కశ్మీర్: ఈఫిల్ టవర్‌కన్నా ఎత్తైన ఈ రైలువంతెన ఇక్కడి ప్రజల జీవితాలను మార్చేస్తుందా?

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కశ్మీర్‌ లోయ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే రైలు వంతెన నిర్మాణం పూర్తయింది.

జమ్మూలోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై ఈ వంతెనను పూర్తి చేయడానికి రైల్వేకి 20 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంది. త్వరలో ఈ వంతెనపై నుంచి మొదటి రైలు పరుగులు తీయనుంది. బక్కల్, కౌరీ ప్రాంతాల మధ్య ఈ రైలు తిరగనుంది.

అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయేలా తలపెట్టిన 272 కిలోమీటర్ల రైల్వే లైన్‌లో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. జమ్మూ గుండా వెళ్లే ఈ రైలు మార్గం కశ్మీర్ లోయకు చేరుకుంటుంది.

శీతాకాలంలో భారీ హిమపాతం వల్ల జమ్మూ హైవేపై మంచు పేరుకుపోయి తరచూ కశ్మీర్ లోయకు వెళ్లే రహదారి మార్గం మూసుకుపోతుంటుంది.

ఈ కొత్త రైల్వే లైన్ సరిహద్దు ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.

'పొరుగు దేశాల వ్యూహాలు తిప్పికొట్టడానికి'

దశాబ్దాలుగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్‌ అంశం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు యుద్ధాలలో తలపడ్డాయి. ఇరు దేశాలూ కశ్మీర్‌ పూర్తిగా తమదే అని చెప్పుకుంటున్నాయి. కానీ దానిలో కొన్ని ప్రాంతాలపై మాత్రమే పట్టు సాధించాయి.

1989 నుంచి భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతం (కశ్మీర్)లో సాయుధ తిరుగుబాటు కారణంగా వేలమంది చనిపోయారు. అందుకే అక్కడ సైనిక బలగాల మోహరింపు భారీగా ఉంటుంది.

"ఆ వంతెన సరిహద్దు ప్రాంతాలకు ఏడాది పొడవునా సైనిక సిబ్బందిని, సామగ్రిని రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది" అని ఈ బ్రిడ్జిని నిర్మించిన ఇండియన్ రైల్వేస్ కాంట్రాక్టర్, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గిరిధర్ రాజగోపాలన్ అన్నారు.

పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో ‘‘పాకిస్తాన్, చైనాల వ్యూహాలను తిప్పి కొట్టడంలో కూడా ఈ వంతెన భారత్‌కు సహాయం చేస్తుంది’’ అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణురాలు శ్రుతి పండలై అన్నారు.

క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్ట్ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు స్థానికులు, ఈ రైలు మార్గం ఖచ్చితంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో సహాయ పడుతుందని, తమకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వం లోయపై మరింత నియంత్రణ సాధించేందుకు ఇది కూడా ఒక మార్గం అవుతుందనీ ఆందోళన వెలిబుచ్చారు.

2019లో జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను తొలగించి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా 50కి పైగా ఇతర హైవే, రైల్వేపవర్ ప్రాజెక్టులతో పాటుగా ఈ రైల్వే లైన్ కూడా నిర్మించింది.

కొన్నినెలల పాటు అక్కడ కఠినమైన భద్రతా చర్యలకు పూనుకోవడం ఆ ప్రాంతంలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. అప్పటి నుంచి కశ్మీర్‌ను భారత్‌లోని మిగిలిన ప్రాంతాలతో కలిపేందుకు ప్రభుత్వం అనేక పరిపాలనాపరమైన మార్పులను తీసుకొచ్చింది.

ఈ ప్రాంతం కోసం భారత్ సహజంగానే వ్యూహాత్మక లక్ష్యాలతో మార్గనిర్దేశం చేస్తోందని, అయితే స్థానిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పండలై సూచించారు.

2003లోనే ఆమోదం పొందినా..

చీనాబ్ వంతెన నిర్మాణం 2003లోనే ఆమోదం పొందింది. అయితే ఇక్కడ ఉన్న ప్రమాదకర నైసర్గిక స్వరూపం, భద్రతా సమస్యలు, కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగి చాలా సార్లు వాయిదా పడింది.

ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు వంతెన నిర్మాణ సమయంలో కాలినడకన, కంచర గాడిదలపైన అక్కడకు చేరుకునేవారు.

‘బాంబు దాడులు జరిగితే?’

హిమాలయాల పర్వత శ్రేణి భౌగోళిక, సాంకేతిక లక్షణాలు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావు. ఈ వంతెన భూకంప క్షేత్రంలో ఉంది. దీంతో భారతీయ రైల్వే విస్తృతమైన అధ్యయనాలను నిర్వహించాల్సి వచ్చింది. గంటకు 266 కిలోమీటర్ల వరకు గాలి వేగాన్ని తట్టుకోవడానికి ఈ వంతెన ఆకారాన్ని మార్చారు.

“ఇక్కడ సామగ్రి తరలింపు సవాల్‌తో కూడుకున్నది. చాలావరకూ వంతెన నిర్మాణ భాగాలను ఇక్కడే రూపొందించారు” అని రాజగోపాలన్ చెప్పారు.

ఓ వైపు ఇంజనీరింగ్ సమస్యలు ఉండగా మరోవైపు రైల్వేస్ ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్ నిర్మాణంగా చేపట్టాల్సి వచ్చింది. ఈ వంతెన 40 కేజీల పేలుడుని కూడా తట్టుకోగలదని, స్తంభాలు దెబ్బతిన్నప్పటికీ రైళ్లు తక్కువ వేగంతో తిరుగుతాయని ఆఫ్కాన్స్ పేర్కొంది.

'మా మార్కెట్ విస్తరిస్తుంది'

అన్ని వాతావరణాల్లో పనిచేసేలా కశ్మీర్ లోయకు రైలు సంధానత కల్పించడం వల్ల ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. శీతాకాలంలో కశ్మీర్ లోయకు వెళ్లే దారి సరిగా లేకపోవడం అక్కడ వ్యవసాయంపై ఆధారపడిన వ్యాపారాలకు ప్రధాన సమస్య.

థింక్-ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, పండ్ల సాగు చేసే 10 మంది కశ్మీరీలలో ఏడుగురి పంట కొనేవారు లేక కుళ్లిపోతోంది.

కశ్మీర్‌పై ఈ రైలు మార్గం చాలా ప్రభావం చూపిస్తుందని దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అతిపెద్ద శీతల గిడ్డంగి యజమాని ఉబైర్ షా అన్నారు.

ప్రస్తుతం ఆయన శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న చాలా రేగు పళ్లు, ఆపిల్స్.. హరియాణా, పంజాబ్, దిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని మార్కెట్‌ల వరకే చేరుకుంటాయి. కానీ ఈ కొత్త రైల్వే లైను పండ్ల రైతులను దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తుందని తద్వారా వారి ఆదాయం కూడా పెరుగుతుందని ఉబైర్ షా అభిప్రాయపడ్డారు

చివరి మైలు వరకూ మెరుగైన సంధానత లేకపోయినా, ఇప్పటికిప్పుడు అన్నీ సాధ్యమవుతాయయని ఆయన ఆశించడం లేదు.

“సమీప స్టేషన్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ముందుగా ఉత్పత్తులను మా వాహనంలో స్టేషన్‌కి పంపాలి, తర్వాత వాటిని వాహనంలో నుంచి దింపి, మళ్లీ రైలులోకి ఎక్కించాలి. ఈ పనంతా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. త్వరగా పాడైపోయే పదార్థాలను తక్కువ మోతాదులో పంపించాలి” అని షా అన్నారు.

ఈ ప్రాజెక్ట్ కశ్మీర్ పర్యటక ఆదాయాన్ని కూడా పెంచుతుందని షా భావిస్తున్నారు. కశ్మీర్‌లోని పర్యటక ప్రదేశాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇటీవల రాకపోకలు పెరిగాయి. జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌ల మధ్య డైరెక్ట్ ట్రైన్ చార్జీలు తక్కువగా ఉండటమే కాదు, ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. దీనివల్ల పర్యటకానికి మేలు జరుగుతుంది.

సవాళ్లూ ఉన్నాయి

కశ్మీర్‌లో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మిలిటెంట్ కార్యకలాపాలు కశ్మీర్ లోయ నుంచి ప్రశాంతంగా ఉండే జమ్మూ ప్రాంతానికి మారినట్లు కనిపిస్తోంది. ఇది ఆందోళన కలిగించేదే.

ఈ ఏడాది జూన్‌లో రియాసిలోని వంతెన సమీపంలో బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది హిందూ యాత్రికులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన మిలిటెంట్ దాడి అది. సైన్యం, పౌరులపై అనేక దాడులు జరిగాయి.

ఈ ఘటనలు ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు ఎంత దుర్బలంగా ఉన్నాయో మనకు గుర్తుచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)