You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎలాన్ మస్క్: ‘ఉద్యోగులను తొలగించే’ ఉద్యోగం నుంచి ఎందుకు తప్పుకున్నారు?
- రచయిత, క్రిస్టల్ హేస్, బ్రాండన్ డ్రెనాన్
- హోదా, బీబీసీ న్యూస్
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకుంటున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. గందరగోళంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు చేయడానికి, ‘వేలాది ఉద్యోగాలు తొలగించి, శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడం’లో ఇప్పటి వరకు ప్రభుత్వానికి సహకారం అందించానని చెప్పారు మస్క్.
‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)ని నడపడానికి సహాయం చేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు’’ అంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు మస్క్.
బుధవారం రాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలనుంచి వైట్‌హౌస్ ఆయనను రిలీవ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వంలో ఆయన పాత్ర తాత్కాలికమైనదే. ఆయన ఆ బాధ్యతలనుంచి వైదొలగాల్సి రావడం అనూహ్యమేమీ కాదు. కానీ ట్రంప్ అజెండాలోని కీలక అంశాన్ని విమర్శించిన మరుసటిరోజే మస్క్ వైదొలగడం ఇక్కడ విశేషం.
‘‘ నా షెడ్యూల్ ప్రకారం స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయిగా నా పని ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కి థ్యాంక్స్" అని ఎక్స్‌లో రాశారు మస్క్ .
‘‘భవిష్యత్తులో డోజ్ మిషన్ బలపడుతుంది. ఇది ప్రభుత్వానికి కీలక విధానంగా మారుతుంది" అని ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం 130 రోజులు ఫెడరల్ గవర్నమెంట్‌లో పని చేసేలా మస్క్‌ను నియమించింది ట్రంప్ గవర్నమెంట్.
జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి లెక్కిస్తే, మే నెలాఖరు నాటికి ఆ కాలపరిమితి ముగుస్తుంది.
అయితే ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ బిల్లు విషయంలో తాను తీవ్రంగా ‘డిజప్పాయింట్’ అయినట్లు వ్యాఖ్యానించిన మరుసటి రోజే మస్క్ తన ఉద్యోగం నుంచి వైదొలిగారు.
ఈ బడ్జెట్ బిల్లులో కొన్ని ట్రిలియన్ డాలర్ల పన్ను మినహాయింపులు, రక్షణ వ్యయాన్ని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
‘బిగ్ అండ్ బ్యూటిఫుల్’గా ట్రంప్ అభివర్ణించిన ఈ బిల్లు, ప్రభుత్వ ఆర్థిక లోటును పెంచుతుందని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ అన్నారు.
ఇది డోజ్ చేయాల్సిన పనులకు అడ్డంకిగా మారుతుందని తాను భావిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.
‘‘ఒక బిల్లు బిగ్‌గా ఉండొచ్చు, లేదా బ్యూటిఫుల్‌గా ఉండొచ్చు. కానీ, బిగ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంటుందన్న విషయం నాకు తెలియదు’’ అని మస్క్ అన్నారు.
మొదట్లో ప్రభుత్వ బడ్జెట్ నుంచి ‘కనీసం 2 ట్రిలియన్ డాలర్ల’ ఖర్చు తగ్గించాలని మస్క్ సూచించారు. తర్వాత దానిని 1 ట్రిలియన్ డాలర్లకు మార్చారు. ఆ తర్వాత దాన్ని 150 బిలియన్ డాలర్లకు సవరించారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వ అధికారులతో గొడవపడినట్లు కూడా చెబుతారు.
డోజ్ ఫలితంగా 23 లక్షలమంది ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 2.6 లక్షల ఉద్యోగాలకు కోత పడింది.
ఒకేసారి ఇంతమందిని ఉద్యోగాలనుంచి తొలగించడం సరికాదని, తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవాలని కొన్ని సందర్భాల్లో కోర్టులు ఆదేశించాయి.
ప్రభుత్వ సిబ్బందిని తగ్గించే విధానంలో అప్పుడప్పుడు కొంతమంది ఉద్యోగులను పొరపాటున తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉద్యోగులను ఇలాగే తొలగించారు.
ట్రంప్ విధానాలను అమలు విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో తన కంపెనీలు నడుపుకోవడానికి వెళ్లిపోతానని ఏప్రిల్ చివరిలోనే మస్క్ ప్రకటించారు.
‘‘ప్రతిదానికీ డోజ్‌నే నిందిస్తున్నారు. ఎక్కడో ఏదో చెడు జరుగుతుంది. మాకు దానితో సంబంధం లేకపోయినా మమ్మల్నే నిందిస్తారు’’ అని మంగళవారం టెక్సస్‌లో స్పేస్ ఎక్స్ ప్రయోగానికి ముందు ‘వాషింగ్టన్ పోస్ట్’తో మస్క్ అన్నారు.
ట్రంప్ ప్రభుత్వంతో పనిచేస్తున్న సమయంలో మస్క్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో టెస్లా అమ్మకాలు 13% తగ్గాయి. ఇది టెస్లా చరిత్రలోనే అతిపెద్ద తగ్గుదల.
గత నెలలో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మస్క్, డోజ్‌కు తాను కేటాయించే సమయం గణనీయంగా తగ్గుతుందని, ఎక్కువ సమయం టెస్లాకు కేటాయిస్తానని చెప్పారు.
మంగళవారం దోహాలో జరిగిన ఎకనామిక్ ఫోరమ్‌లో మస్క్ మాట్లాడుతూ... రాబోయే ఐదు సంవత్సరాలు టెస్లాకు నాయకుడిగా ఉండటానికే కమిట్ అయినట్లు చెప్పారు.
గత సంవత్సరం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి, రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వడానికి దాదాపు 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు మస్క్. తన రాజకీయ విరాళాలను తగ్గించుకుంటానని ఈ నెల ప్రారంభంలో ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)