You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్: ‘రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. చేసుకుంటే చేసుకోని.. భయపడేది లేదు’
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ మద్యం కేసులో తన కుమార్తె, తెలంగాణ ఎంఎల్‌సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు. చేసుకుంటే చేసుకోని. అందర్నీ వేధిస్తున్నారు. భయపడేది లేదు. పోరాటం వదిలేది లేదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. మహా అయితే ఏం చేస్తారు? జైలుకు పంపుతారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారు. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలి’’ అని ముఖ్యమత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం.
దిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన (గురువారం నాడు) తమ మందు విచారణకు హాజరు కావలసిందిగా కేసీఆర్ కుమార్తె, ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 8వ తేదీన సమన్లు జారీ చేసింది.
కవితకు స్నేహితుడిగా భావిస్తున్న హైదరాబాదీ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. ఆయన దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బినామీగా ఉన్నారని అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఎంఎల్‌సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసుల మీద కవిత ‘తెలంగాణ తల వంచదు’ అంటూ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
చట్టానికి కట్టుబడ్డ పౌరురాలిగా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. అయితే, మార్చి 10న దిల్లీలో ధర్నాతో పాటు, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున.. ఈడీ విచారణకు మార్చి 11వ తేదీన హాజరవుతానని చెప్పారు.
ఆమె శుక్రవారం నాడు దిల్లీలో చేపట్టిన ఒక రోజు దీక్ష సాయంత్రానికి ముగిసింది. శనివారం నాడు ఈడీ ముందు హాజరు కాబోతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అక్కసుతోనే బీజేపీ కుట్రలు: కేసీఆర్
తెలంగాణ ప్రగతిని బీజేపీ పార్టీ ఓరుస్తలేదన్నారు కేసీఆర్.
"తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ పార్టీ ఓర్వలేకపోతున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతకాని తనం బయటపడుతుందనే అక్కసుతో అనేక కుట్రలకు బీజేపీ పాల్పడుతున్నది’’ అని ఆయన విమర్శించారు.
‘‘టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తున్నది. ఇప్పటికే మన పార్టీ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నది. బీజేపీ వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతాం. ఎదుర్కొంటాం. ఈ దేశం నుండి బీజేపీ పార్టీని పారద్రోలేవరకు మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు కేసీఆర్.
‘‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ పది గ్రామాలను యూనిట్‌గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి’’ అని పిలుపునిచ్చారు.
‘డిసెంబర్ నెలలోనే ఎన్నికలు’
డిసెంబర్ నెలలోనే ఎన్నికలుంటాయని కేసీఆర్ అన్నారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు.
‘‘బీజేపీ సభాలకు కౌంటర్ సభలు పెట్టండి. బీజేపీ విమర్శలను బలంగా తిప్పికోట్టండి. బీజేపీ ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టండి’’ అని కీసీఆర్ అన్నారు.
కేసుల విషయంలో బయపడవద్దని, చర్యకు ప్రతి చర్య ఉంటుఉందని ముఖ్యమంత్రి చెప్పినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
‘పేదల కోసం కష్ట పడుతున్న కేసీఆర్ పై కక్ష గట్టారు. బెదిరింపులకు భయపడబోం. చర్యకు ప్రతిచర్య తప్పదు’ అని సీఎం చెప్పినట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
‘‘కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉంది. దర్యాప్తు సంస్థలతో వేదించే విధానం ఎంచుకుంది. మంత్రుల నుంచి ఇప్పుడు కవిత వరకు వచ్చింది. ఏం చేస్తుందో చేసుకోనివ్వండి’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు మంత్రులు చెప్పారు.
‘‘కేంద్రంపై మన రాజకీయ పోరాటం ఆపేది లేదు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు. సత్యం ధర్మం మనవైపు ఉంది. న్యాయపరంగానే మనం ఎదుర్కొందాం. ఎవరు భయపడవద్దు. బెదరొద్దు’’ అని కేసీఆర్ అన్నట్టు మంత్రులు వివరించారు.
ఇవి కూడా చదవండి
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)