అమెరికాలోని ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించిన మిల్టన్ తుపాను, 16 మంది మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో హరికేన్ (పెను తుపాను) మిల్టన్ బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన పెను గాలులు ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో నివాస ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తూర్పు తీరంలోని సెయింట్ లూసీ ప్రాంతంలో ఈ పెను తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు.

ఫ్లోరిడాలోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 400 మందిని అధికారులు రక్షించారు. ఆ అపార్ట్‌మెంట్‌లో 2 వేల మంది నివసిస్తున్నారు. రెండో అంతస్తు బాల్కనీ వరకూ నీళ్లు వచ్చాయి.

ఫ్లోరిడా అంతటా ఈ పెను తుపాను ప్రభావం చూపింది.

చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని ప్రాంతాల నుంచి తమకు ఫోన్ కాల్స్ వస్తున్నప్పటికీ అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరంగా ఉందని అత్యవసర సేవల సిబ్బంది చెప్పారు.

దాదాపు 31 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కొన్ని ప్రాంతాల్లో మంచినీరు దొరకడం లేదు.

సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫోర్ట్ మైర్స్‌లో వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. పెను గాలుల కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి.

‘‘గాలికి కిటికీలు కొట్టుకుపోయాయి. అప్పుడు ఇక్కడే ఉన్నాను. పక్కనే డెస్క్ మీద నా పిల్లి ఉండింది. నేను నా రెండు కుక్కల్ని లాక్కొని బెడ్ కింద దూరాను. అంతే... బహుశా నాకు ఒక్క నిమిషం టైమ్ దొరికిందనుకుంటా’’ అని ఫోర్డ్ మైర్స్‌లో ఉండే కానర్ ఫెరిన్ చెప్పారు.

మెక్సికో గల్ఫ్‌ ప్రాంతంలో తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అలలు దాదాపు 35 అడుగుల ఎత్తుకు ఎగిశాయి.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒక స్టేడియం పైకప్పు ఎగిరిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది ఇందులోనే బస చేస్తున్నారు.

‘‘ఈ సమయంలో ప్రజలను ఖాళీ చేయించడం చాలా ప్రమాదకరమైన పని. కాబట్టి మీకు ఎక్కడ సురక్షితం అనిపిస్తే అక్కడే ఎలాగోలా తలదాచుకోండి’’ అని ఫ్లోరిడా గవర్నర్ రాన్‌ డీ శాంటిస్ చెప్పారు.

మిల్టన్ తుపాను వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కావాల్సి ఉంది.

రెండు వారాల కిందట వచ్చిన హెలీన్ తుపాను మిగిల్చిన భయంకర నష్టం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఫ్లోరిడాపై ఇప్పుడు మిల్టన్ తుపాను విరుచుకుపడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)