరగలేదు. రాకెట్ దాడులతో, హమాస్ మిలిటెంట్లు సరిహద్దు కంచెలను ధ్వంసం చేసి బైక్‌లు, పారా గ్లైడర్లు, బోట్ల ద్వారా ఊహించని విధంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు.

స్డెరోట్ పట్టణంలోకి ప్రవేశించిన మిలిటెంట్లు పౌరులపై కాల్పులు జరిపారు. కొంతమందిని బందీలుగా తీసుకుని వెళ్లారు.

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 250 మందికి పైగా పౌరులు చనిపోయారు. వందలమందికి పైగా గాయపడ్డారు.

“వారం వయసున్న బిడ్డతో నేను రెండు గంటలుగా షెల్టర్‌లోనే ఉన్నాను” అని కిబ్బుట్జ్ నిరిమ్‌ నివాసితులు ఒకరు ఛానెల్ 13తో చెప్పారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

“అర్జెంట్, అర్టెంట్..ఇది మీడియాకు చేరేలా సహాయం చేయండి” అంటూ ఎల్లా మొరా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

“ఉగ్రవాదులు అమ్మానాన్నలను కాల్చి చంపారని మా మేనళ్లుల్లు మాకు కాల్ చేసి చెప్పారు. మరోపాప ఎక్కడుందో తెలీడం లేదు. మేం వారిని కాపాడుకోవాలి. పోలీసులు స్పందించడం లేదు. ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అక్కడికి చేరుకునే పరిస్థితులు లేవు” అని ఆమె పోస్టులో రాశారు.

నేనెప్పుడూ ఇంతలా భయపడలేదు..

“తలుపులన్ని లాక్ చేసుకుని, సేఫ్ రూమ్‌లోకి వెళ్లమని, ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని మాకు అధికారులు చెప్పారు. మేం అలానే చేశాం. ఒకవేళ ఏసీ ఆన్ చేస్తే, ఆ శబ్దానికి మేం ఇంట్లో ఉన్నట్లు తెలిసిపోతుందనే భయంతో, అలాగే ఉండిపోయాం” అని ఫేస్‌బుక్‌లో అడిలి పేరుతో ఓ మహిళ పోస్ట్ చేశారు.

“నాకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. నా కడుపు ఉబ్బిపోతోంది. నేను వాష్‌రూంకి వెళ్లాలి. మేం ఉన్న సేఫ్ రూం గోడలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, కదలాలంటేనే భయంగా ఉంది. నిజంగా నేనెప్పుడూ ఇంతలా భయపడలేదు” అని ఆమె పోస్ట్ చేశారు.

“మిలిటెంట్లు మా అత్తగారిని కిడ్నాప్ చేసి, తీసుకుని వెళ్లారు. నేను ఆర్మీ, మీడియాను సంప్రదించాలి” అని కిబ్బుట్జ్ నిర్ ఓజ్‌ పట్టణానికి చెందిన యొని అనే పేరుతో ఫేస్‌బుక్‌ పోస్ట్ ఉంది.

“మేం షెల్టర్‌లో ఉన్నాం. ఆర్మీ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. అయితే, నా భర్త ఆయుధాలతో, మా ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులతో పోరాడుతున్నాడు” అని సూఫాలో నివసించే ఒఫిర్ తెలిపారు.

కిబ్బుట్జ్ వాట్సాప్ గ్రూప్ వరుస సందేశాలతో నిండిపోయింది. తమపై మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారని, ఆర్మీ ఎక్కడుందో కూడా తెలీడంలేదని, సహాయానికి ఎవరూ లేరని సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు సందేశాలు పంపుతున్నారు.

ఏం జరుగుతుందోనని ఆందోళన..

జెరుసలేం, టెల్ అవివ్ నగరాలను లక్ష్యంగా చేసుకుని హమాస్ మిలిటెంట్ సంస్థ రాకెట్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

“వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. రెస్టారెంట్లు, కెఫెలు మూతపడ్డాయి. ఏం జరగబోతుందో అన్న ఆందోళన, భయం ఉంది. మొదటి రాకెట్ దాడి జరిగినప్పుడు నేను పార్క్‌లో జాగింగ్ చేస్తున్నాను. ఆ శబ్దం భయానకంగా ఉంది” అని టెల్ అవివ్‌ నగరంలో ఉన్న ఇంగ్లీష్ రచయిత, జర్నలిస్ట్ గిడియొన్ లెవీ బీబీసీతో చెప్పారు.

రాకెట్ దాడులపై ఇజ్రాయెల్ స్పందించింది. గాజాపై వైమానిక దాడులు మొదలుపెట్టింది.

హమాస్ చర్యపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ యుద్ధంలో ఉందని అన్నారు. “గాజా పాలకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

గాజాపై జరిగిన దాడుల్లో 230 మందికి పైగా చనిపోయారని, చాలామంది గాయపడ్డారని స్థానిక పాలస్తీనా అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)