You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యూబాలో నిరసనలు: ‘ఇక మేం సహించలేం.. మాకు ఆహారం లేదు.. స్వేచ్ఛ లేదు.. మమ్మల్ని బతకనివ్వరు’
క్యూబాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది నిరసనకారులు దేశ రాజధాని హవానాతో పాటు పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
కమ్యూనిస్ట్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ 'నియంతృత్వం నశించాలి' అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు.
నిరసనకారులను భద్రతా దళాలు నిర్బంధించడంతో పాటు కొంతమందిని గాయపరిచినట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు, పౌర స్వేచ్ఛపై ఆంక్షలు, కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం పట్ల క్యూబా ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.
క్యూబాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆదివారం క్యూబాలో కొత్తగా 7000 కోవిడ్ కేసులు నమోదు కాగా, 47మంది మరణించారు.
గతేడాది క్యూబా ఆర్థిక వ్యవస్థ 11శాతం క్షీణించింది. గత 3 దశాబ్దాలతో పోలిస్తే ఇది అత్యంత దారుణమైనది. కోవిడ్ మహమ్మారితో పాటు అమెరికా విధించిన ఆంక్షలు ఈ పరిస్థితికి దారి తీశాయి.
ఈ నిరసనల గురించి క్యూబా అధ్యక్షుడు మిగుల్ దియాజ్ కానెల్ మాట్లాడుతూ "దేశాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా నియమించిన కిరాయి సైనికులు రెచ్చగొడుతున్న చర్య" అని అన్నారు. వీధుల్లోకి వచ్చేందుకు వారికి ఆదేశాలు ఇచ్చారని జాతిని ఉద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన 1959లో చోటు చేసుకున్న తిరుగుబాటు తర్వాత క్యూబాలో దశాబ్దాల తరబడి నెలకొన్న కమ్యూనిస్ట్ పాలనను గుర్తు చేశారు.
ఈ ప్రసంగం విన్న తర్వాత వేలాది మంది ప్రభుత్వ మద్దతుదారులు కూడా వీధుల్లోకి వచ్చారు.
"క్యూబాలో పోరాటానికి పిలుపునివ్వడం పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కును మేము సమర్ధిస్తాం. ప్రజలంతా సంయమనంతో వ్యవహరించి హింసను తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాం" అని లాటిన్ అమెరికా దౌత్యవేత్త జూలీ చుంగ్ ట్వీట్ చేశారు.
ప్రజలు వ్యవస్థలో మార్పు కావాలంటూ గొంతెత్తారు. తమ నిరసనను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
'ఇక మేం సహించలేం. మాకు ఆహారం లేదు, వైద్యం, మందులు లేవు. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు. వారు మమ్మల్ని బతకనివ్వరు. మేం అలసిపోయాం' అని అలెజాండ్రో అనే నిరసనకారుడు బీబీసీకి చెప్పారు.
కొన్నిచోట్ల ప్రజలు పోలీసుల కార్లపై తిరగబడటం, ప్రభుత్వం ఆధీనంలోని దుకాణాలను దోచుకోవడం వంటివి సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ప్రజలు ప్రాథమిక అవసరాల వస్తువులను కొనేందుకు ఈ దుకాణాలే ఆధారం. కానీ ఇక్కడున్న అధిక ధరలు ప్రజల్ని వెక్కిరిస్తున్నాయి.
విశ్లేషణ: ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఈ నిరసనలు నిదర్శనం
వనేస బుష్స్క్లూటర్ , లాటిన్ అమెరికా, కరీబియన్ ఎడిటర్, బీబీసీ న్యూస్
వీధుల్లోకి వచ్చిన నిరసనకారుల గుంపులు ఎక్కువగా లేనప్పటికీ, దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడాన్ని చిన్న విషయంగా చూడడానికి వీలు లేదు.
"స్వేచ్ఛ కావాలి, కమ్యూనిజం నశించాలి" లాంటి నినాదాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి చేసేవాటిలా కనిపించవచ్చు. కానీ కమ్యూనిస్ట్ పాలన ఉన్న దేశాల్లో ఇలాంటి నినాదాలు సులభంగా జైలులోకి పంపిస్తాయి.
అయినప్పటికీ, అధికారులు ప్రజలను సులభంగా గుర్తు పట్టగలిగే చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
మరోవైపు ఈ నిరసనల వీడియో ఫుటేజీని నిరసనకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అసమ్మతిని దాచిపెట్టలేకపోతోంది.
క్యూబా విదేశాంగ మంత్రి.. "ఈ వీధులు విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రోవి" అంటూ కొంతమంది ప్రభుత్వ మద్దతుదారులు నినాదాలు చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు స్పందిస్తూ, నిరసనకారులు ప్రదర్శనలతో కూడిన వీడియోలతో సమాధానం చెప్పారు.
క్యూబా ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది. కోవిడ్ మహమ్మారి తెచ్చిన నిబంధనలతో ఆ దేశ పర్యటక రంగం బాగా దెబ్బతిన్నది.
క్యూబా నుంచి ఎగుమతి అయ్యే పంచదార కూడా దేశానికి మంచి ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. కానీ, ఈ సంవత్సరం అనుకున్నంతగా దిగుబడి రాలేదు.
ప్రభుత్వ విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా పడిపోవడంతో, దేశంలో కొరతగా ఉన్న సరుకులను కొనుక్కునేందుకు వీలు కుదరలేదు.
మరోవైపు, ఆహారం కోసం క్యూలు కట్టేవారు పెరుగుతున్నారు. గంటల కొద్దీ కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.
కొంత మంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శనల్లో 1950ల నాటి విప్లవగీతాలను పాడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)