‘క్యూబా ప్రభుత్వమే మా నాన్నను చంపేసింది’ – ఫిడెల్ క్యాస్ట్రో పాలనను వ్యతిరేకించిన నేత కుమార్తె ఆరోపణ

    • రచయిత, వెనెస్సా బుష్‌లూటర్
    • హోదా, బీబీసీ న్యూస్ లాటిన్ అమెరికా ఎడిటర్

‘‘నా తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి 10 ఏళ్లకు పైగా మేం పోరాడుతున్నాం’’ అని రోసా మారియా పాయా చెప్పారు.

క్యూబా అసమ్మతివాది ఓస్వాల్డో పాయా, ఆయన తోటి కార్యకర్త హరాల్డ్ సెపెరో 2012లో కారు ప్రమాదంలో మరణించారు.

అయితే, అది యాక్సిడెంట్ కాదని ఓస్వాల్డో పాయా కూతురు, 34 ఏళ్ల రోసా మారియా పాయా అన్నారు.

‘‘క్యూబా ప్రభుత్వమే మా నాన్నను, హరోల్డ్ సెపెరోను చంపింది’’ అని బీబీసీతో అన్నారు.

వారి మరణంలో క్యూబా ప్రభుత్వానికి చెందిన ఏజెంట్ల ప్రమేయం ఉందని నిర్ధరిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఇటీవల నివేదిక విడుదల చేసిన తర్వాత పాయా ఈ వ్యాఖ్యలు చేశారు.

క్యూబాలో ప్రముఖ ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలో ఓస్వాల్డో పాయా ఒకరు.

చట్టాలు, శిక్షలు ప్రయోగించి రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే, కమ్యూనిస్ట్‌లు పరిపాలించే ఈ ద్వీపంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం ఓస్వాల్డో దశాబ్దాల తరబడి పోరాడారు.

సీఐఏ మద్దతు ఉన్న కౌంటర్ రివల్యుషనరీ లీడర్‌ అయిన ఓస్వాల్డో ప్రమాదంలో మరణించారని ప్రభుత్వ మీడియా ద్వారా క్యూబా అధికారులు చెబుతూ వచ్చారు.

ఓస్వాల్డో కుమార్తె చెప్పేవన్నీ అబద్ధాలని క్యూబా ప్రభుత్వ మీడియా ఆరోపించేది.

క్యూబాలో అతిపెద్ద ప్రతిపక్ష గ్రూప్‌లలో ఒకటిగా ఎదిగిన క్రిస్టియన్ లిబరేషన్ మూవ్‌మెంట్‌ను 1988లో ఓస్వాల్డో పాయా స్థాపించారు.

అంతేకాక ‘వారెలా’ అనే ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆయన రెఫరెండం కోసం నేషనల్ అసెంబ్లీ ముందు ఫిర్యాదు చేసేందుకు క్యూబా రాజ్యాంగం ప్రకారం అవసరమైన 10 వేల సంతకాలను సేకరించారు.

1959 నుంచి ఫిడెల్ క్యాస్ట్రో నేతృత్వంలో సాగిన క్యూబా పాలనలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలనుకున్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛ, అవినీతి రహిత పాలన, పారదర్శక ఎన్నికలు, రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష వంటివి అంశాలకు ఆయన ఈ రెఫరెండంలో ఆయన క్యూబన్ల మద్దతు కోరారు.

పాయా, ఆయన సహ కార్యకర్త క్యూబాలో ప్రతి ఇంటికి వెళ్లి వారి మద్దతు కోరారు. 2002 మే నెలలో 11,020 మంది క్యూబన్ల సంతకాలతో కూడిన కార్డ్‌బోర్డ్ బాక్స్‌లను ఆయన నేషనల్ అసెంబ్లీ ముందు ఉంచారు.

ఇది అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, ఆ సమయంలో వారి ప్రాజెక్ట్ పెద్దగా ఎవరికీ తెలియలేదు.

ప్రభుత్వ మీడియాను క్యూబా పూర్తిగా నియంత్రిస్తోంది. క్యూబా అధికారుల చేతిలో ఉన్న ప్రభుత్వ మీడియా ఈ పిటిషన్ ప్రస్తావన వార్తల్లో రానివ్వలేదు.

దాంతో చాలా మంది క్యూబా ప్రజలు కనీసం దీని గురించి ఎప్పుడూ వినలేదు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ఫిడెల్ క్యాస్ట్రో ఎదురుగా యూనివర్సిటీ ఆఫ్ హవానాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పానిష్‌లో చేసిన ప్రసంగంలో వారెలా ప్రాజెక్ట్‌ను పొగడటంతో అందరికీ తెలిసింది.

దీని ఫలితంగా ఓస్వాల్డో పాయా, ఈ ప్రాజెక్ట్‌కి చెందిన ఇతరులు క్యాస్ట్రో ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా పేరుపడ్డారు.

విదేశీయుల తమ ప్రయోజనాల కోసం వారెలా ప్రాజెక్ట్‌కి ఆర్థిక సాయం చేస్తున్నారని, ప్రోత్సహిస్తున్నారని, వెనకుండి ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నారని క్యూబా అధికారులు ఆరోపించారు.

అలాగే నేషనల్ అసెంబ్లీ కూడా ఈ పిటిషన్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆ తర్వాత నెలకి క్యూబా సోషలిస్ట్ విధానం అంటరానిదిగా ప్రకటించే సవరణను ఆమోదించాలంటూ ప్రభుత్వానికి చెందిన గ్రూప్‌లు ప్రజాభిప్రాయానికి పిలుపునిచ్చాయి.

ఈ సవరణకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది క్యూబన్లు హవానాలోని వీధుల్లో క్యాస్ట్రో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యం కావాలన్న పాయా ఉద్యమానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు చాలా మంది భావించారు.

ఈ సవరణకు 99 శాతం మంది క్యూబా ఓటర్ల మద్దతు లభించింది. దీన్ని ప్రభుత్వం కొనియాడింది. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు చాలా మంది క్యూబన్లు భయపడ్డారని దీని ద్వారా రుజువైందని విమర్శకులు చెప్పారు.

ఏడాది తర్వాత, వారెలా ప్రాజెక్ట్‌కి చెందిన చాలా మంది ప్రమోటర్లకు శిక్షలు విధించారు. వారిలో ఓస్వాల్డో పాయా లేరు. కానీ, క్యూబన్ అధికారుల చేత తరచూ వేధింపులను, నిఘాను ఆయన ఎదుర్కొన్నారు.

పాయాకు, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యల్ని ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యుమన్ రైట్స్(ఐఏసీహెచ్ఆర్) కూడా రిపోర్ట్ చేసింది.

వీధుల్లో ఆయన్ని క్యూబన్ అధికారులు వెంబడించారని ఈ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.

చర్చికి వెళ్లేటప్పుడు, పనికి వెళ్లేటప్పుడు ఆయన్ను వెంబడించే వారిని, తిరిగి మళ్లీ ఆయన ఇంటి గుమ్మం లోపల అడుగు పెట్టేదాకా ఏజెంట్ల నిఘా ఉండేదని తెలిపింది.

ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, ఓస్వాల్డో పాయా మాత్రం ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతూ తన ప్రచారాన్ని కొనసాగించే వారు.

2012 జూలై 22న వారెలా ప్రాజెక్ట్‌కి చెందిన హరాల్డ్ సెపెరో, మరో ఇద్దరు యువ యూరోపియన్ రాజకీయవేత్తలతో కలిసి తూర్పు క్యూబాలో ప్రయాణిస్తున్న సమయంలో వారి కారు ప్రమాదానికి గురైంది.

ఆ సమయంలో ఓస్వాల్డో కూతురు రోసా మారియాకు 23 ఏళ్లు.

యూరప్‌లో వారెలా ప్రాజెక్ట్‌కి చెందిన మద్దతుదారుల నుంచి తమకు వచ్చిన ఫోన్ కాల్‌ను రోసా గుర్తుకు చేసుకున్నారు.

‘‘ఏదో జరిగింది అని వారు మాకు చెప్పారు’’ అని మారియా గుర్తుకు చేసుకున్నారు.

‘‘నేను వెంటనే మా నాన్న ఫోన్‌కి కాల్ చేశాను. ఎవరూ ఎత్తలేదు. చివరికి ఫోరెన్సిక్ డాక్టర్ ఫోన్ ఎత్తే వరకు నేను మా నాన్నకి కాల్ చేస్తూనే ఉన్నాను’’ అని పాయా మారియా ఆనాడు జరిగిన సంఘటనను చెప్పారు.

కారులో వెనుక కూర్చున్న ఓస్వాల్డో పాయా, హరాల్డ్ సెపెరో ఇద్దరూ ఈ ప్రమాదంలో మరణించారు.

డ్రైవింగ్ సీటులో ఉన్న 26 ఏళ్ల స్పానియార్డ్ ఏంజిల్ కారోమెరో, స్వీడన్‌కు చెందిన యువ రాజకీయవేత్త అరోన్ మోదిగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే దగ్గర్లోని బయామో నగరంలోని ఆస్పత్రికి తరలించారు.

తమ కారుని వెనుక నుంచి మరో కారు ఢీకొందని ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఈ యువ రాజకీయవేత్తలు తమ స్నేహితులకు చెప్పినట్లు వార్తాకథనాలు వచ్చాయి.

ఆ ఘటన ప్రమాదం కాదని కుటుంబ సభ్యులు అనుమాన పడినట్లు రోసా మారియా పాయా చెప్పారు. అక్కడికి నెల ముందు కూడా అలాంటి ప్రమాదం నుంచి ఓస్వాల్డో పాయా బతికి బయటపడ్డారు. వెంటనే మళ్లీ ఇలానే ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబానికి అనుమానం వచ్చింది.

ఓస్వాల్డో మరణించడానికి నెల రోజుల ముందు జరిగిన ఓ ప్రమాదంలో.. ఆయన, భార్య ఓఫెలియా ఏస్వేదాలు హవానా నగరంలో కారులో ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చిన కారు బలంగా వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఆ సమయంలో తన తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడడం తన అదృష్టంగా భావించినట్లు రోసా మారియా పాయా బీబీసీతో చెప్పారు.

పాయా, సెపెరోలు మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు చాలా అన్యాయంగా ఉన్నాయని ఐఏసీహెచ్ఆర్ నివేదిక తెలిపింది. ఈ కారు ప్రమాదం జరిగిన పదేళ్లకు ఇది నివేదిక విడుదల చేసింది.

కారు ప్రమాదం తర్వాత బతికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సైన్యం అదుపులోకి తీసుకుంది.

తప్పు తమదేనని అంగీకరించేందుకు క్యూబా అధికారులు తమకి డ్రగ్ ఇచ్చారని, చిత్రహింసలు పెట్టారని ఐఏసీహెచ్ఆర్‌కి ఏంజిల్ కారోమెరో చెప్పారు.

క్యూబాకు చెందిన హోం మంత్రిత్వ శాఖ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై డిజిటల్‌ రిక్రియేషన్ చేసి, దాన్ని ప్రభుత్వ మీడియాకు అందించింది.

దాన్నే వారు ప్రజలకు చూపించారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అత్యధిక వేగంతో ఉన్నట్లు కూడా ముగ్గురు సాక్షులతో చెప్పించారు.

అడ్వకసీ గ్రూప్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ హ్యుమన్ రైట్స్‌కి చెందిన ఏంజెలిటా బీయెన్స్ బాధిత కుటుంబల తరఫున ఐఏసీహెచ్ఆర్ ముందుకి ఈ కేసును తీసుకెళ్లారు.

ఈ కారు ప్రమాదంపై క్యూబా అధికారులు జరిపిన విచారణ విధానంలో చాలా లోటుపాట్లు, అక్రమాలు ఉన్నాయని ఐఏసీహెచ్ఆర్ గుర్తించింది.

తమ కారును వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టిందని కారోమెరో చెప్పిన వాంగ్మూలాన్ని సమర్థించిన ప్రత్యక్ష సాక్షిని కనీసం పోలీసులు ప్రశ్నించ లేదని, కారోమెరో విచారణ జరుగుతున్నప్పుడు కనీసం అతన్ని పిలవలేదని ఐఏసీహెచ్ఆర్ రిపోర్ట్ పేర్కొంది.

ఈ కారు ప్రమాదంలో కారోమెరోను దోషిగా తేల్చి 2012 అక్టోబర్‌లో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.

‘‘చట్టవ్యతిరేకంగా, అన్యాయంగా కారోమెరోని అరెస్ట్ చేసి, కారు ప్రమాదానికి ఆయనే కారణమని ఒప్పుకునేలా రాష్ట్ర అధికారులు బెదిరించి, అవమానవీయ విధానంలో చిత్రహింసలకు గురి చేశారు’’ అని పేర్కొంటూ ఐఏసీహెచ్ఆర్ తన నివేదికను ముగించింది.

2012 డిసెంబర్‌లో ఆయన తన స్వదేశంలో మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించేందుకు కారోమెరోని స్పెయిన్‌కి తరలించారు.

స్పెయిన్‌కి తిరిగి వచ్చిన తర్వాత కూడా తనకు బెదిరింపులు కొనసాగినట్లు ఆయన చెప్పారు.

‘‘నోరు మూసుకుని ఉండకపోతే మరణం తప్పదని నాకు బెదిరింపులు వచ్చేవి’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

పాయా, సెపెరో మరణాల్లో ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని చెప్పేందుకు అవసరమైన ఆధారాలను ఐఏసీహెచ్‌ఆర్ రిపోర్ట్ గుర్తించినట్లు కారోమెరో చెప్పారు.

‘‘ఇది ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఓస్వాల్డో, హరాల్డ్ సెపెరో కుటుంబానికి ఈ గుర్తింపు చాలా ముఖ్యం. మేం ఇంతకాలం చెబుతుంది నిజమే అని నమ్మడం నాకు ముఖ్యం’’ అని చెప్పారు.

కేవలం ఇది మా ఒక్క నిజం మాత్రమే కాదు. నివేదిక కూడా ఇది నిజమనే నమ్ముతుందని అన్నారు.

ఈ రిపోర్ట్‌పై స్పందించేందుకు బీబీసీ క్యూబా ప్రభుత్వాన్ని సంప్రదించింది. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారలను క్యూబా ప్రభుత్వం ఏఐసీహెచ్ఆర్‌కి సమర్పించలేదు.

ఈ రిపోర్ట్‌ ‘అతిపెద్ద ఊరట’గా వర్ణించిన రోసా మారియా పాయా, దీనిపై క్యూబా ప్రభుత్వంపై ఏమైనా చర్యలు ఉంటాయని తాను అనుకోవడం లేదని అన్నారు.

క్యూబా ప్రభుత్వం తన తండ్రిని బలితీసుకుందని, కానీ తన తండ్రి, హరాల్డ్ సెపెరో కోరుకున్నట్లు క్యూబాలో స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం ఉంటేనే న్యాయం దక్కుతుందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)