You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మాల్దీవులు చైనాతో కలిసి భారత్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిందా?
ఐదు రోజుల చైనా పర్యటన అనంతరం శనివారం మాల్దీవులు తిరిగి వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కీలక ప్రకటన చేశారు.
"నా దేశం చిన్నదే కావచ్చు. దానర్థం మమ్మల్ని బెదిరించడానికి వారికి లైసెన్స్ ఉందని కాదు" అని చెప్పారు.
భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే, ముయిజ్జు తన ప్రకటనలో నేరుగా భారత్ పేరును వాడలేదు.
ఇటీవల ముయిజ్జు ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతీయుల నుంచి తీవ్రంగా ప్రతిస్పందన, విమర్శలు రావడంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం.
ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ముయిజ్జు తొలిసారిగా చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. పర్యటన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
‘‘సముద్రంలో చిన్న చిన్న దీవుల సముదాయం మాల్దీవులు. 9 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ప్రత్యేక ఎకనామిక్ జోన్. సముద్ర భాగంలో విస్తీర్ణం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి" అని ముయిజ్జు అన్నారు.
"ఈ సముద్రం ఏ దేశానిదీ కాదు. హిందూ మహాసముద్రం.. దాని చుట్టూ స్థిరపడిన అన్ని దేశాలకు చెందినది" అని వ్యాఖ్యానించారు.
మాల్దీవ్స్ సన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం.. "మేం ఎవరి పెరట్లో ఉన్న దేశం కాదు, మాది స్వతంత్ర, సార్వభౌమ దేశం" అని మయిజ్జు తెలిపారు.
చైనా, మాల్దీవుల ఉమ్మడి ప్రకటన
జనవరి రెండో వారంలో చైనాలో ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో మయిజ్జు సమావేశమయ్యారు. పర్యటనలో ఇరు దేశాలు దాదాపు 20 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
చైనీస్ అగ్ర నాయకులతో ముయిజ్జు చర్చల తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
అందులో "ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకోవడానికి ఒకరికొకరం మద్దతునిస్తూనే ఉంటామని ఇరుపక్షాలు అంగీకరించాయి" అని ఉంది.
''మాల్దీవుల సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, జాతీయ గౌరవానికి చైనా దృఢంగా మద్దతిస్తుంది.
దాని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మాల్దీవులకు మద్దతిస్తుంది, గౌరవిస్తుంది. దాని అంతర్గత వ్యవహారాలలో బయటి జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల మాల్దీవులు, భారత్‌ల మధ్య నెలకొన్న వివాదాల దృష్ట్యా చైనా, మాల్దీవుల ఉమ్మడి ప్రకటన చర్చనీయాంశమైంది.
అధ్యక్షుడు జిన్‌పింగ్ చొరవతో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చైనా నుంచి మాల్దీవులు మరింత ఆర్థిక సహాయం పొందుతుందని మాల్దీవుల్లో చైనా రాయబారి వాంగ్ లిక్సిన్ అన్నారు.
వాంగ్ లిక్సిన్ చైనా పర్యటనకు ముయిజ్జూతో కలిసి వెళ్లారు. చైనా, మాల్దీవుల మధ్య బలమైన సంబంధాలకు మూడు ప్రధాన అంశాలున్నాయన్నారు వాంగ్.
"మొదటిది పరస్పర రాజకీయ విశ్వాసం; రెండోది మాల్దీవుల్లో మరిన్ని ప్రాజెక్టుల కోసం జిన్‌పింగ్ చొరవతో ముయిజ్జూ అభివృద్ధి వ్యూహాన్ని బలోపేతం చేయడం, మూడోది విస్తృతమైన సంప్రదింపులు, ఉమ్మడి నిర్మాణం, భాగస్వామ్య ప్రయోజనాల సూత్రాన్ని అనుసరించడం" అని వాంగ్ చెప్పారు.
అభివృద్ధి ప్రాజెక్టులకు చైనా సాయం
మాల్దీవులకు దాదాపు రూ. 1,077 కోట్లు (130 మిలియన్ అమెరికన్ డాలర్లు) ఆర్థిక సాయం అందించేందుకు చైనా అంగీకరించిందని మాలేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముయిజ్జూ తెలిపారు.
ఈ సాయంలో ఎక్కువ భాగం రాజధానిలోని రోడ్ల పునర్నిర్మాణానికి వినియోగిస్తామన్నారు.
మాల్దీవుల జాతీయ విమానయాన సంస్థ మాల్దీవియన్ ద్వారా చైనా నుంచి దేశీయ విమానాలను ప్రారంభించడంపై కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
హుల్‌హుమలేలో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. దీని కోసం చైనా దాదాపు రూ. 414 కోట్లు (50 మిలియన్ల అమెరికన్ డాలర్లు) సహాయం అందిస్తోంది. ఇది కాకుండా విలిమలెలో 100 పడకల ఆసుపత్రికి కూడా చైనా గ్రాంట్ ఇవ్వనుంది.
మాలేలో భారత్ సాయంతో నిర్మించిన ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఐజీఎంహెచ్), ఆ దేశంలోనే అతిపెద్దదిగా పరిగణిస్తారు.
ఈ 300 పడకల ఆసుపత్రిని 1992లో నిర్మించారు. 2018లో మళ్లీ ఇండియా సహాయంతోనే ఈ ఆసుపత్రిలో ఆధునిక సేవలు విస్తరించారు.
ఇవి కూడా చదవండి
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- CEO సుచనా సేథ్: నాలుగేళ్ళ తన కొడుకుని ఈమె ఎందుకు చంపారు, పోలీసులు ఎలా కనిపెట్టారు?
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)