పాకిస్తాన్ కేబుల్ కార్ ప్రమాదం: 900 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయిన మొత్తం 8 మందినీ కాపాడారు

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ న్యూస్

వాయువ్య పాకిస్తాన్‌లోని ఓ లోయపై కేబుల్ కార్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడారు.

స్కూలుకు వెళుతూ వారు కేబుల్ కార్‌లో చిక్కుకున్నారు. వారిలో చిన్నారులు, టీచర్లు ఉన్నారు.

మొదట ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా బలమైన గాలులు, చీకటి కారణంగా సహాయ కార్యక్రమాలు సజావుగా సాగలేదు. దాంతో స్థానికులే రంగంలోకి దిగి, ప్రాణాలకు తెగించి వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు.

వీరు కేబుల్ కార్‌లో స్కూలుకు వెళ్తుండగా ఒక తాడు తెగిపోయింది. దీంతో నేలకు 274 మీటర్ల( 900 అడుగుల) ఎత్తులో వీరు చిక్కుకుపోయారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌లోని బట్టగ్రామ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రపంచాన్నంతా తమ వైపు చూసేలా చేసింది వీరి స్కూల్ ప్రయాణం. చివరకు అందులో చిక్కుకున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో అలాయ్ లోయలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగింది. గాలిలో నిలిచిపోయిన కేబుల్ కార్‌ను చూసిన స్థానికులు లౌడ్ స్పీకర్ల సాయంతో అధికారులను అప్రమత్తం చేశారు.

‘‘దయచేసి మాకు ఎవరైనా సాయం చేయండి’’ అని కేబుల్ కార్‌లో చిక్కుకున్న వారిలో ఒకరైన గుల్ఫరాజ్ ఫోన్‌లో జీయో న్యూస్ చానల్‌తో ఇంతకుముందు చెప్పారు.

‘‘చిక్కుకుపోయిన పిల్లల వయసు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

హెడ్‌మాస్టర్ అలీ అస్గర్ ఖాన్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ- కేబుల్‌కారులో చిక్కుకుపోయిన పిల్లలు టీనేజీ వయసు వారని, వారంతా బట్టంగి పష్తో స్కూలులో చదువుకుంటున్నారని చెప్పారు.

ఇక్కడ స్కూల్‌కు వచ్చేందుకు దాదాపు 150 మంది పిల్లలు రోజూ ఇలాంటి ప్రమాదకర కేబుల్ కార్‌లు ఎక్కుతుంటారని స్థానిక టీచర్ ‘డాన్’ మీడియా సంస్థతో చెప్పారు. రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడమే దీనికి కారణమని వివరించారు.

అలాయ్ ఒక పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. ఇక్కడ గ్రామాలు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి.

ఉత్తర పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో రోడ్లు లేదా మౌలిక సదుపాయాలు పెద్దగా ఉండవు. ఒక పర్వత ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకునేందుకు చైర్‌కార్‌లనే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నీరు, ఇతర ఆహార పదార్థాల రవాణాకు ఇవే ఆధారం.

ప్రస్తుతం ప్రమాదానికి గురైన కేబుల్ కార్‌ను ప్రైవేటుగా స్థానికులే నడిపించుకుంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)