You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యూబా: ఫిడెల్ కాస్ట్రో కుమారుడి ‘ఆత్మహత్య’
క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ ఏంజెల్ కాస్ట్రో దియాజ్-బాలార్ట్ హవానాలో ఆత్మహత్య చేసుకున్నారని క్యూబా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆయన వయసు 68 సంవత్సరాలు.
ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు. దానికి ముందు ఆయన తీవ్ర నిస్పృహలో కూరుకుపోయి ఉన్నారని చెప్తున్నారు.
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ పెద్ద కొడుకు ఫిడెల్ ఏంజెల్ కాస్ట్రో దియాజ్-బాలార్ట్. ఆయనను ‘‘ఫిడెలిటో’’ అని కూడా జనం పిలుస్తారు. ఫిడెల్ క్యాస్ట్రో 2016 నవంబర్‌లో చనిపోయారు.
కాస్ట్రో దియాజ్-బాలార్ట్ మాజీ సోవియట్ యూనియన్‌లో శిక్షణ పొంది అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేశారు.
‘‘ఫిడెల్ ఏంజెల్ కాస్ట్రో దియాజ్-బాలార్ట్ తీవ్ర నిస్పృహలో ఉండటం వల్ల వైద్యుల బృందం ఆయనకు కొన్ని నెలల పాటు చికిత్స అందించింది. ఆయన ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు’’ అని క్యూబా అధికారిక వార్తాపత్రిక గ్రాన్మా కథనం తెలిపింది.
ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారని, ఆ తర్వాత కొన్ని నెలల నుంచి ఔట్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది.
కాస్ట్రో దియాజ్-బాలార్ట్ చనిపోయేనాటికి క్యూబా ప్రభుత్వ మండలికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
‘ఫిడిలెటో’
ఫిడెల్ క్యాస్ట్రో, ఆయన తొలి భార్య మిర్తా దియాజ్-బాలార్ట్ కుమారుడు కాస్ట్రో దియాజ్-బాలార్ట్.
మిర్తా దియాజ్-బాలార్ట్ విప్లవానికి ముందు క్యూబా ప్రముఖ రాజకీయవేత్త కుమార్తె. ఫిడెల్, మిర్తాల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.
మిర్తా కుటుంబం విప్లవ కాలంలో అమెరికా వలసవెళ్లింది. ఆమె తమ కుమారుడు కాస్ట్రో దియాజ్-బాలార్ట్‌ను క్యూబాలో తన తండ్రి ఫిడెల్‌ను కలవటానికి పంపించారు. అతడు మళ్లీ తల్లి వద్దకు తిరిగి వెళ్లలేదు.
ఫ్లోరిడాలో గల క్యాస్ట్రో వ్యతిరేక వలస సమాజంలో అతడి తల్లి కుటుంబం ప్రముఖ స్థానం ఆక్రమించింది. ప్రస్తుత కాంగ్రెస్ (పార్లమెంట్) సభ్యుడు మారియో దియాజ్-బాలార్ట్ వారిలో ఒకరు.
కాస్ట్రో దియాజ్-బాలార్ట్ తన తండ్రిని పోలివుండటంతో ‘ఫిడెలిటో’ అని జనం పిలిచేవారు. అంటే ‘చిన్నారి ఫిడెల్’ అని అర్థం. ఆయన 1980-1992 మధ్య క్యూబా అణు కార్యక్రమానికి సారథ్యం వహించారు.
ఆ తర్వాత ఆయన పలు పుస్తకాలు రాశారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు అంతర్జాతీయ విద్యా సంబంధ కార్యక్రమాల్లో క్యూబా ప్రతినిధిగా పాల్గొన్నారు.
ఆయన అంత్యక్రియలను ఆయన కుటుంబం నిర్వహిస్తుందని టెలివిజన్ పేర్కొంది. అంతకు మించిన వివరాలు ఇవ్వలేదు.
కాస్ట్రో దియాజ్-బాలార్ట్ తండ్రి ఫిడెల్ కాస్ట్రో విప్లవ నాయకుడు, ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగిన రాజకీయ నేత. ఆయన 90 ఏళ్ల వయసులో 2016లో చనిపోయారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)