మనిషికి పంది కిడ్నీ అమర్చిన రెండు నెలల్లోనే విషాదం

జన్యుపరమైన మార్పులు చేసిన పంది కిడ్నీ అమర్చిన మొదటి వ్యక్తి మరణించారు.

ఆపరేషన్ చేసిన సుమారు రెండు నెలల తర్వాత రిచర్డ్ రిక్‌ స్లేమ్యాన్ మరణించారని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు.

రిచర్డ్ స్లేమ్యాన్ వయసు 62 ఏళ్లు. మార్చిలో ఆపరేషన్‌ చేయించుకోవడానికి ముందు రిచర్డ్ స్లేమ్యాన్ మూత్రపిండాల వ్యాధి ముదిరి చివరి దశలో ఉంది.

స్లేమ్యాన్ మరణానికి కిడ్నీ మార్పిడే కారణమని అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ తెలిపింది.

జన్యుపరంగా మార్పులు చేసిన పందుల ఇతర అవయవాలను మనుషులకు అమర్చిన ఆపరేషన్లు గతంలో విఫలమయ్యాయి.

అందుకే స్లేమ్యాన్‌ ఆపరేషన్ ఆ దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.

కిడ్నీ వ్యాధితో పాటు, స్లేమ్యాన్ టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు.

2018లో ఆయనకు మనిషి కిడ్నీ అమర్చారు. ఐదేళ్ల తర్వాత క్రమక్రమంగా, అది పని చేయడం మానేసింది.

మార్చి 16న పంది కిడ్నీ అమర్చారు. కొత్త అవయవం బాగా పని చేస్తుందని చెప్పడంతో ఆయనకు డయాలసిస్ అవసరం లేదని వైద్యులు నిర్ధరించారు.

ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ప్రపంచంలో తొలిసారిగా 1954లో జరిగిన కిడ్నీ మార్పిడి సర్జరీని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి అధ్యయనం చేసింది.

పంది కిడ్నీకి జన్యు మార్పిడి చేసిన ఇ జెనిసిస్ సంస్థతో కలిసి ఐదేళ్లు పరిశోధన నిర్వహించింది. ఈ ప్రక్రియను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి ప్రయోగాత్మక చికిత్స అందించేందుకు అవసరమైన కారుణ్యపరమైన అనుమతులను మంజూరు చేసింది.

"స్లేమ్యాన్ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అవయవ మార్పిడి రోగులకు ఆశాజ్యోతి. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ముందుకు సాగేందుకు ఆయన చూపిన నమ్మకానికి, చికిత్సకు ఆయన అంగీకరించినందుకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని మసాచుసెట్స్ హాస్పిటల్ తెలిపింది.

స్లేమ్యాన్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపింది.

జెనోట్రాన్స్‌ప్లాంటేషన్..

జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే జీవకణాలు, కణజాలాలు లేదా అవయవాలను ఒక జాతి జీవి నుంచి మరో జాతి జీవికి మార్చడం.

స్లేమ్యాన్ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన బంధువులు అన్నారు.

"అవయవ మార్పిడి అవసరమయ్యే వేలాది మందిలో ఆశ కల్పించడమే రిక్ ఈ ప్రక్రియకు ఒప్పుకోవడానికి ఒక ముఖ్య కారణం" అని వారు అన్నారు.

"రిక్ ఆ లక్ష్యాన్ని సాధించారు. ఆయన నమ్మకం, ఆశావాదం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. రిక్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. హాస్యచతురత కలిగిన వ్యక్తి" అని తెలిపారు.

జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీ అమర్చిన మొదటి వ్యక్తి స్లేమ్యాన్ అయినా, మార్పిడి చేసిన మొదటి పంది అవయవం ఇది కాదు.

గతంలో ఇద్దరు రోగులకు పంది గుండెను అమర్చగా, కొన్ని వారాల తర్వాత ఆ ఇద్దరు రోగులు మరణించడంతో ఆ విధానాలు విజయవంతం కాలేదు.

ఒక కేసులో, పేషెంట్ రోగ నిరోధక వ్యవస్థ కొత్తగా అమర్చిన అవయవాన్ని తిరస్కరించినట్లు చెబుతున్నా, అవయవ మార్పిడిలో ఇది సాధారణంగా ఉండే ప్రమాదమేనని డాక్టర్లు తెలిపారు.

అమెరికాలో ఓ స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం లక్ష మంది అమెరికన్లకు అవయవ మార్పిడి చికిత్స అవసరం. ఆ దేశంలో ప్రతి రోజూ 17 మంది అవయవాల కోసం ఎదురు చూస్తూ మరణిస్తున్నారు. వీరిలో చాలామంది కిడ్నీ అవసరమైన రోగులే.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)