You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్: ‘ఆమె మరణానికి ముందున్న పరిస్థితులకు తిరిగి వెళ్లటం జరగదు’ - 100 రోజులకు చేరిన హిజాబ్ నిరసనలు
- రచయిత, పర్హం ఘోబాడి
- హోదా, బీబీసీ పర్షియన్
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అక్కడి పీఠాల్ని కదిలించాయి. 100 రోజులకు చేరిన ఈ నిరసనల్లో ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
69 మంది పిల్లలతో సహా 500 మందికి పైగా నిరసనకారులు మరణించారని మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ (హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ) తెలిపింది.
ఇద్దరు నిరసనకారులను ప్రభుత్వం ఉరితీసింది. మరో 26 మంది ఉరికంబం ఎక్కనున్నారు.
వీరిపై విచారణలన్నీ బూటకమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభివర్ణించింది.
గతంలోనూ ఇరాన్‌ను నిరసనలు అతలాకుతలం చేశాయి. 2017 నుంచి 2018 వరకు ఒకసారి, 2019 నవంబర్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.
ప్రస్తుత నిరసనలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ప్రజలంతా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ నిరసనల్లో "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" అనే నినాదాలతో ముందుకెళుతున్నారు.
నిరసనకారులతో చేయి కలిపిన సెలబ్రెటీలు..
కొందరు ఇరానియన్ సెలబ్రెటీలు ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అది వారి అరెస్టులకు, బహిష్కరణలకు కూడా దారితీసింది.
ఒక యువ నిరసనకారుడికి ఉరిశిక్ష పడింది. దానిని ఖండించినందుకు ఇరాన్ నటి తరనేహ్ అలిదూస్తీని ఎవిన్ జైలులో వేశారు.
గతంలో హిజాబ్ నిరసనకారులతో కలిసి ప్లకార్డు పట్టుకుని ఉన్న తన ఫోటోను తరనేహ్ విడుదల చేశారు.
‘‘నేను తరనేహ్‌తో నాలుగు చిత్రాలలో పనిచేశాను. ఇప్పుడు తన తోటి దేశస్తులకు మద్దతు ఇచ్చినందుకు, అన్యాయంగా విధించిన శిక్షలను వ్యతిరేకించినందుకు ఆమె జైలులో ఉన్నారు" అని ఆస్కార్ అవార్డు పొందిన ''ది సేల్స్‌మన్'' చిత్ర దర్శకులు అస్గర్ ఫర్హాది తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు.
"అలాంటి మద్దతు చూపడం నేరమైతే, ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు కూడా నేరస్తులే" అని ఫర్హాదీ స్పష్టంచేశారు.
దేశం విడిచిపెట్టిన మరో ప్రముఖ ఇరానియన్ నటి పెగా అహంగరాణి బీబీసీ పర్షియన్‌తో మాట్లాడారు.
"రెండు వైపులా స్పందనలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వ అణిచివేత, దానికి సినీ పరిశ్రమ ప్రతిస్పందన రెండూ బలంగా సాగుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబరు 16న ఇరాన్ మొరాలిటీ పోలీసుల కస్టడీలో మరణించిన కుర్దిష్ ఇరానియన్ మహిళ గురించి ప్రస్తావిస్తూ ‘‘మాసా అమీనీకంటే ముందు ఉన్న కాలానికి ఇరాన్ ఇక తిరిగి వెళ్లటానికి వీల్లేదు" అని పేర్కొన్నారు.
దుబాయ్‌లో నివసిస్తున్న ఇరాన్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులలో ఒకరైన అలీ కరీమీ కూడా ఈ నిరసనలకు మద్దతు తెలిపారు.
ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు తనను చంపేస్తామని బెదిరించారని, చివరికి అమెరికాకు వెళ్లేలా చేశారని చెప్పారు.
కరీమీకి ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి నలభై లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇరాన్ పాలనపై బహిరంగంగా విమర్శించే వారిలో కరీమీ ఒకరు.
మరో ఇరానియన్ ఫుట్‌బాల్ ఐకాన్ అలీ డేయి ఆందోళనలకు మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఆభరణాల దుకాణాన్ని, రెస్టారెంట్‌ను ఇరాన్ పోలీసులు మూసివేశారు.
అప్పట్లో వాడిన మోలోటోవ్ కాక్‌టెయిల్‌లు ప్రస్తుత నిరసనల్లో కూడా కనిపిస్తున్నాయి.
ఇవి బసిజ్ మిలీషియా, హవ్జా స్థావరాలపై లేదా షియా ముస్లిం మతాధికారుల మతపరమైన పాఠశాలలపై ప్రయోగించేవారు.
కొత్త రకం నిరసనలతో దూసుకెళుతున్న ''జనరేషన్ జడ్''
ఇరాన్ జనరేషన్ జడ్ ఈ నిరసనల్లో ముందుంది. కఠినమైన మతపరమైన నియమాలను ధిక్కరించడం, హిజాబ్‌లను దహనం చేయటం వంటి కొత్త పోకడలతో దూసుకెళుతున్నారు.
యువతలో మరొక కొత్త నిరసన పద్దతి బయటికొచ్చింది. దీన్నే "తలపాగా పడగొట్టం (టర్బన్ టాసింగ్)" అని పిలుస్తున్నారు. అంటే షియా ముస్లిం మతాధికారుల తలపాగాను దొంగచాటుగా పడగొట్టి, పారిపోతున్నారు.
అర్షియా ఎమామ్‌ఘోలిజాదే అనే 16 ఏళ్ల బాలుడు గత నెలలో వాయువ్య నగరం తబ్రిజ్‌లో ఇలా ‘టర్బన్ టాసింగ్’ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
దీంతో ఆ బాలుడిని 10 రోజుల పాటు నిర్భందించి, వదిలేశారు. రెండు రోజుల తర్వాత ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులో బాలుడిపై ప్రవర్తించిన తీరుపై కుటుంబం ఆరోపణలు గుప్పించింది.
''నిర్బంధ సమయంలో అర్షియాను లాఠీలతో కొట్టారు. తెలియని మాత్రలు ఇచ్చారు'' అని బాలుడి కుటుంబానికి చెందిన వారు బీబీసీ పర్షియన్‌తో చెప్పారు.
కస్టడీలో మరణించిన లేదా హత్యకు గురైన వారి మృతదేహాలను కూడా ఇరాన్ అధికారులు పావులుగా వాడుకుంటున్నారు. బాధిత కుటుంబాలు గొంతెత్తకుండా ఉండాలని షరతులు పెడుతున్నారు.
అలాంటి ఒత్తిడికి భయపడి ఓ వ్యక్తి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడి మృతదేహాన్ని దొంగిలించి గంటల తరబడి ఊరంతా తిప్పాడని బీబీసీ పర్షియన్‌కు కొందరు తెలిపారు.
నవంబర్ 29న ఇరాన్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టడంతో బందర్ అంజలీ నార్త్ సిటీలో 27 ఏళ్ల మెహ్రాన్ సమక్ కారు హారన్ మోగిస్తూ సంబురాలు చేసుకున్నాడు. అతడిని కాల్చి చంపేశారు.
ఇక మరో కుటుంబం వారి 23 ఏళ్ల కుమారుడు హమద్ సలాషూర్ శరీరంపై దారుణ చిత్రహింసల గాయాలను చూసి నిశ్చేష్టులయ్యారు.
హమద్ కస్టడీలో మరణించగా అతని స్వస్థలానికి 18 మైళ్ల (30 కిలోమీటర్ల) దూరంలో పాతిపెట్టారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని వెలికితీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆందోళన చేస్తే చిత్రహింసలు, ఉరిశిక్షలు
జాతీయ భద్రతా అభియోగాలపై దోషులుగా తేలడంతో ఇద్దరు ఆందోళనకారులను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
అంతేకాదు మరణశిక్ష పడిన చాలా మంది తమను హింసించారని చెప్పారు.
మరణశిక్ష పడిన కుర్దిష్-ఇరానియన్ ర్యాపర్ సమన్ యాసిన్ మంగళవారం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుర్దిస్తాన్ హ్యూమన్ రైట్స్ నెట్‌వర్క్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
నిర్బంధంలో ఉన్నప్పుడు యాసిన్‌ను హింసించారని హక్కుల సంఘం గతంలో ఆరోపించింది.
బీబీసీ పర్షియన్‌కు అందిన ఓ ఆడియో ఫైల్‌లో బాడీబిల్డర్ సహంద్ నూర్మొహమ్మద్జాదే (26) జైలులో తనను మరణశిక్షల రిహార్సల్స్‌తో (మాక్ ఎగ్జిక్యూషన్) హింసించారని ఆరోపించారు.
మరోవైపు నూర్మొహమ్మద్జాదే మీద దేవునిపై శత్రుత్వం (ఎనిమటీ అగెనెస్ట్ గాడ్) అభియోగాలు మోపింది ప్రభుత్వం. అంటే ఇరాన్ చట్టం ప్రకారం ఆయుధంతో ప్రజలకు అభద్రతను సృష్టించడం.
దోషిగా తేలిన తర్వాత నవంబర్‌లో ఆయనకు మరణశిక్ష విధించారు.
సెప్టెంబరు 23న టెహ్రాన్‌లో జరిగిన నిరసన సందర్భంగా రైలింగ్‌లను కూల్చివేసి, హైవేపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారని నూర్మొహమ్మద్జాదేపై ఆరోపణలు వచ్చాయి. దానిని ఆయన ఖండించారు.
జైలు నిర్బంధంలో ఉన్న ఓ రేడియాలజిస్ట్ ఎక్స్-రే చిత్రాలను బీబీసీ పర్షియన్ సంపాదించింది. అందులో ఆయన మూడు పక్కటెముకలు విరిగిపోయి, ఊపిరితిత్తుల్లోకి గుచ్చుకున్నట్లు వెల్లడైంది.
డాక్టర్ హమీద్ ఘరే-హసన్లౌ "భూమిపై అవినీతి (కరప్షన్ ఆన్ ఎర్త్)" అభియోగాల కింద దోషిగా తేలారు. ఈ నేరానికి మరణశిక్ష విధించబడుతుంది.
నేరాన్ని అంగీకరించడం కోసం డాక్టర్ ఘరే-హసన్‌లౌను చిత్రహింసలు పెట్టారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కి విశ్వసనీయ సమాచారం అందింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’
- చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)