ఎండీహెచ్, ఎవరెస్ట్: ఈ భారతీయ కంపెనీల మసాలాల్లో క్యాన్సర్ కారకాలున్నాయా, అమెరికా వీటిపై ఎందుకు పరిశోధన చేపట్టింది?

క్యాన్సర్ కారక పెస్టిసైడ్స్ (పురుగు మందులు)ను కలిగి ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో రెండు భారతీయ మసాలా కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులపై యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ పరిశోధన చేపట్టింది.

భారత్‌కు చెందిన ఎండీహెచ్ కంపెనీ తయారు చేసిన మూడు మసాలా పౌడర్లను, ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఒక మసాలా అమ్మకాలను ఈ నెల ఆరంభంలో హాంకాంగ్ నిలిపివేసింది. ఈ మసాలాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అధిక మోతాదులో ఉందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీ ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందాయి.

తమ ఉత్పత్తులు తినడానికి సురక్షితమైనవని గతంలో ఎవరెస్ట్ కంపెనీ పేర్కొంది. ఎండీహెచ్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

‘‘ఎఫ్‌డీఏకు ఈ నివేదికల గురించి తెలిసింది. దీనికి సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరిస్తోంది’’ అని వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో ఎఫ్‌డీఏ అధికార ప్రతినిధి చెప్పారు.

చేపల కూర కోసం ఎవరెస్ట్ కంపెనీ తయారు చేసిన మసాలా మిక్స్‌లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు అధికంగా ఉన్నాయంటూ సింగపూర్ వాటిని వెనక్కి పంపించింది.

హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఈ రెండు కంపెనీల ఎగుమతుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఈ వారం మొదట్లో సుగంధద్రవ్యాల ఎగుమతులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రణ సంస్థ ‘‘స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా’’ తెలిపింది. ఆయా కంపెనీల ప్లాంట్లలో దర్యాప్తు మొదలైందని, నాణ్యత సమస్యలకు మూల కారణాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పింది.

ఈ రెండు కంపెనీల వెబ్‌సైట్లు శనివారం ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి.

పరిశ్రమల్లో ఇథిలీన్ ఆక్సైడ్‌ను అనేక రకాల ప్రయోజనాల కోసం వాడతారు. సుగంధ ద్రవ్యాల్లో కూడా దీన్ని జోడిస్తారు. ఈ రసాయనం మానవుల్లో క్యాన్సర్ కారకమని అమెరికా పర్యావరణ పరిరక్షణ (ఈపీఏ) సంస్థ చెప్పింది.

‘‘ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల లింఫోయిడ్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తుందని ఆధారాలు సూచిస్తున్నాయి’’ అని 2018లో ఈపీఏ పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీల స్పందన కోసం బీబీసీ వారిని సంప్రదించింది.

2019లో సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమయ్యానే భయాల నేపథ్యంలో అమెరికాలో ఎండీహెచ్ ఉత్పత్తులను కంపెనీ వెనక్కి తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)