హూతీలపై వైమానిక దాడులు, కారణమేంటో చెప్పిన ట్రంప్

    • రచయిత, మలు కుర్సినో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా తన విమానాలతో దాడులను కొనసాగిస్తోంది.

ఎర్రసముద్రంలో నౌకలపై సాయుధ బృందాలు దాడులు చేయడమే ఈ ప్రతీకార చర్యలకు కారణమని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

''ఇరాన్ అందించే నిధులతో హూతీ దుండగులు అమెరికా విమానాలపై క్షిపణులను పేల్చారు, మా సైనికులను, మిత్రదేశాల సైన్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి దోపిడీ విధానం, హింస, తీవ్రవాద చర్యల ద్వారా మాకు కోట్ల డాలర్ల మేర నష్టం కలిగించడమే కాకుండా, జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.’’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో ట్రంప్ రాశారు.

ఈ దాడులలో 15మంది చనిపోయారని, 9మంది గాయపడ్డారని హూతీల ఆధ్వర్యంలోని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి బదులుగా ఎర్రసముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకున్న హూతీ గ్రూపు, ఇప్పుడు తమపై అమెరికా చేస్తున్న దాడులకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.

‘జనావాసాలు లక్ష్యంగా దాడులు’

సౌదీ అరేబియా సరిహద్దులో తమ దళాలకు గట్టిపట్టు ఉన్న సాదా ఉత్తర ప్రావిన్స్‌లోని సనాలో శనివారం సాయంత్రం వరుస పేలుళ్లు జరిగినట్టు హూతీ తెలిపింది.

ఇరాన్ మద్దతున్న ఈ తిరుగుబాటు గ్రూపు, ఇజ్రాయెల్‌ను తన శత్రువుగా పరిగణిస్తుంటుంది. యెమెన్‌లోని సనా, వాయువ్య ప్రాంతాలపై ఈ సంస్థకు నియంత్రణ ఉంది. అయితే ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం కాదు.

సైనిక స్థావరం ఉన్న సనా విమానాశ్రయంపై దట్టంగా కమ్ముకున్న నల్లని పొగ దృశ్యాలు కొన్ని ధృవీకరించని ఫోటోలలో కనిపిస్తున్నాయి.

యెమెన్‌ రాజధాని సనాలో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, యూకే దుర్మార్గమైన దాడులకు దిగాయని హూతీ తిరుగుబాటుదారులు ఓ ప్రకటనలో ఆరోపించారు. శనివారం నాటి దాడులలో యూకే పాల్గొనలేదని అర్ధమవుతున్నప్పటికీ, అమెరికా విమానాలకు ఇంధనం నింపుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

వాణిజ్య నౌకలపై దాడులు

నవంబర్ 2023 నుంచి ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హూతీలు అనేక వాణిజ్య నౌకలపై, మిస్సైల్స్, డ్రోన్లు, చిన్నపడవలతో దాడులు చేశారు. అలాగే రెండు నౌకలను ముంచేశారు. ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సిబ్బందిని చంపేశారు.

''ఈ దాడులను సహించం, మా లక్ష్యాన్ని సాధించేవరకూ సైన్యాన్ని ప్రయోగిస్తూనే ఉంటాం.'' అని ట్రంప్ స్పష్టం చేశారు.

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనీయులకు మద్దతుగా తామీ చర్యలు తీసుకుంటున్నామని హూతీలు చెబుతున్నారు. పైగా వారు తరచూ ఇజ్రాయెల్, అమెరికా, యూకేలకు సంబంధించిన నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని అవాస్తవ ప్రకటనలు కూడా చేస్తున్నారు.

వెనక్కు తగ్గని హూతీలు

ఎర్రసముద్రంలో, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో వాణిజ్య నౌకలను రక్షించేందుకు పాశ్చాత్య యుద్ధ నౌకలను మోహరించినా, అమెరికా,బ్రిటన్‌లు హూతీ సైనిక స్థావరాలపై పలుమార్లు వైమానిక దాడులకు దిగినా, ఏడాది కాలంగా హూతీలు వెనక్కు తగ్గడంలేదు.

యెమెన్ నుంచి తమ దేశంపైకి 400 క్షిపణులు, డ్రోన్లతో చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా హూతీలపై జులై నుంచి వైమానిక దాడులకు దిగింది.

నవంబర్ 2023 నుంచి దాడుల ఫలితంగా ఎర్రసముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు యూరప్, ఆసియా మధ్య సూయజ్ కాలువను వినియోగించడం మానేశాయి. దీనికి బదులుగా దక్షిణాఫ్రికాను చుట్టి వచ్చే మార్గాన్ని ఎంచుకున్నాయి. దీనివల్ల ఖర్చులు పెరిగి, చివరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారింది.

నరకం చూస్తారు : ట్రంప్

ఎర్ర సముద్రానికి దారితీసే సూయజ్ కాలువ ద్వారా అమెరికాకు చెందిన నౌక సురక్షితంగా ప్రయాణించి ఏడాదికి పైగా అయిందని, తూర్పు ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం మధ్య జలవనరుల ద్వారా అమెరికా యుద్ధనౌక ప్రయాణించి నాలుగు నెలలు అయిందని ట్రంప్ అన్నారు.

సూయజ్ కాలువ ఆసియా, ఐరోపా మధ్య వేగవంతమైన సముద్ర మార్గం. చమురు, ద్రవరూప సహజ వాయువు రవాణాలో కీలకంగా ఉంది.

హూతీలను నేరుగా ఉద్దేశిస్తూ ట్రంప్, ‘‘ మీరు ఈ ఆగడాలను ఆపకపోతే, ఇంతకు ముందెన్నడూ చూడని నరకమంటే ఏమిటో చూస్తారు'' అని ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు.

అయితే ఇలాంటి బెదిరింపుల వల్ల పాలస్తీనీయులకు తమ మద్దతు తగ్గదని హూతీ‌లు స్పష్టం చేశారు.

''ఈ దాడులకు బదులు తీర్చుకుంటాం. దెబ్బకు దెబ్బ తీసేందుకు యెమెన్ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి.'' అని హూతీ గ్రూపు చెప్పింది.

హూతీల మద్దతుదారు ఇరాన్‌కు నోటీసులు జారీచేసినట్టు అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు.

15 శాతం ఎర్రసముద్రం ద్వారానే

ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 15 శాతం ఎర్రసముద్రం ద్వారానే జరుగుతుంది. కానీ దాడుల కారణంగా ఏడాదికిపైగా ప్రధాన షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని ఉపయోగించడం నిలిపివేశాయి. దీనికి బదులుగా దక్షిణాఫ్రికా చుట్టూ ఎక్కువ దూరం ఉండే మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి.

2023 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు ఎర్ర సముద్రంలో హూతీలు 190సార్లు దాడులకు పాల్పడ్డారని అమెరికా కాంగ్రెస్ తెలిపింది.

గతంలో ఈ సంస్థపై యూకే, అమెరికా సంయుక్తంగా నౌకాదళ, వైమానిక దాడులు నిర్వహించాయి. హూతీలతో సంబంధం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వేర్వేరు దాడుల్లో పాల్గొంది.

హూతీలకు మద్దతుగా నిలవద్దని ట్రంప్ ఇరాన్‌ను కోరారు.

‘‘తెహ్రాన్‌ను జవాబుదారీగా చేస్తాం. ఈ విషయంలో కఠినంగా ఉంటాం'' అని ట్రంప్ హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)