You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గరిసెండా: పీసా మాదిరిగా ఇళ్ల మధ్య ఒరిగిపోతున్న 154 అడుగుల టవర్
- రచయిత, క్రిస్టీ కూనీ
- హోదా, బీబీసీ న్యూస్
పీసా టవర్‌ను పోలిన ఇటలీలోని బోలోగ్నాలో ఉన్న మధ్యయుగపు టవర్ ఒకటి కూలిపోతుందనే భయంతో సీల్ వేశారు అధికారులు.
12వ శతాబ్ధంలో నిర్మించిన ఈ గరిసెండా టవర్ కూలిపోతే శిథిలాలను తొలగించేందుకు వీలుగా చుట్టూ 5 మీటర్ల (16 అడుగులు) ఎత్తయిన బ్యారియర్ నిర్మించడం ప్రారంభించారు.
154 అడుగుల ఎత్తు ఉన్న ఈ టవర్ నాలుగు-డిగ్రీల కోణంలో వంగి ఉంది, అయితే గతంలో కంటే ఈ టవర్ ఎక్కువగా వాలడాన్ని అధికారులు గుర్తించారు.
దీంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని బోలోగ్నా నగర కౌన్సిల్ ప్రకటించింది.
బోలోగ్నాలో గరిసెండా, అసినెల్లి టవర్లు ప్రసిద్ధి గాంచాయి. అసినెల్లి టవర్ గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో, వాలుగా ఉంటుంది.
పర్యాటకులు ఎక్కడానికి అసినెల్లి తెరుస్తుంటారు. ఈ రెండు నిర్మాణాలను 1109 నుంచి 1119 సంవత్సరాల మధ్య నిర్మించారు.
అయితే 14వ శతాబ్దంలో గరిసెండా వంగిపోవడం ప్రారంభం కావడంతో, దాని ఎత్తు తగ్గించారు. 1321లో డాంటే రచించిన 'ది డివైన్ కామెడీ'లో ఈ టవర్ గురించి ప్రస్తావించారు.
ఇది ఛాలెంజింగ్ ప్రాజెక్టు: బోలోగ్నా కౌన్సిల్
గరిసెండా టవర్‌లో మార్పులు కనిపించడంతో ఇటీవల తనిఖీలు చేపట్టారు అధికారులు. టవర్ వంగిందని నిర్దరణ కావడంతో ఆ ప్రాంతాన్ని అక్టోబర్‌లో మూసివేశారు.
అనంతరం టవర్‌ను సంరక్షించేందుకు సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ చేపట్టింది కౌన్సిల్. దీన్ని మొదటి దశగా తెలిపింది.
టవర్ ఒకవేళ కూలిపోయినా శిథిలాలు చుట్టుపక్కల భవనాలపై పడకుండా అక్కడ నిర్మించబోయే బ్యారియర్ ప్రజలను కాపాడుతుందని కౌన్సిల్ పేర్కొంది.
అంతేకాదు టవర్ చుట్టూ లోహపు వలలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
బ్యారియర్ నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తవుతుంది. అయితే పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు టవర్, దాని కింద ఉన్న ప్లాజాను మూసివేస్తారని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు దాదాపు 39 కోట్ల యూరోలు ఖర్చవుతుందని అంచనా. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించి డబ్బు సేకరిస్తోంది బోలోగ్నా సిటీ. ఈ ప్రాజెక్ట్ ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది బోలోగ్నా.
ఇవి కూడా చదవండి
- అమెరికాలో తీవ్ర నేరాల కింద అరెస్టైన సత్తారు వెంకటేశ్‌రెడ్డికి, వైసీపీకి సంబంధం ఏంటి, టీడీపీ ఏమంటోంది?
- గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమ్మీద ఇంకెన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?
- హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత
- దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)