జ్యోతి సురేఖ: ఆర్చరీ‌లో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన ఈ తెలుగు క్రీడాకారిణి నేపథ్యం ఏంటి?

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం...

జ్యోతి సురేఖ ఏషియన్ గేమ్స్‌లో అద్భుతంగా రాణించింది. ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి, టోర్నీలో భారత పతకాల పట్టికలో దూసుకుపోవడంలో సురేఖ తనవంతు పాత్ర పోషించింది.

టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించిన తెలుగమ్మాయి సురేఖను పలువురు అభినందిస్తున్నారు.

ఆమె విజయాల పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఇంతకీ సురేఖ నేపథ్యం ఏంటి?

ఆరంభం నుంచే రాణింపు

జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.

క్రీడల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జ్యోతి రాణిస్తూనే ఉంది. ఆర్చరీలో అరుదైన విజయాలు సాధించింది ఈ తెలుగమ్మాయి. వరుసగా పతకాలు సాధిస్తూ విజయ పరంపర కొనసాగించింది.

జూనియర్‌ స్థాయిలో అండర్ 13 పోటీల్లో ప్రస్థానం ప్రారంభించారు జ్యోతి.

జ్యోతి సురేఖ తండ్రి సురేంద్ర కుమార్ కబడ్డీ క్రీడాకారుడు. స్థానికంగా ఆటల పోటీల్లో ఆయన రాణించేవారు.

కూతుర్ని క్రీడాకారిణిగా చేయాలని చిన్నప్పటి నుంచి పట్టుదలగా ప్రయత్నించారు సురేంద్ర. దీంతో కూతురు శిక్షణ కోసం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నడింపల్లి గ్రామం నుంచి విజయవాడకు మకాం మార్చారు.

తొలుత ఈత పోటీల్లో సురేఖ రాణించడంతో అందులో ప్రోత్సహించారు.

నాలుగేళ్ల వయసులోనే జ్యోతి సురేఖ కృష్ణానదిలో 5 కి.మీ. దూరాన్ని 3 గంటల 20 నిమిషాల 8 సెకండ్లలో ఈది రికార్డు సృష్టించింది.

ఈత విన్యాసాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది.

బాణం పట్టి, గురి తప్పకుండా...

కొద్దికాలం తర్వాత జ్యోతి సురేఖ విలువిద్య పైకి దృష్టి మళ్లించింది.

ఎనిమిదేళ్ల వయసులో బాణం పట్టి గురి పెట్టిన సురేఖ, వెనుదిరిగి చూడలేదు. 13 ఏళ్లకే అంతర్జాతీయ పోటీల్లో తన మార్కు చూపించింది.

అండర్ 16, అండర్ 19, తర్వాత సీనియర్ విభాగాల్లోనూ విజయాలు సాధించింది సురేఖ. ఈ క్రీడలో అంతర్జాతీయ గుర్తింపును కూడా తెచ్చుకుంది.

ముఖ్యంగా కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ తిరుగులేని విజయాలు దక్కించుకుంది.

తాజాగా ఏషియన్ క్రీడల్లోనూ అదే పరంపరను కొనసాగించి, మూడు బంగారు పతకాలు దక్కించుకుంది.

2017లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అర్జున అవార్డును స్వీకరించారు జ్యోతి సురేఖ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)